Cartoonist Sridhar: తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడుతున్న ప్రభుత్వాలు ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నాయి. అధికారంలో లేనప్పుడు తమకు ఎంతో కొంత సహాయం చేసిన వారికి.. ప్రభుత్వ ఖజానా ద్వారా ఆదుకుంటున్నాయి. అలాంటివారికి నేరుగా డబ్బులు ఇవ్వకుండా, సలహాదారుడు అనే పదవిని సృష్టించి కట్టబెడుతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంగా తెలుగు రాష్ట్రాలలో ఈ సలహాదారుల పదవులు తామర తంపరగా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేయడమే ఆలస్యం.. వెంటనే సలహాదారులు పదవుల్లోకి ఎక్కేస్తున్నారు. ప్రభుత్వ వాహనాలను, ప్రభుత్వం ఇచ్చే జీతాలను, ఇతర సదుపాయాలను దర్జాగా అనుభవిస్తున్నారు.
ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. ఇటీవల కూటమి ప్రభుత్వం ఈనాడు పత్రికలో ఒకప్పుడు కార్టూనిస్టుగా పనిచేసిన శ్రీధర్ ను సలహాదారుగా నియమించింది. వాస్తవానికి ప్రభుత్వం నియమించే సలహాదారుల మాట వింటుందా? సలహాదారులో ఇచ్చే సూచనలను అమలు చేస్తుందా? అనే ప్రశ్నలు వేస్తే ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోరు. మేం అధికారంలో ఉన్నాం.. ఇష్టం వచ్చినట్టు చేస్తాం.. అనే విధంగా రిప్లై ఇస్తుంటారు. గత ప్రభుత్వంలో ఇదే స్థాయిలో సలహాదారులను నియమిస్తే ఏం చేశారంటూ ఉల్టా ప్రశ్నిస్తారు. కాకపోతే వైసిపి కంటే కూటమి ప్రభుత్వం సలహాదారులను నియమించుకునే విషయంలో కాస్త పద్ధతి పాటిస్తోంది. సమాజంలో హోదా ఉన్నవారిని సలహాదారులుగా నియమించుకుంటున్నది.
ఇటీవల ఈనాడు మాజీ కార్టూనిస్ట్ శ్రీధర్ ను సలహాదారుగా నియమించడంతో ఒకసారిగా వైసీపీకి గతం గుర్తుకొచ్చింది.. గతంలో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు పత్రికలో శ్రీధర్ అడ్డగోలుగా కార్టూన్స్ గీశారని.. ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్టీఆర్ వ్యవహార శైలిని కించపరచే విధంగా కార్టూన్స్ గీసిన శ్రీధర్ కు ఆ పదవి ఇవ్వడం ఏంటని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ ఇక్కడే వైసిపి ఒక విషయాన్ని మర్చిపోయింది.
నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు అందరికీ తెలుసు. నాడు ఎన్టీఆర్ మీద ఎటువంటి తిరుగుబాటు జరిగిందో కూడా అందరికీ అవగతమే. అప్పుడు చంద్రబాబు చేసింది కరెక్ట్ అని సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే ఒప్పుకున్నారు. పైగా తమ తండ్రి చేసింది తప్పని వారు చెప్పారు. అలాంటప్పుడు శ్రీధర్ విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైసిపి ఎలా తప్పు పడుతుంది? ఆ మాటకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ జగన్ మీద అడ్డగోలుగా విమర్శలు చేశారు. ఏక వచనంతో సంబోధించారు. ఆ తర్వాత సత్యనారాయణ ను జగన్ తన పార్టీలోకి చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. బొత్స ను మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. ఇదే ప్రశ్న టిడిపి నేతలు వేస్తే వైసిపి నాయకులు తల ఎక్కడ పెట్టుకుంటారు?
రాజకీయాలలో ఇప్పుడు విలువలు లేవు.. విలువలు పాటించాలని రాజకీయ నాయకులు ఏమాత్రం అనుకోవడం లేదు. ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతమో అనే సూత్రాన్ని మాత్రమే పాటిస్తున్నారు. అలాంటప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శంకించే అధికారం వైసీపీకి ఎక్కడిది. ఒకవేళ వైసిపి గనుక నీతి నియమాలతో పని చేసి ఉంటే ఈ ప్రశ్న అడగడానికి అవకాశం ఉండేది. అయినా కందకు లేని దురద కత్తికి మాత్రం ఎందుకు అన్నట్టు.. శ్రీధర్ నియామకాన్ని సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే ఆమోదించినప్పుడు.. వైసిపికి ఎందుకు మండుతోంది..