Karanam Dharmasri Resigns: మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ గేమ్ స్టాట్ చేసిందా? పాలనా వికేంద్రీకరణకు చంద్రబాబు వ్యతిరేకమన్న ప్రచారానికి పదును పెడుతుందా? ఉత్తరాంధ్రలో టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందా? నాన్ పొలిటిలక్ జేఏసీ వేదికగా చేసుకొని కొత్త నాటకానికి తేరతీసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వైసీపీ నేతలు సరిగ్గా అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలో అడుగుపెడుతున్న తరుణంలో రాజీనామా అస్త్రాలతో ఎదురు దాడికి దిగుతుండడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన పదవికి రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. ఇప్పటికే మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం అనుమతిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో దిగుతానని ప్రకటించారు. ఈ పర్యవసానాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ రాజీనామా బాట పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులను ఇరుకున పెట్టేందుకు చేస్తున్న ఎత్తుగడగా తేటతెల్లమవుతోంది.

ఇప్పటికే టీడీపీ అమరావతి ఏకైక రాజధాని స్టాండ్ తీసుకుంది. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నుంచి మాజీ మంత్రులు, కీలక నాయకులు తమ మద్దతు అమరావతికేనని ప్రకటించారు. ఒక్క రాజధాని కట్టలేని వారు మూడు రాజధానులు అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూడా కౌంటర్ ఇచ్చారు. అంతలా ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఒకానొక దశలో ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అటు ఉత్తరాంధ్ర ప్రజల నుంచి కూడా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కుమద్దతుగా ఎటువంంటి స్పందన రావడం లేదు. అటు విపక్షం దూకుడు, ఇటు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో వైసీపీ నాన్ పొలిటికల్ జేఏసీలను ఏర్పాటుచేసింది. శనివారం విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్ లో రిజైన్ చేసి జేఏసీ చైర్మన్ కు అందించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు మద్దతుగా తాను చోడవరం నుంచి పోటీచేస్తానని.. టెక్కలి నుంచి పోటీచేసి గెలుపొందే సత్తా అచ్చెన్నాయుడుకు ఉందా అని ప్రశ్నించారు. అటు భీమిలి ఎమ్మెల్యే , మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
విశాఖ క్యాపిటల్ రాజధాని ఇష్యూను ఉత్తరాంధ్ర ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది. విశాఖకు మద్దతు తెలపని వారిని రాజకీయాల నుంచి వెలివేయాలని నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధుల ద్వారా ప్రజలకు పిలుపునివ్వాలని యోచిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు, ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులే టార్గెట్ చేయాలని భావిస్తోంది. అయితే అది వర్కవుటయ్యే అవకాశం ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నాడు అమరావతికి మద్దతు తెలిపి నేడు మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. అందుకే వైసీపీ నేతలు ఎంతగా పిలుపునిస్తున్నా ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో రాజీనామా అస్త్రం వర్కవుట్ కాదన్న టాక్ వినిపిస్తోంది.

అయితే టీడీపీ నాయకులు మాత్రం ప్రస్తుతం మౌనాన్నే ఆశ్రయించారు. అటు అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సైలెంట్ కావడమే మంచిదన్న భావనతో ఉన్నారు. అయితే మిగతా కోస్తా, రాయలసీమ నాయకులకు ఏరికోరి వైసీపీ అస్త్రం ఇచ్చినట్టయ్యింది. ఒక్క ఉత్తరాంధ్ర ప్రజలకే మనో భావాలు ఉంటాయా? మాకు లేవా? రాజధానిని దూరం చేయడం ఏమిటన్న భావన అక్కడ ప్రజల్లో నేలకొనే అవకాశం ఉంది. అయితే వైసీపీ పాలకులకు ఇవేవీ తలకెక్కడం లేదు. అనుకున్నది సాధించామా లేదా? అన్నదే వారి ఆలోచన. మున్ముందు ఉత్తరాంధ్రలో వైసీపీ రాజకీయ క్రీడ ఎలా ఉంటుందోనని సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు.
Also Read: AP- Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. తేల్చిచెప్పిన సజ్జల
[…] […]