YCP Govt: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు గా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి. టీడీపీ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలకు ఇప్పుడు జగన్ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు కొనితెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలతో జగన్ ఇరుకున పడే ప్రమాదం ఏర్పడింది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లుగా అసలే ఆర్థిక వ్యవస్థ కుదేలైన సందర్భంలో ఇప్పుడు కొత్తగా టీడీపీ చేసుకున్న ఒప్పందంపై వైసీపీ భారీ మూల్యం చెల్లించే పరిస్థితి రావడం గమనార్హం.

జగన్ కేంద్రంతో సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ కేంద్రం చూపిన దారిలోనే పయనిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం వైసీపీని ఏ ఆపద కాలంలో కూడా ఆదుకున్న దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా రాష్ర్ట ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో కేంద్రం వైఖరి జగన్ కు కోపం తెప్పిస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలకు రాష్ర్ట ప్రభుత్వాలు కట్టుబడాల్సిందే అని చెప్పడంపై ఆగ్రహాలు వస్తున్నాయి. కేంద్రం తీరుతో వైసీపీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత టీడీపీ ప్రభుత్వ కాలంలో నిరంతరాయంగా విద్యుత్ అందించే విధంగా భారీ ఎత్తున ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చోటుచేసుకున్నాయి. వచ్చే పాతికేళ్ల కాలానికి గాను ఈ ఒ:ప్పందాలు కొనసాగుతాయని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఎవరు అధికారంలో ఉన్నా వీటిని పాటించాల్సిందే. దీంతో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూ నిధులు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. దీంతో వైసీపీ నేతల్లో ఆందోళన పెరుగుతోంది. టీడీపీ చేసిన పనికి తామెందుకు మూల్యం చెల్లించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ర్టంపై పెనుభారం పడే అవకాశాలున్నాయి. దేశంలో పెట్టుబడు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని కేంద్రం చెబుతున్న నేపథ్యంలో జగన్ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యుత్ సంస్థల ఒప్పందాలని తూచ తప్పకుండా పాటించాల్సిందేనని చెబుతోంది. దీంతో జగన్ ప్రభుత్వం పెద్ద చిక్కుల్లో పడినట్లు అయింది.