YCP Kapu Leaders: శ్రీకాకుళం జిల్లాలో అధికార వైసీపీ నేతలు రూటు మార్చుతున్నారా? తమకు సరైన టైమ్ వచ్చిందని భావిస్తున్నారా? అదును చూసి దెబ్బ కొట్టేందుకు డిసైడ్ అయ్యారా? ఇందుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను వినియోగించుకోనున్నారా? తమ అసంతృప్తి వెళ్లగక్కేందుకు ఇదే మంచి తరుణమని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా నర్తు రామారావును హైకమాండ్ ప్రకటించింది. దీంతో మిగతా ఆశావహులు నీరుగారిపోయారు. ముఖ్యంగా తూర్పుకాపు సామాజికవర్గ నేతలకు హైకమాండ్ నిర్ణయం మింగుడు పడలేదు. దీంతో ఇక్కడ ఎన్నికలు అనివార్యంగా మార్చేయ్యాలని ప్లాన్ చేశారు. ఆర్థిక, అంగ బలం ఉన్న తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన అనెపు రామకృష్ణను బరిలో దించారు. అయితే హైకమాండ్ మాత్రం చాలా తేలికగా తీసుకుంది. ఇండిపెండెంట్ కదా ఎలాగోలా విత్ డ్రా చేయించాలని చూసింది. కానీ రామకృష్ణ ససేమిరా అనడంతో ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే ఆయన వెనుక తూర్పుకాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు ఉన్నారు. తెర వెనుక మాత్రం అధికార వైసీపీలోని తూర్పుకాపు నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో తూర్పుకాపు, వెలమ, కాళింగులు ప్రధాన కులాలుగా ఉన్నారు. పక్కన విజయనగరం జిల్లాలో మాత్రం తూర్పుకాపులే అధికం. అందుకే వైసీపీ హైకమాండ్ శ్రీకాకుళం జిల్లాను పరిగణలోకి తీసుకొని వెలమలకు ఒక మంత్రి పదవి కేటాయించారు. కాళింగులకు స్పీకర్ పదవి ఇచ్చారు. అటు మత్స్యకారుల కోటలో సీదిరి అప్పలరాజుకు కేబినెట్ లో చోటు కల్పించారు. కానీ కాపులకు మాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. దానిని పక్కన విజయనగరంలో ఉన్న బొత్స సత్యనారాయణను సాకుగా చూపుతున్నారు. అక్కడ ఇచ్చినందుకు శ్రీకాకుళంలో ఇవ్వలేదని సర్దిచెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీతో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ వంటి పోస్టులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తీరా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనలో మొండిచేయి చూపారు. యాదవ సామాజికవర్గానికి చెందిన నర్తు రామారావు పేరును ప్రకటించారు. ఇది తూర్పుకాపులకు ఆగ్రహం తెప్పించింది. అందరూ సమిష్టిగా రామక్రిష్ణను తెరపైకి తెచ్చి మద్దతు పలికారు. ఇది అధికార పార్టీని కలవరపరుస్తోంది.
2007 సీన్ రిపీట్ అవుతుందని వైసీపీ కలవరపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని సీనియర్ నాయకుడు గొర్లె హరిబాబునాయుడు ఆశించారు. కానీ నాటి మంత్రి ధర్మాన ప్రసాదరావు కళింగ కోమట్లకు చెందిన టంకాల బాబ్జీకి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇప్పించారు. హరిబాబునాయుడు సొంత సామాజికవర్గం తూర్పుకాపుల్లో ఆగ్రహం పెల్లుబికింది. హరిబాబునాయుడును స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దించారు. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ బలం ఉన్నా.. స్థానిక సంస్థల్లో తూర్పుకాపు ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చారు. హరిబాబునాయుడును గెలిపించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. మరోసారి అదే పరిస్థితి పునరావృతమవుతుందన్న బెంగ అధికార పార్టీని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
తాజాగా రాష్ట్ర తూర్పుకాపు సంఘం నాయకులు రంగంలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థి రామక్రిష్ణకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హరిబాబునాయుడు మాదిరిగా గెలిపించుకుంటామని ప్రతినబూనారు. తూర్పుకాపు సంఘం ప్రజాప్రతినిధులను కలిసి మద్దతు కూడగట్టేందుకు నిర్ణయించారు. జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 729. అందులో తూర్పుకాపు సామాజికవర్గానికి 196 ఓట్లు ఉన్నాయి. కాళింగ సామాజికవర్గానికి చెందినవి 106, వెలమ సామాజికవర్గానికి 93 ఓట్లు ఉన్నాయి. యాదవ సామాజికవర్గ ఓట్లు కేవలం 44 మాత్రమే. ఈ గణాంకాలే అధికార పార్టీలో కలవరం రేపుతున్నాయి. దాదాపు అన్ని మండలాల్లో స్థానిక తూర్పుకాపు సంఘాల ప్రతినిధులు యాక్టివ్ అవుతున్నారు. తమపై వివక్ష చూపుతున్న వైసీపీ హైకమాండ్ కు ఝలక్ ఇవ్వాలని భావిస్తున్నారు.