Visakhapatnam: ప్రశాంతంగా ఉండే సాగర నగరం ఇప్పుడు ఏపీ రాజకీయ సంగ్రామ వేదికగా మారింది. రాజకీయ పార్టీల బల ప్రదర్శనలకు వేదికగా మారుతోంది. పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం విశాఖ గర్జనకు అధికార వైసీపీ పిలుపునివ్వగా… జనవాణి కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ ఇదే రోజు విశాఖ వస్తున్నారు. అటు వైసీపీ నేతల విధ్వంసాల నుంచి విశాఖను కాపాడాలని పిలుపునిస్తూ టీడీపీ సేవ్ విశాఖ పేరిట నాయకుల భేటీని నిర్వహిస్తోంది. ఒకే రోజు మూడుప్రధాన పార్టీలు ఇచ్చిన పిలుపుతో విశాఖ నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. పార్టీ బలప్రదర్శనకు దిగడంతో సాగరనగరంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతనగరంలో ఏమిటీ పరిస్థితి అంటూ నిట్టూరుస్తున్నారు.

పాలనా వికేంద్రీకరణ పేరుతో అధికార వైసీపీ మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించి మూడేళ్లు సమీపిస్తున్నా.. ఇంతవరకూ మాత్రం ఏర్పాటుచేయలేకపోయింది. సాంకేతిక సమస్యలు అధిగమించలేకపోయింది. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం దాదాపు ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటైపోయిందన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ నేతలు విశాఖను మొహరించారు. అయితే అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలో అడుగుపెడుతున్న తరుణంలో ఎలాగైనా ఝలక్ ఇవ్వాలని చూస్తున్నవైసీపీ నేతలు విశాఖ గర్జనకు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి భారీగా జన సమీకరణ చేశారు. వైసీపీ సానుభూతిపరులతో ఏర్పాటుచేసిన నాన్ పొలిటికల్ జేఏసీ విశాఖ గర్జన నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. ఇప్పటికే భారీగా వైసీపీ శ్రేణులువిశాఖ నగరానికి చేరుకున్నాయి.
అమరావతి రాజధాని స్టాండ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ దానిపై గట్టిగానే నిలబడ్డారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయలేని ఈ గర్జనలెందుకంటూ వైసీపీకి దీటుగా కౌంటర్ ఇచ్చారు. వరుసగా ట్విట్ల యుద్ధాన్ని ప్రకటించారు. దీంతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది. బొమ్మ కనిపించింది. పవన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దాడికే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో పవన్ ఆదివారం నిర్వహించే జనవాణి కార్యక్రమానికి హాజరయ్యేందుకు శనివారం విశాఖ చేరుకోనున్నారు. మూడురోజుల పాటు పార్టీకార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార వైసీపీ నేతల తీరుపై విరుచుకుపడే అవకాశముంది. అయితే లోలోపల వైసీపీ కూడా మధనపడుతోంది. పవన్ నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయోనని నేతలు భయపడుతున్నారు. ఇప్పటికే పవన్ అధికార పార్టీ నేతల అక్రమాలపై ప్రశ్నించారు. దీంతో జనసేనాని పర్యటనకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇప్పటికే జనసేన నాయకులు, కార్యకర్తలు,అభిమానులు వేలాది మంది విశాఖ చేరుకున్నారు.

విశాఖకు రాజధాని రాకుండా టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ ప్రచారం ప్రారంభించింది. దీంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. దీనిపై చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వైసీపీ నేతల విధ్వంసంపై పోరాడాలని ఉత్తరాంధ్ర నేతలకు పురమాయించారు. ఇప్పటికే విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబసభ్యులు భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తడంతో టీడీపీకి అస్త్రందొరికినట్టయ్యింది. వైసీపీ నేతల నుంచి విశాఖను కాపాడాలని డిమాండ్ చేస్తూ ‘సేవ్ వైసీపీ’ పేరుతో టీడీపీ ఉత్తరాంధ్ర నాయకులు శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
అయితే మూడుపార్టీల కార్యక్రమాలు ఒకే రోజు ఏర్పాటుచేయడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అటు భద్రత, బందోబస్తు కల్పించడం పోలీసులకు కష్టతరంగా మారింది. అయితే అధికార పార్టీ తీరును విశాఖ వాసులు ఏవగించుకుంటున్నారు. రాజధాని ఇష్యూతో నగర ప్రభను కలుషితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అయ్యే అవకాశం లేకపోయినా.. అనవసరంగా ప్రజల మధ్య భావోద్వేగాలు సృష్టించడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే విశాఖ నగరవాసులు మాత్రం తాజా పరిణామాలతో కలత చెందుతున్నారు.