Janasena- YCP Kapu Leaders: వైసీపీ కాపు నేతలు పునరాలోచనలో పడ్డారా? ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్ కు జై కొట్టిన జగన్ తరువాత మాట మార్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ఎన్నికలకు సమయం ఉంది కదా అని అదును కోసం ఎదురుచూస్తున్నారా? వైసీపీ ప్రభుత్వం కాపులను టార్గెట్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? వారంతా జనసేనలోకి చేరాలని దాదాపు నిర్ణయానికి వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. ఏపీలో కాపుల ప్రాబల్యం ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం. అయినా రాజ్యాధికారానికి దూరంగా ఉండిపోవడానికి అనేక కారణాలున్నాయి. ఇప్పటివరకూ ప్రధాన రాజకీయ పక్షలు కాపులను ఒక ఓటు బ్యాంకుగా చూశాయి. ఎన్నికలకు ముందు కాపులనుతమవైపు తిప్పికోవడం. తరువాత మరిచిపోవడం ప్రధాన రాజకీయ పక్షాల నేతలకు అలవాటుగా మారింది. దీంతో కాపుల్లో ఓ రకమైన భావన ఏర్పడింది. ఎన్నాళ్లు ఈ పరిస్థితి అంటూ ఆత్మ పరిశీలన ప్రారంభమైంది. ఉమ్మడి ఏపీలోనూ ఇదే పరిస్థితి. అవశేష ఆంధ్రప్రదేశ్ లోనూ అదే ఒరవడి. దీంతో ఇప్పుడు కాపు నేతలు, ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. పవన్ నేతృత్వంలోని జనసేన ఇప్పుడు వారికి ఆశాదీపంగా కనిపిస్తోంది.

ఇప్పటివరకూ కాపులకు రాజ్యాధికారం దక్కలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, చిన్నాచితకా పదవులే కానీ.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ దరిదపులు చేరిన ప్రతీసారి అడ్డుకునే ప్రయత్నమే జరిగింది. వంగవీటి మోహన్ రంగా జాతీ, రాష్ట్ర నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో దారుణ హత్యకు గురయ్యారు. అటు తరువాత చిరంజీవి రూపంలో కాపులకు అవకాశం వచ్చినా అటు నాయకత్వ లోపమో.. లేక కాపు జాతి ఆలోచనో తెలియదు కానీ చాన్స్ మిస్సయ్యారు. చేజేతులా మిస్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ నేతృత్వంలోని జనసేనను తమ పార్టీగా ఇప్పుడు కాపులు ఓన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల కంటే జనసేన గ్రాఫ్ పెరిగింది. రాష్ట్ర ప్రజలకు పవన్ నాయకత్వంపై నమ్మకం కుదిరింది. అందుకే జనసేనలో చేరేందుకు కాపు నాయకులు క్యూకడుతున్నారు. పీఆర్పీ నేర్పిన గుణపాఠంతో ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయడం ప్రారంభించారు.
జనసేనలో చేరాలనుకున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ముఖ్యంగా కాపు మాజీ మంత్రులు ముందు వరుసలో ఉన్నారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి వారు ఇప్పటికే జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. అటు వైసీపీ తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నట్టు తెలియడం ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపుతోంది. ఒకరిద్దరు ఇప్పటికే బాహటంగానే తమ మద్దతు జనసేనకే అన్నట్టు సంకేతాలిచ్చారు. చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం, వైసీపీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కేవలం కాపు నేతలే కాకుండా.. ఇతర సామాజికవర్గం నేతలు సైతం జనసేన వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో సీట్లు మార్చేస్తానని జగన్ హెచ్చరికలు కూడా కొంతమందిని పునరాలోచనలో పడేస్తున్నాయి. జగన్ పవర్ పాలిట్రిక్స్ మింగుడుపడని వారు సైతం ఇప్పుడు జనసేన వైపే చూస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వాలు కాపులకు ప్రాధాన్యతనిస్తూ వచ్చాయి., వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలావాటికి కోత పడింది. అటు కాపు సామాజికవర్గం కూడా వైసీపీ ప్రభుత్వ చర్యలపై గుర్రుగా ఉంది. ఈ పరిణామాల క్రమంలో వైసీపీలో కంటే జనసేనలో ఉంటేనే కాస్తా బెటర్ గా ఉంటుందని ఆలోచన చేస్తున్న నేతలు ఉన్నారు. సంక్రాంతి తరువాత రాష్ట్రస్థాయి యాత్రకు పవన్ ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రలో జనసేనలో చేరేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. అంటే సంక్రాంతి తరువాత వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు ఉండే అవకాశముంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి చెందిన కాపు నేతలు జనసేనలోకి క్యూకడతారని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.