Rajinikanth- Mohan Babu: మాది ఆత్మీయ బంధం. మా స్నేహం ఆ చంద్రార్కం. వీడు అని సంభోదించేటంతటి చనువు మాది… ఈ మాటలు ఎవరివో తెలుసా? డైలాగ్ కింగ్ మోహన్ బాబువి. ఎవరి గురించో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి. రజనీతో తనకున్న బంధాన్ని మోహన్ బాబు గొప్పగా చెప్పుకుంటారు. తనకు అతి చనువు ఉందని చాలా సందర్భాల్లో ప్రదర్శించారు కూడా. అందులో వాస్తవముంది కూడా. అయితే ప్రస్తుతం రజనీకాంత్ పై ఏపీలో తిట్లదండకం నడుస్తోంది. అనరాని మాటలు అనేస్తున్నారు. ఆయన ఆరోగ్యం, కుటుంబంపైనా నిందలేస్తున్నారు. ఘోరాతి ఘోరంగా తిడుతున్నారు. స్నేహంపై అతిగా స్పందించే మోహన్ బాబు.. స్నేహితుడిపై జరుగుతున్న దాడి గురించి మాత్రం స్పందించడం లేదు. కనీసం నోరు తెరవడం లేదు.
అంతటి సభలో కూడా..
అన్న ఎన్టీ రామారావుపై అభిమానంతో శతజయంతి వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. ఎన్టీఆర్ తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో చంద్రబాబుతో ఉన్న స్నేహం కోసం ప్రస్తావించారు. దీనికి మూల కారకుడు మోహన్ బాబు అంటూ ప్రత్యేకంగా సంభోదించారు. చంద్రబాబును పరిచయం చేసింది మోహన్ బాటు అని చెప్పడం ద్వారా.. చంద్రబాబు కంటే మోహన్ బాబే ముందు స్నేహితుడయ్యాడని గుర్తుచేశారు. అటువంటి స్నేహానికి విలువిచ్చిన రజనీకాంత్ పై మాటల దాడి జరుగుతుంటే మోహన్ బాబు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
అనవసరంగా తిడుతున్నా..
చంద్రబాబుతో ఉన్న స్నేహంతో ఆయన పనితీరును రజనీ అభినందనలు తెలిపారు. ఆత్మీయుడిగా 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. దానినే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. పోనీ వైసీపీపై రజనీకాంత్ విమర్శలు చేసి ఉన్నా.. జగన్ పాలన బాగాలేదని చెప్పినా.. వైసీపీ నేతల విమర్శలకు అర్ధం ఉండేది. కానీ అవేవీ లేకుండానే వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బరి తెగించి వ్యవహరిస్తున్నారు. రజనీ కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని కించ పరుస్తున్నారు. అదంతా తప్పు అని చెప్పాల్సిన స్థితిలో ఉన్న మోహన్ బాబు మాత్రం నోరు విప్పడం లేదు. తమది ఆత్మీయ బంధమని చెప్పుకునేందుకు అవకాశం వచ్చినా తన నటనా విశ్వరూపం ప్రదర్శించడం లేదు.
ఆ దూకుడేదీ?
అదే రివర్సులో ఉంటే ఈపాటికే స్పందించి ఉండేవారు. అదే టీడీపీ నేతలు చేసి ఉంటే తనదైన డైలాగు డెలివరీతో చీల్చిచెండాడే వారు. రజనీపై దాడిచేస్తోంది వైసీపీ బ్యాచ్. తాను ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అధికారికంగా సభ్యుడు కూడా. గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు. ఊరూవాడా ప్రచారం కూడా చేశారు. ఇతోధికంగా సాయపడ్డారు. జగన్ దగ్గర తనకు చనువు ఉందని కూడా చెప్పుకొచ్చారు. అటువంటి మోహన్ బాబే స్నేహితుడిపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నా నోరు విప్పకపోవడం విమర్శలకు కారణమవుతోంది. మోహన్ బాబు ‘మంచు’లా ఎందుకు కరిగిపోతున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చూడాలి.. దీనిపై మోహన్ బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో?