https://oktelugu.com/

BJP focus on Telangana: తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతుందా? టీఆర్ఎస్ ను ఓడించగలదా?

BJP focus on Telangana : దేశంలో ఇప్పుడు బీజేపీకి ఎదురులేదు. మోడీని ఎదురించే నేతలెవరు లేరు. ఎదురించిన వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. ఈ మధ్య జాతీయ స్థాయిలో కొత్త పార్టీ అంటూ.. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా జాతీయ నేతగా ఎదిగేందుకు కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. అందుకే తెలంగాణపై దండయాత్రకు బీజేపీ పెద్దలు.. దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తులంతా కలిసి వచ్చారు. తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేయడానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2022 / 02:44 PM IST
    Follow us on

    BJP focus on Telangana : దేశంలో ఇప్పుడు బీజేపీకి ఎదురులేదు. మోడీని ఎదురించే నేతలెవరు లేరు. ఎదురించిన వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. ఈ మధ్య జాతీయ స్థాయిలో కొత్త పార్టీ అంటూ.. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా జాతీయ నేతగా ఎదిగేందుకు కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. అందుకే తెలంగాణపై దండయాత్రకు బీజేపీ పెద్దలు.. దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తులంతా కలిసి వచ్చారు. తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేయడానికి ప్రధానంగా కొన్ని బలమైన కారణాలున్నాయి. ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు. గుజరాత్ విజన్ ను దృష్టిలో పెట్టుకొని పాపులారిటీతో ప్రధాని రేసులో నిలిచారు. రెండు సార్లు పీఎం సీటును అధిరోహించారు. ఇప్పుడే అదే ఫార్ములాను తెలంగాణను అభివృద్ధిపథంలో నిలిపిన కేసీఆర్ అనుసరిస్తున్నారు. జాతీయ నేతగా మారేందుకు.. ప్రధాని పదవికి పోటీదారుగా కేసీఆర్ వస్తున్నారు. మోడీతో సమానమైన మాటల దాడి.. పరిణతి.. రాజకీయాల్లో చక్రం తిప్పగల నేర్పు కేసీఆర్ సొంతం. అందుకే ఆదిలోనే కేసీఆర్ ను తొక్కేసి తెలంగాణకే పరిమితం చేసేలా ఈ మూడు రోజుల తెలంగాణ దండయాత్రకు బీజేపీ డిసైడ్ అయినట్లు సమాచారం.

    -తెలంగాణకే కేసీఆర్ ను పరిమితం చేయడం..
    హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు పెట్టడానికి ప్రధాన కారణం కేసీఆర్ ను అణగదొక్కడానికేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జాతీయ నేతగా కేసీఆర్ ఎదగడానికి తెలంగాణ మోడల్ ఉంది. అభివృద్ధి ఎజెండా ఉంది. దేశంలో కాంగ్రెస్ బలంగా లేదు. బీజేపీని ఎదురించే ప్రత్యామ్మాయం లేదు. అందుకే ఆలోటును భర్తీ చేయడానికి ‘బీఆర్ఎస్’ పేరుతో కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఇది కనుక ప్రాంతీయ పార్టీలతో బలోపేతం అయితే మొదటికే మోసం.. అందుకే వ్యూహాత్మకంగా బీజేపీ తెలంగాణపై ఫోకస్ చేసింది. ఇక్కడ అధికారాన్ని సాధించడమే కాదు.. కేసీఆర్ ను మరోసారి గెలవకుండా.. ఢిల్లీ గడప తొక్కకుండా నియంత్రించాలని పూనుకుంది. అందుకే జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట మూడు రోజుల దండయాత్ర చేసింది. ఈ మూడు రోజులు టీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎంతలా అంటే ఆఖరు కేటీఆర్, కేసీఆర్ కూడా బీజేపీ ప్రభావం కనిపించకుండా కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు హైదరాబాద్ అంతా గుప్పించేశారు. బీజేపీ అంటే భయం లేకుంటే వారు ఇలా చేసే వారు కాదు కదా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ను ఎలాగైనా తొక్కి పెట్టి తెలంగాణకే పరిమితం చేయాలని బీజేపీ డిసైడ్ అయినట్టు ఈ మూడు రోజుల వాతావరణం బట్టి తెలుస్తోంది..

