
ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు ఇప్పటికే తీవ్రంగా తప్పుబట్టింది. పార్టీ రంగులను తొలగించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాలు గడువు కోరింది. హైకోర్టు ఇందుకు అంగీకరించింది. రంగులు తొలగించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వేళ్ళవద్దని సూచించింది.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో భయం విలవిల లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం మాత్రం హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ భవనాలకు రంగులమయం చేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు పంచాయతీ భవనానికి వైకాపా రంగులు వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అదేవిధంగా విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మూలబొడ్డవర పంచాయతీ భవనానికి వైసిపి నాయకులు, అధికారులు పూర్తిగా వైసిపి రంగులు అద్దారు. దీనిని స్థానికంగా ఉన్న గిరిజునులైన గ్రామస్తులు అడ్డుకోవడంతో రంగులు వేస్తున్న సిబ్బంది వెయ్యకుండానే వెనుతిరిగారు. గిరిజన గ్రామమైన మూలబొడ్డవరలో గత ప్రభుత్వ హయాంలో 15 లక్షల రూపాయలతో పంచాయతీ భవనం నిర్మాణం జరిగింది. ఆ భవనాన్ని ఆనుకొని సుజల స్రవంతి పథకం ఉంది. ఈ రెండింటికి వైసీపీ రంగులు వేస్తున్నారు.