https://oktelugu.com/

Khula Divorce : ‘ఖులా’తో మహిళల విడాకులు.. హైదరాబాద్ ఎక్కువవుతున్న డైవర్స్

ముస్లిం కుటుంబాలు తరచుగా చట్టపరమైన మార్గంలో వెళ్లడానికి ఇష్టపడరు. రెండోది ఈ నిబంధన గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడమనని చెబుతున్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : February 26, 2024 / 05:01 PM IST
    Follow us on

    Khula Divorce : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి కొద్ది రోజుల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ సానియా మీర్జానే భర్త నుంచి విడాకులు కావాలని కోరినట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పుడు ఇస్లామిక్ చట్టంలో ఈ విడాకుల పద్ధతిపై మరోసారి చర్చ ప్రారంభమైంది. విశేషమేమిటంటే హైదరాబాద్‌లో మహిళలు ఖులాను ఎంచుకునే ఉదంతాలు పెరుగుతున్నాయనే వార్తలు ఇటీవలి కాలంలో వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.

    ‘ఖులా’ అనేది ముస్లిం మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చే ప్రక్రియ.ఈ నిర్ణయం తీసుకునే హక్కు మహిళకే ఉంది. అయితే, దీని కోసం స్త్రీ తన భర్త వివాహ సమయంలో ఇచ్చిన ‘మెహర్’ (డబ్బు), తరువాత పొందే ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. అధికారిక లెక్కలు అందుబాటులో లేనప్పటికీ, పట్టణ ముస్లిం సమాజంలో, ధనిక -పేద వర్గాల మధ్య ఖులా ఆచారం పెరుగుతున్నదని పలువురు చెబుతున్నారు. ఖాజీలు, సామాజిక కార్యకర్తలతో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రతి నెలా కనీసం 20 నుంచి 25 ఖులా కేసులు నమోదవుతున్నాయని వెల్లడైంది. అయితే ఈ సంఖ్య ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు.

    ‘ఖులా’ ను ఎందుకు ఆశ్రయిస్తున్నారు.. ?
    ‘ఖులా’ కేసుల పెరుగుదల వెనుక అనేక కారణాలు ఉంటున్నాయి. 2019లో తలాక్-ఎ-బిద్దత్ (ఒకేసారి మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా వివాహాన్ని విచ్ఛిన్నం చేయడం) చట్టవిరుద్ధం అయినప్పటి నుంచి ఈ సంఖ్య పెరిగిందని కొందరు నమ్ముతున్నారు. చట్టపరమైన ప్రక్రియను నివారించడానికి కొంతమంది ముస్లిం పురుషులు తమ ఇళ్లను విడిచిపెడతున్నారని, దీంతో ముస్లిం మహిళలు ఖులా మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే, ఖులా నిర్ణయంలో స్త్రీని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ హక్కు ఆమెకు ఖురాన్ ద్వారా వచ్చిందని ముస్లిం పెద్దలు చెబుతున్నారు..

    భర్త అనుమతి తప్పనిసరా?
    భారతేదశంలోని ముస్లిం మహిళ ఖులా తీసుకోవడానికి తన భర్త అనుమతి అవసరమని చెబుతారు. అయితే ఇతర దేశంలో ఈ పరిస్థితి లేదని తెలుస్తున్నది. ఖులా నిర్ణయం స్త్రీ స్వతంత్ర నిర్ణయం. సామాజిక లేదా కుటుంబ ఒత్తిడి కూడా ప్రభావితం చేస్తున్నదనేచర్చ జరుగుతోంది. దీనిపై మరింత చర్చ, పరిశోధన అవసరం. భారతదేశంలో ఖులా ప్రక్రియ కొంచెం క్లిష్టంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడ సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో దశాబ్దాలు కూడా పట్టవచ్చు. దీంతో స్త్రీ విడాకులు పొందడానికి చాలా కాలం పాటు నిరీక్షించాల్సి వస్తుంది..