    -తెలంగాణలో అధికారాన్ని సాధించడమే బీజేపీ ధ్యేయం
    దక్షిణ భారత్ లో బీజేపీ బలోపేతం కావడానికి అవకాశాలున్న మరో రాష్ట్రం తెలంగాణనే. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉండగా.. తెలంగాణలో బలంగా తయారవుతోంది. కేసీఆర్ పై వ్యతిరేకతనే బీజేపీకి ఇక్కడ బలంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ బలహీనత ఆ పార్టీకి ఆయుధంగా మారింది. రోజురోజుకు తెలంగాణలో కాంగ్రెస్ తేలిపోవడం.. ఆ స్థానంలో బీజేపీ బలోపేతం కావడానికి చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పటికే కాంగ్రెస్ లోని సీనియర్లను లాగేసింది. డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, గడ్డం వివేక్ లాంటి హేమాహేమీలను చేర్చుకుంది. తెలంగాణలో అధికారాన్ని సాధించడమే ధ్యేయంగా కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతోంది. బండి సంజయ్ దూకుడుగా వెళుతూ టీఆర్ఎస్ కు చమటలు పట్టిస్తున్నారు. ఆయనకు కేంద్రం నుంచి అన్ని అండదండలు అందుతుండడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఎలాగైనా సరే తెలంగాణ వచ్చేసారి కేసీఆర్ ను ఓడించాలని బీజేపీ ఈ మూడు రోజులు మేథోమధనం చేసింది. జాతీయ స్థాయి ఎజెండాతోపాటు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహకర్తలతో సమాలోచనలు చేసింది. అది విజయవంతమైనట్టు తెలిసింది. తెలంగాణ బీజేపీకి కొత్త దశదిశాను ఇచ్చినట్టు తెలిసింది. ఈ మూపులో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం ఖచ్చితంగా బీజేపీకి హైప్ వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం.

    -టీఆర్ఎస్ బలహీనతనే బీజేపీ బలం
    బీజేపీ తెలంగాణలో బలపడుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, అప్పులు, అవినీతి, కుటుంబ పాలన, అభివృద్ది రెండే మూడు నియోజకవర్గాలకే పరిమితం కావడం తదితర అంశాలు అధికార పార్టీపై ఇబ్బందిగా మారాయి. ఇవే అంశాలను తనకు అనుకూలంగా మల్చుకున్న బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుంటోంది. అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడే పెట్టి మూడు రోజులు తెలంగాణపై దండయాత్రకు బీజేపీ పెద్దలు వచ్చారు. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త ఉత్సాహం ఇచ్చాయి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండు విడతలుగా చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర క్యాడర్‌లో జోష్‌ నింపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న అంచనాలు పెరిగాయి. ఉత్సాహంగా ఉన్న పార్టీ క్యేడర్‌కు మరింత ఊపు తెచ్చే చర్యల్లో భాగంగా బీజేపీ అధిష్టానం జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేసింది.

    -బీజేపీ దండయాత్రతో తెలంగాణలో పుంజుకుంటుందా?
    కమలం దండు రాష్ట్రానికి రాకతో కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌నేతల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, హోమంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టార్గెట్‌గా విమర్శలు చేశారు. అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ క్రమంలో జాతీయ కార్యవర్గాలకు దేశవ్యాప్తంగా ఉన్న 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరై టీఆర్ఎస్ కు గుబులు పుట్టించారు. ప్రస్తుతం రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత టీఆర్ఎస్ పై ఉంది. ఆ వ్యతిరేకతతోపాటు టీఆర్ఎస్ నుంచి ఈసారి చాలా మంది నేతలు జంప్ అయ్యే అవకాశాలున్నాయి. వారందరి సాయంతో బీజేపీ బలపడాలని చూస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా విస్తరణ.. నేతలు, కార్యకర్తలను సమీకరించి పుంజుకోవాలని.. 2023లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అవకాశం విడవకుండా టీఆర్ఎస్ ను ఓడించాలని చూస్తోంది. తెలంగాణలో మునుపటి కంటే ఇప్పుడు బీజేపీకి కొత్త బలం వచ్చినట్టైంది. నేతలంతా సమరోత్సాహంతో పనిచేసేందుకు బీజేపీ జాతీయ నేతలు బూస్ట్ ఇచ్చారు.

    -కమలం పార్టీ ఖలేజా ఎంత?
    తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన లోపం రాష్ట్రమంతా నియోజకవర్గ స్థాయి నేతలు, క్షేత్రస్థాయిలో క్యాడర్ లేకపోవడమే.. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ లో బలంగానే ఉన్నా కీలకమైన దక్షిణ తెలంగాణలో బీజేపీకి సరైన నాయకులు లేరు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లోనే ఉన్నా పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేగా గెలిచే నాయకులు లేరు.. అదే కాంగ్రెస్ కు 119 నియోజకవర్గాల్లో బలమైన నేతలు, క్యాడర్ ఉంది. బీజేపీకి ఇదే లోపం. అందుకే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పార్టీ బలోపేతమే లక్ష్యంగా సాగి 2023 కల్లా ప్రతి నియోజకవర్గంలోనూ నేతను రెడీ చేసి గెలుపు గుర్రం ఎక్కాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. మరి అది నెరవేరుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.