
చాలా మందికి తెలియదుగానీ.. రాజకీయాల్లో సమఉజ్జీ అనేది ఉండాలి. ఇది అధికార పార్టీకి చాలా అవసరం కూడా! అవును.. బలవంతుడిపై పోరాటం చేసి విజయం సాధించినప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది. భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ మీదనో, ఆస్ట్రేలియా మీదనో విజయం సాధించినప్పుడు ప్రేక్షకులకు వచ్చే కిక్కుకు.. స్కాట్లాండ్ జట్టుపై గెలిస్తే వచ్చే ఫీలింగ్ కు చాలా తేడా ఉంటుంది. సమఉజ్జీ లేకపోతే ఏమవుతుందంటే.. బలవంతమైన జట్టులోని లోపాలు తేలిగ్గా అర్థమవుతాయి. దీన్ని రాజకీయాలకు అప్లై చేస్తే.. అధికార పార్టీకి సైతం ఇలాంటి ఇబ్బందే ఎదురవుతుంది.
ఏపీ అసెంబ్లీలో పరిస్థితి చూసినప్పుడు.. వైసీపీకి ఎదురు లేకుండా పోయింది. ప్రతిపక్షం పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నచందంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగినప్పుడు బలహీన పడిన విపక్షాన్ని కాకుండా.. అధికార పక్షంమీద దృష్టి పెడతారు జనం. అప్పుడు.. ప్రభుత్వం చేసే ప్రతీ పనిమీద సునిశిత దృష్టి ఏర్పడుతుంది. ఇది జరిగినప్పుడు లోపాలన్నీ బట్టబయలు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. ఒకవిధమైన మొనాటనీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో.. అధికార పార్టీ చిక్కుల్లో పడుతుంది. అందుకే.. సమ ఉజ్జీఉన్న ప్రత్యర్థిని అధికార పార్టీలు కోరుకుంటాయి.
ఈ కోణంలో పవన్ ను తమప్రత్యర్థిగా వైసీపీ, టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పోటీ చేసింది. కానీ.. ఒకే ఒక స్థానం గెలిచింది. కానీ.. పవన్ మాత్రం రెండు చోట్లా ఓడిపోయారు. ఆ ఒక్క సీటు అధ్యక్షుడు పవన్ గెలిస్తే బాగుండేదని పార్టీ శ్రేణులు నిట్టూర్చాయి. అయితే.. ఓడిపోయిన తర్వాత పవన్ రాజకీయాలు వదిలేస్తారని చాలా మంది అంచనా వేశారు. కానీ.. పవన్ తాను ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. అలాగే ఉన్నారు కూడా. ప్రతి విషయం మీదా విషయ పరిజ్ఞానంతో రాజకీయాలు చేస్తుండడంతో.. ఆయన్ను సీరియస్ పొలిటీషియన్ గా ప్రత్యర్థులు గుర్తించారు.
ఆయన తిరిగి సినిమాల్లో నటిస్తున్నా.. ప్రధాన పార్టీల నుంచి పెద్దగా విమర్శలు రాలేదు. పార్టీ నిర్మాణం కోసం డబ్బులు అవసరమని, అందుకే సినిమాలు చేస్తున్నానని పవన్ చెప్పిన సమాధానాన్ని అంగీకరించారు. ఈ కారణంగానే.. ఆయనను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టే ఆలోచన కూడా చేస్తున్నాయని అంటున్నారు. మరి, ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉంది? అన్నది తెలియాలంటే.. 2024 వరకు వెయిట్ చేయాల్సిందే.