
Pawan Kalyan- YCP: ఏపీలో పవన్ అప్ డేట్ కు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సొంత పార్టీ జనసేన కంటే.. మిగతా రాజకీయ పక్షాలే పవన్ ను ఎక్కువగా ఫాలో అవుతుంటాయి, అబ్జర్వ్ చేస్తుంటాయి, ఈ క్రమంలో పవన్ చర్యలు వాటికి మింగుడు పడడం లేదు. పవన్ సైలెంట్ గా ఉంటే వ్యూహత్మకమని భావిస్తాయి. సినిమాలు చేసుకుంటూ పోతే లోలోపల ఏదో జరుగుతుందని అనుమానిస్తుంటాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు మాత్రం పవన్ నే టార్గెట్ చేస్తుంటారు. పవన్ ప్రతీ చర్యను తప్పుపడుతుంటారు. ఆయనను ఒక బలహీనమైన నేతగా చూపే ప్రయత్నం చేస్తుంటారు. అసలు జనసేన ఒక పార్టీ కాదన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. అటువంటప్పుడు పట్టించుకోకుండా ఉండలేక బలమైన నేతగా తమంతట తామే ఒప్పేసుకుంటారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో డిసైడ్ ఫ్యాక్టర్ ఓటు షేర్ కలిగిన ఏకైక పార్టీ జనసేన. అందుకే వైసీపీ వెన్నులో వణుకు పుడుతోంది. పవన్ తీసుకునే నిర్ణయాలను లోలోపల ప్రభావితం చేసేలా వ్యవహరిస్తోంది. పవన్ పదేళ్ల కిందట జనసేన పార్టీని స్థాపించారు. కానీ పవర్ పాలట్రిక్స్ చేయలేదు. అధికారం కోసం అర్రులు చాచలేదు. ఒక విధానపరంగా ముందుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని పొత్తులపై స్పష్టత ఇచ్చారు. వైసీపీని గద్దె దించాలంటే పొత్తులు తప్పవన్న సంకేతాలిచ్చారు. అప్పటి నుంచి వైసీపీది ఒకటే వ్యధ.. ఒకటే ఆవేదన.
మూడు పెళ్లిళ్ల ముచ్చట ఏనాడో అయిపోయింది. దీనిపై చాలా సందర్భాల్లో పవన్ క్లారిటీ ఇచ్చారు. తాను లీగల్ గా విడాకులు తీసుకునే వివాహాలు చేసుకున్న విషయాన్ని ప్రకటించారు. కానీ సీఎం నుంచి మంత్రుల దాకా అదే విమర్శను కొనసాగిస్తున్నారు. ప్యాకేజీ నాయకుడన్న విమర్శను విడిచిపెట్టడం లేదు. తెలుగు సినిమాలో స్టార్ డమ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. అత్యధిక రెమ్యూనరేషన్ కూడా ఆయనే తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. పన్నుల రూపంలో ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు కడుతుంటారు. అటువంటి నేత ప్యాకేజీ తీసుకునే అవసరమే లేదు. కానీ అదే పనిగా వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

175 సీట్లకు 175లో పోటీచేసే దమ్ముందా అంటూ సవాల్ చేస్తుంటారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయాడంటూ ఎద్దేవా చేస్తుంటారు. అటువంటప్పుడు ఆ పార్టీ ఎవరితో కలిసి పోటీచేస్తే వైసీపీకి ఎందుకు? సింహం సింగిల్ గా వస్తుందని ప్రగల్బాలు పలుకుతుంటారు. అటువంటప్పుడు దివంగత రాజశేఖర్ రెడ్డి కూడా 2004లో వామపక్షాలు, టీఆర్ఎస్ తో కూటమి కట్టే పోటీచేసిన విషయాన్ని మరిచిపోతున్నారు. పవన్ ను విమర్శిస్తున్న వైసీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డిని సైతం విమర్శిస్తున్నట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో పొత్తులు అనేవి రాజకీయ వ్యూహాల్లో భాగం. కానీ వైసీపీ నేతలు మాత్రం అదే పనిగా విమర్శలు దిగడంలో పవన్ పొత్తులకు వెళ్లకుండా ఒంటరిగా పోటీచేయాలన్నదే వారి అభిమతం. రెచ్చగొట్టడం ద్వారా పవన్ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పవన్ విషయంలో వైసీపీ వాచింగ్ డాగ్ లా వ్యవహరిస్తోంది. జనసేన, పవన్ వ్యవహారాలను కనిపెట్టడమే ధ్యేయంగా పనిచేస్తోంది.