Sniper Wali: ప్రస్తుతం ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న విషయం ఉక్రెయిన్-రష్యా యుద్ధం. బలవంతమైన రష్యా తన సైనిక బలగంతో ఉక్రెయిన్ పై రణరంగాన్ని సృష్టిస్తోంది. రష్యా సాగిస్తున్న మారణ హోమంలో ఉక్రెయిన్ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. లక్షలాదిమంది దేశం విడిచి పారిపోతున్నారు. ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరిగినా.. అవి సక్సెస్ కాకపోవడంతో.. రష్యా మరింత వేగంగా దాడులు సాగిస్తోంది.
కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం వెనక్కు తగ్గకుండా వీరోచితంగా పోరాడుతున్నారు. ఆయన నేతృత్వంలో ఉక్రెయిన్ పౌరులతో పాటు సైన్యం వీరోచితంగా పోరాడుతోంది. ఇతర దేశాలకు చెందిన వారు కూడా జెలెన్ స్కీ పిలుపుతో యుద్ధంలో పాల్గొంటున్నారు. కాగా ఇప్పుడు స్నైపర్‌లలో ప్రపంచంలోనే మేటి అయిన వాలి ఉక్రెయిన్ తో జత కట్టాడు.
Also Read: భారత్ కు రష్యా సాయం.. తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు?
అతను గురి చూస్తే.. మూడు కిలోమీటర్ల అవతల ఉన్న వ్యక్తికి కూడా బుల్లెట్ దింపగలడు. అతను జెలెన్ స్కీ పిలుపుతో యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాడు. రెండు రోజుల్లో రష్యా సైనికుల్ని ఆరుగురిని హతమార్చాడు ఈ వాలి. ఇప్పటి దాకా అతను గురిపెట్టిన వ్యక్తి తప్పించుకున్న దాఖలాలు లేవు. అతని దరిదాపుల్లోకి వెళ్లడం అంటే చావుతో చలగాటం ఆడినట్టే మాజీ కెనడియన్ సైనికుడు వాలీ.
ఇతను తలచుకుంటే రోజుకు 40 మందిని మట్టుపెట్టగలడు. 2009, 2011లో కెనడియన్ సైన్యంలో అత్యంత ప్రమాదకరమైన స్నైపర్ గా ఆఫ్ఘనిస్తాన్ లో దుమ్ములేపాడు. ఆ తర్వాత ఇరాక్, సిరియాలో కూడా ఇతను పనిచేశాడు. వాలీ అంటే అరబిక్ లో సంరక్షకుడు అని అర్థం. ఇతను చాలా దూరం నుంచే ఉగ్రవాదులను మట్టుపెట్టిన వ్యక్తిగా పేరుగాంచాడు.
కాగా ఇప్పుడు జెలెన్‌స్కీ కోరిక మేరకు అతను ఏడాది కొడుకుతో పాటు భార్యను వదిలి రణరంగంలోకి దూకాడు. ఉక్రెయిన్ ప్రజల అవసరం కోసం తాను వచ్చినట్టు వెల్లడించాడు. ఉక్రెయిన్ వాసులు తనకు స్నేహితులు అని వారి కోసం పోరాడుతానంటూ చెప్పుకొచ్చాడు.