Pawan Kalyan- YCP: ఏపీలో అధికార వైసీపీ నేతలది వింత పరిస్థితి. తమ పార్టీ వ్యూహాలు, సిద్ధాంతాలు, స్ట్రాటజీ వంటివి వారికి ఏమి తెలియవు. వీరు తెలుసుకోవాలని అనుకున్నా తెలియనివ్వరు కూడా. అవి సీఎం జగన్ తో పాటు ఆయన అస్మదీయులైన ఆ నలుగురికే తెలుస్తాయి. పైగా కౌరవసేన అయిన ఐ ప్యాక్ టీమ్ కనుసన్నల్లోనే పార్టీ నడుస్తోంది. అందుకే వైసీపీ నాయకులకు అంతలా తీరుబాటు లభిస్తోంది. ప్రత్యర్థి పార్టీలపై ఫోకస్ పెట్టే సమయం దొరుకుతోంది. తెల్లారి లేచింది మొదలు ప్రత్యర్థులపై బురద జల్లడమే వారి పని. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో అయితే మరీ ఎక్కువగా స్పందిస్తుంటారు. చివరకు ఆయన ఎన్నికల్లో ఎవరితో వెళ్లాలో వీరికే చెప్పాలట. వీరితో చెప్పే కూటమి కట్టలాట. పవన్ విషయంలో వైసీపీ నేతల సవాళ్లు మరి విచిత్రంగా ఉంటాయి. అందులో వాస్తవికత కంటే భయమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన ఎవరితో వెళితే వీరికెందుకు? ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల వ్యూహాలన్నవి సహజం. దానిని తమకు చెప్పి చేయాలన్న వైసీపీ నేతలది వింత వాదనేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా ఉందా? రెండు చోట్ల ఓడిపోయిన నువ్వా రాజకీయం చేసేది? నువ్వు ఎవరి వైపు ఉంటావో తేల్చుకో. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే చదువుతున్నావు. ప్యాకేజీ నాయకుడు, పవలా నాయకుడివి, రాజకీయాలంటే సినిమాలనుకున్నావా?… పవన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు అనే కొన్ని మాటలివి. అయితే ఒకసారి ఎవరివైపు అని ప్రశ్నిస్తుంటారు. అదే సమయంలో చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నావంటారు. అంటే చంద్రబాబుతో ఉన్నట్టే అన్న భావన కదా? కానీ ఇలా అపరిపక్వత మాటలతో వైసీపీ నేతలు గడిపేస్తున్నారు. ఇలా అనే దానికంటే పవన్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే పవన్ రూపంలో తమకు ఎదురయ్యే డ్యామేజ్ వైసీపీ నేతలకు తెలుసు. అందుకే దానిని కొంతవరకు తగ్గించేందుకు, పవన్ ను ప్రజల్లో పలుచన చేసేందుకు ఈ కొత్త ఎత్తుగడ.
పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే వైసీపీ నేతలకు ఎందుకు. ఇంకా ఎన్నికలకు వ్యవధి ఉంది. ఏ పార్టీ వ్యూహం వారిది. కానీ వైసీపీ నేతలు మాత్రం తమకు తాము జెబ్బలు చరుచుకుంటున్నారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో పొత్తు అన్నది లేకుండా ఉన్నపార్టీ వైసీపీ అని చెప్పుకుంటున్నారు. మరి 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సీపీఎం తో పొత్తు పెట్టుకోలేదా? పోనీ మీరే గ్రేట్ అనే అనుకుందాం. అలాగని పలానా వారితో మేము పొత్తు పెట్టుకుంటున్నాము అని పవన్ వచ్చి జగన్ తో చెప్పాలా? ఆయన పార్టీకి లాభదాయకమైనది. ఎన్నికల్లో ప్రయోజనం వచ్చే నిర్ణయం మాత్రమే తీసుకుంటారు. కానీ మేము పలానా వారితో పొత్తు పెట్టుకుంటున్నామని ఉప్పందించి వైసీపీ వ్యూహాలకు పవన్ సహకరించాలా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల ముందు కేంద్రంలోని ఎన్టీఏపై జగన్ పార్టీకి చెందిన ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మరి ఇప్పుడెందుకు పెట్టలేకపోతున్నారని అడిగితే వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా?

అయితే వైసీపీ నేతల నిత్యం పవన్ నామజపాన్ని పఠిస్తున్నారు. రాజకీయ విమర్శలు చేస్తున్నారు. పవన్ అంటే ఒక లెక్క లేదు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపలేని వాడు ఒక నాయకుడేనా? అని చిన్నచూపు చూస్తూ… అదే నాయకుడి గురించి నిత్యం మాట్లాడుతున్న దాన్ని బట్టి పవన్ బలం, ఆయనపై ఉన్న భయం తెలుస్తోంది. పవన్ మూడు ఆప్షన్లను ఎప్పుడో ప్రకటించారు. ఒకటి జనసేన ఒంటరిగా వెళ్లడం, రెండూ బీజేపీతో కలిసి వెళ్లడం, మూడు బీజేపీ, టీడీపీలతో కలిసి వెళ్లడం అని ప్రకటించారు. అంటే ప్రధాన విపక్షం టీడీపీతో కలవకూడదన్నది వైసీపీ ఆకాంక్ష. కానీ పవన్ మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. అదే జరిగితే దాని ఫలితం ఏ విధంగా ఉంటుందో జగన్ కు తెలియంది కాదు. అందుకే ఉపశమన చర్యలు మొదలు పెట్టారు. నష్ట నియంత్రణకు ప్రయత్నిస్తున్నారు. వీలైనంతవరకూ టీడీపీతో పవన్ కలువకుండా తమకునున్న శక్తియుక్తులను కూడదీసి పోరాడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నిత్య సవాళ్లని చెబుతున్నారు.