BJP Parthasarathy అన్ని రాష్ట్రాల్లో బీసీలు, దళిత, గిరిజనులకు పెద్ద పీట వేస్తుంటే.. ఏపీలో మాత్రం రెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ బీసీల విషయంలో శీతకన్ను వేస్తోందన్న ఆరోపణలున్నాయి. దాన్నే బేస్ చేసుకొని జగన్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం రెడీ అయ్యింది.

బీసీల బాధలను ఏపీలో బయటపెట్టారు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారథి. కేంద్రంలోని మోడీ సర్కార్ బీసీలకు పెద్ద పీట వేస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం అదే స్థాయిలో అణిచివేస్తోందని విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా నరేంద్ర మోడీ కల్పించారని.. 54 శాతం జనాభా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా పూర్తి చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. విద్యలో – స్కూలు , కాలేజీలో అడ్మిషన్ లో రిజర్వేషన్ తప్పనిసరిగా అమలయ్యేలా చట్టం తెచ్చారన్నారు. ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు అమలయ్యే విధంగా పర్యవేక్షించే అధికారం బీసీ కమిషన్ కు ఇచ్చారని తెలిపారు.
అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా బీసీలకు కేటాయించిన ప్రత్యేక నిధులు వాళ్ళకు మాత్రమే ఖర్చయ్యేలా చట్టం తెచ్చారని.. బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి బీసీ కమిషన్ కు న్యాయపరమైన విచారణ అధికారాన్ని కల్పించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ లకు ఉండేవిధంగా విచక్షణాధికారాలు కల్పించారని మోడీ సర్కార్ గొప్పతనాన్ని పార్థసారథి చాటిచెప్పారు.
కానీ రాష్ట్రంలో ఉన్నా వైసీపీ ప్రభుత్వం బీసీ కమిషన్ ను ఏర్పాటు చేయకపోగా రాజ్యాంగ హోదా కలగానే మిగిల్చిందని పార్థసారథి విమర్శించారు. బీసీలకు 27 శాతం రిజర్వేషన్ రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం లేదు. అడిగే నాథుడే లేడని జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. బీసీలకు స్కూళ్లు కాలేజీలలో న్యాయంగా రావాల్సిన సీట్లు రావట్లేదని విమర్శించారు. ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్ ఇవ్వటం లేదన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేకంగా ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించి సొంత అవసరాలకు వాడుకుంటున్నారని పార్థసారథి విమర్శించారు. బీసీలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న బీసీలు తమ హక్కును వినియోగించుకోలేకపోతున్నారన్నారు. బెంగళూరులో జరుగుతున్న బిజెపి ఓబీసీ మోర్చాజాతీయ శిక్షణా శిబిరంలో వీటిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నామని.. బీసీల కోసం జిల్లాల వారీగా ప్రత్యేక సభలు జరిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్థసారథి నిప్పులు చెరిగారు.
-పార్థసారథి మాట్లాడిన వీడియో