
Amaravati Movement- YCP: ఏకబిగిన కొనసాగిన అమరావతి ఉద్యమం 1200 రోజుల మైలు రాయిని దాటింది. రాజధానిగా అమరావతి ఫైనల్ చేయాలని వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి అక్కడ భూములు ఇచ్చిన రైతులు నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో విధాలుగా ఆటంకపరిచేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు అమరావతి జేఏసీ ఒకటి ఏర్పాటైంది. ఇటీవల ఆ ప్రాంతంలో జరిగిన సభల్లో కొంతమంది ముఖ్య నాయకులు కనబడలేదు. దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
అడుగడుగునా ఆటంకాలే..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిని రాజధానిగా ససేమిరా ఒప్పుకోలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారమే జరుగుతుందని, జగన్ పరిపాలనలతో తన మార్కు కనిపించేందుకు అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేశారు. అప్పటి వరకు ఉన్న హడావుడి ఈ ప్రాంతమంతా ఒక్కసారిగా మూగబోయింది. దీంతో భూములిచ్చిన రైతుల్లో ఆందోళన మొదలైంది. కొంతమంది గుండెలు కూడా ఆగిపోయాయి. రాజధాని ప్రాంతంగా పేరుబడ్డ గ్రామాల్లో నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకునే వరకు పట్టువీడమని భీష్మించుకొని కూర్చున్నారు. రైతులు చేస్తున్న ఆందోళనల్లో ఒట్టిదేనని అదంతా టీడీపీ నేతలు ఆడిస్తున్న నాటకమంటూ వైసీసీ నేతలు కొట్టిపారేశారు. మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మీర విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులతో నాటకాలు ఆడిస్తున్నారని అన్నారు. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని రైతులు మండిపడ్డారు.
పోటీగా వైసీపీ శిబిరాలు
రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలకు ప్రతిగా ప్రభుత్వానికి మద్దతుగా వైసీపీ శ్రేణులు కూడా శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ రాజధాని వద్దంటూ డిమాండ్లు చేయడం మొదలుపెట్టారు. ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యం వహిస్తూ ముందుండి, రైతులు ర్యాలీలు చేపట్టిన ప్రతీసారి, వైసీపీ కార్యకర్తలు కూడా ర్యాలీ నిర్వహిస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు రోజుల క్రితం అమరావతి రైతుల దీక్షకు మద్దతుగా వెళ్లిన బీజేపీ నాయకులను వెంటపడి మరీ కొట్టడం ఇక్కడ పరిస్థితులకు అద్దం పడుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని కూడా అడుగడుగునా పోలీసుల ఆధ్వర్యంలో నిర్బంధం విధిస్తున్నారు. అడుగడుగునా ఆటంకాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారు.

ఉద్యమం నీరుగార్చేందుకు వైసీపీ సక్సెస్ అవుతుందా?
అమరావతి ఉద్యమాన్ని తారాస్థాయికి చేరుకొని 1200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ‘దగా పడ్డ రైతులు – దోపిడీకి గురవుతున్న ఆంధ్ర రాష్ట్ర పౌరులు పేరుతో అమరావతి జేఏసీ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. రాజధాని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయితే, మొదటి నుంచి ఒక్కడిగానే మొదలుపెట్టి తీవ్ర ఉద్యమంగా రూపుదాల్చేందుకు ప్రతిన బూనిన గద్దె తిరుపతిరావు ఆ సభలో కనబడకపోవడంపై పలు పుకార్లు మొదలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో గతేడాది నిలచిపోయిన ఉద్యమాన్ని ఆయన ఒక్కడే పూర్తి చేసేందుకు ముందుకు కదిలారు. అయితే, 1200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో నిర్వహించిన సభలో ఆయన ఎక్కడా కనబడలేదు. కనీసం ఫొటోలు కూడా బయటకు రాలేదు. దీంతో అమరావతి ఉద్యమంలో లుకలుకలు మొదలయ్యాయని వైసీపీ శ్రేణులు ప్రచారం ప్రారంభించారు. అయితే, ఉద్యమం మాత్రం ప్రస్తుతం జరుగుతూనే ఉంది. నాయకుల మధ్య పొరపొచ్చాలు తీసుకువచ్చేందుకు వైసీపీ నేతలు సఫలీకృతులయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాబోవు ఎన్నికల్లో ఇక్కడ ఓటింగ్ పూర్తిగా వైసీపీ పూర్తిగా వ్యతిరేకంగా జరగబోతుందని స్పష్టం కావడంతో వైసీపీ అధిష్టానం ఇంకెన్నీ అరాచకాలు సృష్టించబోతుందోనన్న చర్చ మొదలైంది.