Vemireddy Prabhakar Reddy: నెల్లూరులో మరో కీలక నేత వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? పార్టీపై అసంతృప్తితో ఉన్నారా? ఎంపీ టికెట్ ఇచ్చినా వద్దంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ మొండి చేయి చూపారు. నరసరావుపేట ఎంపీగా షిఫ్ట్ చేశారు. అనిల్ స్థానంలో ఎండి ఖలీల్ పేరును ప్రకటించారు. అనిల్ ఒత్తిడి మేరకు ఖలీల్ పేరు ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. ముందుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య పేరు నెల్లూరు సిటీ అభ్యర్థిగా వినిపించింది. కానీ అందుకు విరుద్ధంగా జగన్ నియామకం చేపట్టారు. ఈ నిర్ణయం నేతల అసంతృప్తికి కారణమవుతోంది.
అనిల్ అభ్యర్థిత్వాన్ని ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ వ్యతిరేకించారు. అటు అనిల్ కు రాజ్యసభ సభ్యుడు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డితో విభేదాలు ఉన్నాయి. నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఒకవేళ అనిల్ కు మరోసారి నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తే తాను ఎంపీగా పోటీ చేయనని వేంరెడ్డి తెగేసి చెప్పారు. మరోవైపు తన భార్యకు నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కోరారు. అయితే వేంరెడ్డి భార్యకు అవకాశం ఇస్తే తాను సహకరించని.. అటు నరసరావుపేట ఎంపీ సీటుకు సైతం పోటీ చేయనని అనిల్ తేల్చి చెప్పారు. ఎండి ఖలీల్ పేరును సిఫారసు చేశారు. దీంతో జగన్ అనిల్ ఒత్తిడి మేరకు ఖలీల్ పేరు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వేంరెడ్డి అసంతృప్తికి గురై అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
రెండు రోజుల కిందట నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి ఇన్చార్జి పేరును ప్రకటించారు. అప్పటినుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. వైసిపికి దూరంగా ఉంటానంటూ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చెన్నై వెళ్లిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వైసీపీ అగ్ర నేతలు వేంరెడ్డితో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన వెంట ఉన్న నేతలకు ఫోన్ చేసి ప్రభాకర్ రెడ్డి తో మాట్లాడాలని చూస్తున్నారు. కానీ ఇంతవరకు ఆయన లైన్ లోకి రాలేదు. దీంతో హై కమాండ్ పెద్దలకు కొత్త తలనొప్పి ప్రారంభమైంది. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు.
వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత. వైసీపీకి అన్ని విధాలా అండగా నిలిచారు. అందుకే జగన్ ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చారు. మరో రెండు మూడు నెలల్లో ఆయన పదవీకాలం పూర్తి కానుంది. నెల్లూరులో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎంపీగా పోటీ చేయాలని జగన్ కోరారు. అయిష్టంగానే ఒప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. అందుకే తన భార్యకు నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని ఆయన కోరారు. దీనికి జగన్ సైతం సానుకూలంగా స్పందించారు. అయితే ఇంతలోనే అనిల్ కుమార్ యాదవ్ అడ్డు తగిలారు. దీంతో ఆయన ఒత్తిడి మేరకు ఎండి ఖలీల్ పేరును ఖరారు చేశారు. ఇది ఏ మాత్రం వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మింగుడు పడడం లేదు. గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉంది అని అనుచరుల వద్ద ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాలు సరిపోవని.. అందుకే వేరే పార్టీలో చేరకుండా.. స్వస్తి పలకడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటే మాత్రం వైసీపీకి దెబ్బే. ఇప్పటికే నెల్లూరులో కీలక నాయకులంతా పార్టీని వీడారు. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరమైతే మాత్రం నెల్లూరు ఎంపీ స్థానానికి సరైన అభ్యర్థి కోసం వైసిపి వెతుకులాడాల్సిందే. మరి ఏం జరుగుతుందో చూడాలి.