    ముస్లిం మహిళలు ఏం చెబుతున్నారు
    ముస్లిం మహిళ తర భర్త నుంచి విడాకులు పొందడానికి దాదాపు ఆరు సంవత్సరాలు నిరీక్షించాల్సి వచ్చిందని ఓ మహిళా న్యాయవాది తెలిపారు. ఆమె భర్త మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో సదరు మహిళ విడిపోవాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె మౌల్వీ వద్దకు వెళ్లిన ప్రతిసారీ వెనక్కి పంపాడు. భర్త అంగీకారం తీసుకోమని సూచించారు. భర్త విడాకులకు అంగీకరించకపోవడంతో నిరీక్షించాల్సి వచ్చింది. అలాగే రాజీ పడాల్సి వచ్చింది. చివరగా, ఆమె భర్త మరొక మహిళతో జీవించాలని నిర్ణయించుకోవడంతో ఆమె అనుమతించింది. దీంతో సదరు మహిళర కూడా ఖులా మార్గాన్ని ఎంచుకుంది. దాదాపు ముస్లిం మహిళలు ఖులాను ఎంచుకోవడానికి ఇలాంటి కారణాలు అని చెబుతున్నారు.

    గృహ హింస భరించలేక..
    ఓ ముస్లిం మహిళ గృహ హింస భరించలేక ఖులా మార్గాన్ని ఎంచుకుంది. కానీ ఖాజీ తన సమ్మతిని ధ్రువీకరించడానికి తన భర్తను ఎలా పిలిచాడో ఆమెకు గుర్తుంది. భర్త అంగీకరించిన తర్వాతే ఇద్దరినీ సమావేశ పరిచారు. అలాగే హైదరాబాద్ పాతబస్తీలో ఓ ముస్లిం మహిళ ఖులా కోసం ఇప్పటికీ పోరాడుతుంది. వివాహమైన 25 ఏళ్ల తరువాత తన భర్త చేసిన నమ్మకద్రోహాన్ని ఇక భరించలేనని నిర్ణయించుకుంది.

    ఖాజీలు చెబుతున్న మాటేమిటి?
    విడాకుల విషయంలో భార్య భర్త సమ్మతి కోసం ఎదురుచూడడం ‘మహిళల హక్కుల ఉల్లంఘన’ అని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. అయితే, ఈ విషయంలో ఖాజీకి భిన్నమైన అభిప్రాయం ఉంది. ఖులా విషయంలో మహిళ భర్తను సంప్రదిస్తామని ఖాజీలు చెబుతున్నారు. వారిద్దరినీ కలిసి జీవించాలని కౌన్సెలింగ్ ఇస్తామని, రాజీకి రావాలని సూచిస్తున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కానప్పుడు ఖులా మార్గంతో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. అయితే భర్త అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని మాత్రం ఖండించలేదు. ‘జీవనశైలిలో మార్పులు, కుటుంబాల జోక్యాలు పెరగడంతో ఖులా ఎక్కువవుతున్నదని కొందరు ఖాజీలు చెబుతున్నారు. ముస్లిం సమాజంలో జరిగే వివాహాల్లో ప్రస్తుతం కేవలం 7% నుంచి 8% మాత్రమే ఖులా మార్గంలో ముగుస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే ముస్లిం మహిళలు ఖులా పొందడం క్లిష్టతరం కాదని, ఇది సాధారణంగా ప్రక్రియేనని చెబుతున్నారు. విడాకులు తీసుకున్న మహిళ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని చెబుతున్నారు.

    ఏమిటి ఈ.. ఫస్ఖ్-ఎ-నిఖా ?
    ఇస్లామిక్ చట్టంలో వివాహాన్ని రద్దు చేయడానికి ఇది మరొక మార్గం. విడాకులు లేదా ఖులా కోసం భర్త తన భార్యకు ‘అందుబాటులో లేనప్పుడు’ ఇది ఉపయోగిస్తున్నారు. ఫస్ఖ్ విషయంలో, మహిళ కోర్టుకు వెళ్లి నిఖాను రద్దు చేయమని అభ్యర్థించవచ్చు. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమెకు విడాకులు మంజూరవుతాయి. అయితే చాలా మంది ఫస్ఖ్‌ను ఎంచుకోకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. ముస్లిం కుటుంబాలు తరచుగా చట్టపరమైన మార్గంలో వెళ్లడానికి ఇష్టపడరు. రెండోది ఈ నిబంధన గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడమనని చెబుతున్నారు.

    – అజయ్ యాదవ్