Minister Roja: మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగిరిలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సొంతింటిని చక్కదిద్దుకోలేని స్థితిలో ఉన్న అమె అయినదానికి కానిదానికి విపక్షాలపై పడుతుంటారు. దుమ్మెత్తిపోస్తుంటారు. అటు సీఎం జగన్ ప్రాపకం కోసం తన కేరెక్టర్ ని దిగజార్చుకొని ప్రవర్తించే రోజాకు వ్యతిరేకంగా సొంత పార్టీని హైకమాండ్ పెద్దలే ప్రోత్సహిస్తుంటారు. నగిరిలో జరుగుతున్న పరిణామాలు ఆమెను నిద్రపట్టనీయడం లేదు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కీలక నాయకులు అసలు రోజాను లెక్కచేయడం లేదు. తాను రాష్ట్రానికి మంత్రిని అంటూ బిల్డప్ ఇస్తున్న రోజా దూకుడు వారి ముందు మాత్రం పనికి రావడం లేదు. నియోజకవర్గంలోని చిన్నపాటి ప్రారంభోత్సవాలకు సైతం ఆమెను పిలవడం లేదు. తాజాగా ఓ రైతుభరోసా కేంద్రానికి రోజాను పిలవకుండానే అక్కడి నేతలు ప్రారంభించేశారు. దీనిపై తన ఆవేదనను ఓ నేతకు ఫోన్ లో చెప్పిన రోజా..ఆడియోను సైతం తానే లీక్ చేసుకునే దయనీయ పరిస్థితులను నగరిలో ఏరికోరి తెచ్చుకున్నారు.

తాను ప్రాణం పెట్టి రాజకీయం చేస్తుంటే.. కనీసం తనను లెక్కలోకి తీసుకోకపోవడం ఏమిటన్నది రోజా ఆవేదన. ఇప్పుడు రోజా ఆడియో వైసీపీ వర్గాల్లో సర్క్యులేట్ అవుతోంది. కానీ అధిష్టాన పెద్దలెవరూ ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. పైగా ఆడియో లీక్ చేసింది రోజానే అంటూ వారు అనుమానపు చూపులు చూస్తున్నారు. ప్రస్తుతానికి నగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సెకెంటరీ కేడర్ అంతా రోజాకు వ్యతిరేకంగా ఉంది. మునిసిపల్ చైర్మన్ తో సహా అందరూ బాహటంగానే రోజా వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. వారెవరూ రోజా పేరు ఎత్తేందుకు కూడా సాహిసించడం లేదు. చివరకు ఫ్లెక్సీల్లో కూడా రోజా ఫొటో లేకుండా చేస్తున్నారు. ఏపీకి మంత్రిని, నాకు తిరుగులేదు అనుకుంటున్న రోజాకు సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీ శ్రేణుల నుంచి ఎదురవుతున్న పరిణామాలు మాత్రం మింగుడు పడడం లేదు.

ఆది నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యం నగిరి నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు రోజా నాయకత్వాన్నిఎదురుస్తున్నది కూడా పెద్దిరెడ్డి అనుచరులే కావడం గమనార్హం. స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా తనను లెక్కచేయకపోవడంపై రోజా అధిష్టాన పెద్దలకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయింది. రాష్ట్రస్థాయిలో తప్పుడు సంకేతాలు వెళతాయని మంత్రి పదవి ఇచ్చాం కానీ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని తేల్చిచెప్పినట్టు సమాచారం. పేరుకే మంత్రి కానీ.. పెద్దిరెడ్డి డైరెక్షన్ లో పనిచేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంతో కక్కలేక మింగలేని పరిస్థితిలో రోజా ఉన్నారు. ఎందుకొచ్చింది ఈ రాజకీయాలు అంటూ అనుచరుల వద్ద రోజా ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట. అయితే విశాఖ ఎయిర్ పోర్టులో జనసైనికులకు వేలు చూపించి హెచ్చరించిన రోజాకే.. సొంత పార్టీ నేతలు అదే వేలు చూపించి భయపెడుతున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రోజా మంత్రిగా ఉన్నా నగిరిలోని సొంత పార్టీ నేతలు మాత్రం ఆమెను ఒక ప్రజాప్రతినిధిగా కూడా లెక్కచేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది.