0.2 శాతం మందికే వర్క్‌ ఫ్రం హోం సామర్ధ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం అన్నిచోట్లా లాక్‌డౌన్లు విధించడంతో ఐటీ కంపెనీల ఉద్యోగులంతా వర్క్‌ ఫ్రం హోం నిర్వర్తిస్తున్నారు. కానీ వీరిలో చాలామంది పనితీరు సక్రమంగా లేదని, కేవలం 0.2 శాతం మంది మాత్రమే చక్కగా పనిచేస్తున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మిగిలిన 99.8 శాతం మందికి ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించే సామర్థ్యం లేదని ‘సైకీ మైండ్‌టెక్‌’ అనే సంస్థ తన సర్వే నివేదికలో స్పష్టం చేసింది. ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించలేకపోతున్న వారిలో […]

Written By: Neelambaram, Updated On : April 12, 2020 1:50 pm
Follow us on


కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం అన్నిచోట్లా లాక్‌డౌన్లు విధించడంతో ఐటీ కంపెనీల ఉద్యోగులంతా వర్క్‌ ఫ్రం హోం నిర్వర్తిస్తున్నారు. కానీ వీరిలో చాలామంది పనితీరు సక్రమంగా లేదని, కేవలం 0.2 శాతం మంది మాత్రమే చక్కగా పనిచేస్తున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

మిగిలిన 99.8 శాతం మందికి ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించే సామర్థ్యం లేదని ‘సైకీ మైండ్‌టెక్‌’ అనే సంస్థ తన సర్వే నివేదికలో స్పష్టం చేసింది.

ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించలేకపోతున్న వారిలో చాలామంది కొత్తగా నేర్చుకోవడం, విశ్లేషణ (95% మంది), ప్రాక్టికల్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యాల కొరత (65% మంది), సరైన ప్రణాళిక లేకపోవడం (71%మంది).. ఇలా ఏదో ఒక అంశంలో వెనుకబడి ఉన్న ట్టు ఈ సర్వేలో తేలింది.

సవాళ్ళను స్వీకరించేందుకు 16.97% మంది మాత్రమే సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ, ఇలాంటివారికి చిన్నచిన్న సలహాలిస్తే సత్ఫలితాలుంటాయని ఈ అధ్యయనం సూచించింది.

ఇలా ఉండగా, కరోనా సృష్టించిన సంక్షోభం కారణంగా మనదేశంలో కేవలం ఎగుమతిరంగంలోనే కోటిన్నర ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్‌ అధ్యక్షుడు షరద్‌కుమార్‌ సరాఫ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. లాక్‌డౌన్ల కారణంగా 50శాతం ఆర్డర్లు రద్దయ్యాయని తెలిపారు.

భవిష్యత్తు కూడా నిరాశాజనకంగానే ఉందని దాంతో భారీగా ఉద్యోగాల కోత పడుతాయని స్పష్టం చేశారు. భారత్‌లోని 40 కోట్లమంది పేదలు కరోనా సంక్షోభం కారణంగా మరింత దారుణమైన పేదరికంలోకి జారిపోనున్నారని అంతర్జాతీయ కార్మిక సంఘం ప్రకటించిన నేపథ్యంలో షరద్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.