Pawan Kalyan- YCP: రాజకీయాల్లో ఎవర్నీ తక్కువ అంచనా వేయకూడదు. గెలుపోటములను హేళన చేయకూడదు. నాడు రెండు సీట్లతో ప్రస్థానాన్నిప్రారంభించిన జనసంఘ్.. బీజేపీగా మారి ప్రస్తుతం కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించలేదా? రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. అటు గెలుపు.. ఇటు ఓటమి శాశ్వతం కాదు. కానీ ఇది తెలియని పార్టీలు, నాయకులు ఎగిరెగిరి పడుతుంటారు. చతికిలపడుతుంటారు. ఏపీలో కూడా ఇప్పుడు సేమ్ సిట్యువేషన్. అటు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ అంటే వైసీపీ సాధారణ కార్యకర్త నుంచి సీఎం జగన్ వరకూ ఒకరకమైన చుకలన భావం ఉంది. ముఖ్యంగా పవన్ గెలుపోటములపై హేళనగా మాట్లాడం వైసీపీలో రివాజుగా మారింది. అయితే ఈ క్రమంలో పవన్ గ్రాఫ్ పెంచుకుంటుండగా.. అనుచిత వ్యాఖ్యాలతో వైసీపీ నేతలు ప్రజల మధ్య చులకన అవుతున్నారు. కానీ వారికేదీ పట్టడం లేదు. ప్రజా మద్దతు తమకే ఉందని.. శాశ్వతంగా తమ వద్దే ఉండిపోతుందని భ్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ మద్దతిచ్చారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీచేశారు. ఒక్క స్థానానికే పరిమితమయ్యారు. పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. అయితే ఓడిపోయినంత మాత్రాన నువ్వు నాయకుడివి కావు. 175 స్థానాలకు 151 స్థానాలు సాధించాం కనుక మేమే లీడర్లమంటూ వైసీపీ నేతలు ఎగిరిపడుతున్నారు. వాస్తవానికి వైసీపీ గవర్నమెంట్ బాధ్యతలు తీసుకున్న తొలిరోజుల్లో అసలు జనసేన ఒక పార్టీయని గుర్తించడానికి కూడా వైసీపీ నేతలు ఇష్టపడలేదు. చాలా లైట్ తీసుకున్నారు. అయితే పవన్ మాత్రం జగన్ సర్కారుకు కొంచెం అవకాశమిచ్చారు. ఎప్పుడైతే వైసీపీ మూడేళ్ల పాలన పూర్తిచేసుకుందో అప్పటి నుంచే వైఫల్యాలను ఎండగట్టడం ప్రారంభించారు. కానీ విమర్శలను జీర్ణించుకోలేని వైసీపీ వాటకి నేరుగా సమాధానం చెప్పలేక పవన్ పై వ్యక్తిగత దాడినే అలవాటు చేసుకుంది. పర్సనల్ లైఫ్ ను టచ్ చేస్తూ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. విసిగి వేశారిపోయిన పవన్ వైసీపీ నేతలు మాదిరిగా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించేసరికి తట్టుకోలేకపోతున్నారు.

అయితే జనసేనతో మాటల యుద్ధ క్రమంలో వైసీపీ నేతల బేలతనం బయటపడుతోంది. అటు ప్రజలు కూడా వాస్తవాలను గుర్తించడం ప్రారంభించారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర గర్జనకు పిలుపునిస్తే.. పవన్ ఎందుకీ గర్జనల పేరిట ప్రశ్నలను సంధించారు. సహేతుకమైన, ప్రజోపయోగ, ప్రజా సమస్యలను పవన్ ప్రస్తావించారు. వాటికి అతీగతీలేదు. అటుతరువాత ఎదురుదాడి అస్త్రాన్ని సిద్ధం చేసుకున్న వైసీపీ విశాఖ ఎపిసోడ్ ను రక్తికట్టించింది. మరో కోడికత్తి డ్రామా తరహాలో కొన్ని నాటకాలను జనసేనను టార్గెట్ చేసుకుంటూ రూపొందించింది. కానీ అమలుచేయలేకపోయింది. అయితే పవన్ గ్రాఫ్ పెరగడానికి ముమ్మాటికీ వైసీపీయే కారణమైంది. పవన్ ను వెతుక్కుంటూ చంద్రబాబు వెళ్లారు. తటస్థులు సైతం జనసేనలో చేరేందుకు క్యూకడుతున్నారు. కాపు నేతలు పునరాలోచనలో పడ్డారు. అటు కేంద్ర పెద్దలు ఒక్కొక్కరుగా రాష్ట్రానికి వస్తున్నారు. నేషనల్ మీడియా సైతం జనసేనకు సపోర్టుగా కథనాలు వండి వార్చుతోంది. ఇలా జనసేన గ్రాఫ్ పెరగడానికి వైసీపీయే ఇతోధికంగా సాయం చేసింది.