Pawan VS YCP: ఏపీలో అసలు సిసలు రాజకీయం ప్రారంభమైంది. తాను వెళుతున్న మార్గమిదేనంటూ పవన్ స్పష్టం చశారు. సుత్తి లేకుండా సుతిమెత్తగానే స్పష్టత ఇచ్చారు. అయితే సీఎం పదవి విషయంలో మాత్రం ఒక పెద్ద మనసుతో ఆలోచన చేశారు.పదవి అనేది తనంతట తానే వరించాలి.. కానీ దాని కోసం వెంపర్లాడకూడదని యధాలాపంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ లైన్ తీసుకునే ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. జనసేన హార్ట్ కోర్ ఫ్యాన్స్ తో పాటు కాపు సామాజికవర్గాన్ని దువ్వే ప్రయత్నాలు ప్రారంభించారు. పవన్ ను విఫల నేతగా చూపేందుకు ఆరాటపడుతున్నారు. నీలి మీడియా, పేటీఎం బ్యాచ్ అదే పనిగా ప్రచారం మొదలుపెట్టారు.
కుల రాజకీయాలు చేయకపోయినా..
అయితే ఏనాడు పవన్ కుల రాజకీయాలు చేయలేదు. కానీ దశాబ్దాలుగా రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా ఆ ముద్ర వేశారు. గత ఎన్నికల్లో పవన్ పోటీదారుడిగా ఉన్నా మాయమాటలు చెప్పి కాపులను జగన్ తన వైపు తిప్పుకున్నారు. అప్పట్లో పవన్ కంటే జగన్ నే కాపులు సమ్మోహన శక్తిగా ఊహించుకున్నారు. ఎన్నికల అనంతరం కాపులకు జగన్ తత్వం బోధపడింది. ఉన్న రిజర్వేషన్లు తీసేయ్యగా.. కొత్తగా ఎటువంటి అవకాశాలు లేకుండా పోయాయి. అసలు కాపుల ఉనికినే భరించలేని స్థితిలోకి జగన్ చేరుకున్నారు. అది కాపులకు గుణపాఠంగా మారింది. ఎన్నికల్లో పవన్ కు కాదని జగన్ కు సపోర్టు చేసినందుకు ఎంతగా మూల్యం చెల్లించుకోవాలో అంతగా చెల్లించుకున్నారు. ఇప్పుడు పవన్ వైపు యూటర్న్ అయ్యారు. ఆయన్ను దైవంగా కొలవడం ప్రారంభించారు.
విపక్షాల ఐక్యత కోసమే..
అయితే పవన్ తన బలాన్ని, ఏపీలో ఉన్న పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడారు. విపక్షాల మధ్య ఐక్యతకు దోహదపడేలా వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు వాటినే వైసీపీ హైప్ చేస్తోంది. కాపులు, బలిజలు, ఉప కులాలు తేల్చుకోండి అంటూ విష ప్రచారం మొదలుపెట్టింది.పవన్ మాదిరిగానే చంద్రబాబును మోయాలనే ఉత్సాహం ఉన్న వాళ్లు జనసేనలోనే ఉండొచ్చు. జనసేన కార్యకర్తలుగా టీడీపీ జెండాలు మోస్తూ ఊరేగవచ్చు అంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. పవన్ పార్టీలో ఉండడం వృథా. పవన్ ఆశయాలు, ఆకాంక్షలు నచ్చని వాళ్లు తమ దారి చూసుకోకుంటే మూల్యం తప్పదని హెచ్చరిస్తోంది. పవన్ నుంచి ఆయన్న అభిమానించే వర్గాలను విడగొట్టే కుట్రకు అధికార పార్టీ ఆజ్యం పోస్తోంది.
నమ్ముతారా?
కాపులు, బలిజలు నిజంగా యూటర్న్ తీసుకోగలరా? తమకు వైసీపీ సర్కారు చేసిన అన్యాయం గురించి మరిచిపోగలరా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోనీ చంద్రబాబు కాపులకు అన్యాయం చేశారు నిజమే. కానీ ఆయనిచ్చిన 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు నిలిపివేసినట్టు? కాపు నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎందుకు మరుగునపరిచినట్టు? విదేశీ విద్యకు ఎందుకు నిధులు నిలిపివేసినట్టు? కాపులపై బీసీ వర్గాలను ఎందుకు ఎగదోసినట్టు? ఈ ప్రశ్నలన్నీ కాపులు, అనుబంధ కులాల నుంచి వినిపిస్తున్నాయి. అందుకే పవన్ పై ఎటువంటి కుట్రలు చేసినా తాము నమ్మే స్థితిలో లేమంటున్నారు. చివరి వరకూ పవన్ తోనే నడుస్తామని ప్రతినబూనుతున్నారు.