Homeఆంధ్రప్రదేశ్‌World Tribal Day 2023: ఆదివాసీ దినోత్సవం : అడవి బిడ్డల ఆర్తనాదాలు పట్టని ప్రభుత్వాలు

World Tribal Day 2023: ఆదివాసీ దినోత్సవం : అడవి బిడ్డల ఆర్తనాదాలు పట్టని ప్రభుత్వాలు

World Tribal Day 2023: ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనలు ప్రకారం అటవీ ప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 33 తెగల సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. వీరినే గిరిజనులు,అడవి బిడ్డలు, ఆదివాసీలుగా అభివర్ణిస్తారు. అటవీ ఉత్పత్తులే వీరి జీవనాధారం. కట్టూ, బొట్టూ,ఆచార వ్యవహారాలు, ఆహార్యం అంతా ప్రత్యేకం. ఆధునిక ప్రపంచంలో మానవులు గ్రహాంతర జీవనం కోసం పరుగులు తీస్తుండగా.. వారు మాత్రం అభివృద్ధికి, సమాజానికి దూరంగా.. ఇప్పటికీ అడవుల్లోనే జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. వారి బతుకుల్లో మార్పులు మాత్రం రావడం లేదు.

గిరిజనుల అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. వారికోసం ఐటీడీఏలను ఏర్పాటు చేసింది. షెడ్యూల్డ్ ఉప ప్రణాళిక ప్రాంతాలుగా గుర్తించినా..ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేరని గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నేటికీ విద్యుత్ వెలుగు లేక కొన్ని గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. విద్య, వైద్యం అందని ద్రాక్షగా ఉంది. పౌర సేవలు అందాలంటే కొండలు దిగి రావాల్సిందే. రహదారులు లేక అత్యవసర, అనారోగ్య సమయంలో వారు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు. 108, 104 వాహనాలు వెళ్ళక.. డోలియే గత అవుతుంది. వైద్య సేవలు అందక మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి.

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఐటీడీఏలు అచేతనంగా పడి ఉన్నాయి. రాజ్యాంగబద్ధ నిధులు దారి మళ్లుతున్నాయి. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సంక్షేమ పథకాల కోసం మళ్లిస్తున్నారు. నవరత్నాల్లోనే గిరిజన సంక్షేమాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా గిరిజనులుకష్టాల పాలవుతున్నారు.

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా.. తాము పడుతున్న కష్టాలను గిరిజనులు కళ్ళకు కట్టినట్లు చూపించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో డోలీ యాత్రను చేపట్టారు. నాలుగు కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగింది. తమ గ్రామాల్లో రహదారులు,విద్యుత్ సౌకర్యం కల్పించాలనినినాదాలు చేశారు. దాదాపు పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలు మీదుగా ఈ యాత్ర సాగింది. గత కొద్ది రోజులుగా కొండ శిఖర గ్రామాలకు రహదారులు వేయాలని గిరిజనులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఈ నేపథ్యంలో గిరిజనులే సొంతంగా నిధులు పోగుచేసుకొని రహదారులు నిర్మించుకుంటున్నారు. అయినా ప్రజాప్రతినిధుల్లో ఎటువంటి స్పందన లేదు. దీంతో గిరిజనులు ఆదివాసి దినోత్సవం సందర్భంగా భారీ డోలీ యాత్రను చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular