Telangana Govt Bheemla Nayak: కడుపున పుట్టిన ఏపీ కాలదన్నుతుంటే.. ఆదరించిన తెలంగాణ అక్కున చేర్చుకుంటోంది. టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అక్కడి ప్రభుత్వం ఇబ్బందులకు తెలుగు సినీ పరిశ్రమ రగిలిపోతుంటే.. తెలంగాణ సర్కార్ ఆదరణతో సంతోషపడుతోంది. అందుకే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య టాలీవుడ్ ఊగిసలాడుతోంది. ఏపీకి టాలీవుడ్ ను మార్చాలన్న జగన్ ప్రయత్నాలకు తాజాగా మంత్రి కేటీఆర్ రంగ ప్రవేశం చేసి చెక్ పెట్టారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై సీఎం జగన్ తో ఇటీవల చిరంజీవి సహా సినీ ప్రముఖులు భేటి అయిన సంగతి తెలిసిందే. ఆ భేటిలో జగన్ ప్రధానంగా కోరింది ‘విశాఖకు టాలీవుడ్ తరలిరావాలని..’ అందరికీ స్థలాలు ఇస్తానని.. స్టూడియోలకు ఎకరాలకు ఎకరాలు కేటాయిస్తానని.. మీరంతా వైజాగ్ వచ్చేయాలని జగన్ కాస్త సీరియస్ గానే నవ్వుతూ చెప్పుకొచ్చారు. అయితే సినీ ప్రముఖులు దీనిపై బహిరంగంగా ఏం మాట్లాడలేదు. జగన్ ఆ మీటింగ్ తర్వాత సినీ టికెట్ల వివాదాన్ని ఇప్పటికీ పరిష్కరించలేదు.
కట్ చేస్తే.. ఏపీలో సినిమా టికెట్ల వివాదం సహా ఇతర సమస్యల పరిష్కారానికి చిరంజీవి, ప్రభాస్, మహేష్ లాంటి వారు వైజాగ్ లో స్టూడియోలు పెట్టడానికి రెడీ కాబోతున్నారని ఒక టాక్ నడిచింది. అందుకే తెలంగాణ సర్కార్ అలెర్ట్ అయ్యింది. టాలీవుడ్ ను హైదరాబాద్ కేంద్రంగానే కొనసాగించడానికి ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ను బాగా వాడుకుందన్న టాక్ వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా రేపు విడుదలయ్యే ‘భీమ్లానాయక్’ మూవీకి తెలంగాణలో ఐదో షోకు కూడా అనుమతిచ్చింది కేసీఆర్ సర్కార్. ఏపీలో బెనిఫిట్ షోలు సహా అన్నింటిపై నిషేధాన్ని విధించింది జగన్ సర్కార్. భీమ్లానాయక్ రేట్లు పెంచవద్దని థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లకు హుకూం జారీ చేసింది.
అందుకే ఈ సదావకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది తెలంగాణ సర్కార్. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ రంగంలోకి దిగి ‘భీమ్లానాయక్’ సినిమా ప్రీరిలీజ్ కు రావడమే కాదు..‘హైదరాబాద్ ను ఇండియా సినిమా ఇండస్ట్రీకే హబ్ గా మార్చుతామని.. దీనికి టాలీవుడ్ పెద్దలంతా సహకరించాలని గొప్ప పిలుపునిచ్చారు. టాలీవుడ్ కు సంబంధించిన అన్ని సమస్యలు, ఇతరత్రా విషయాలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుక
దీంతో వైజాక్ కు తరలిపోవాలన్న టాలీవుడ్ పెద్దల మనసులు కేటీఆర్ మార్చేశారు. భీమ్లానాయక్ మూవీకి బెనిఫిట్ షోలు, ప్రీషోలు వేయించి.. 5వ షోకు అనుమతించి.. టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించి కేసీఆర్ సర్కార్ ఆదరించింది. అదే ఏపీలో ఈ సినిమాను తొక్కేశారనే ఆరోపణలున్నాయి. దీంతో సహజంగానే తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణ సర్కార్ పిలుపునకు స్పందించి ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వైజాగ్ కు వెళ్లే ఉద్దేశం ఎవరికీ లేకున్నా.. జగన్ ఒత్తిడితో పెట్టుబడులకు మొగ్గుచూపిన సినీ ప్రముఖులను సైతం నిన్న భీమ్లానాయక్ ఫంక్షన్ కు వచ్చిన కేటీఆర్ మాటలతో వెనక్కి మళ్లేలా చేశారని తెలుస్తోంది. మొత్తంగా కేసీఆర్ సర్కార్ టాలీవుడ్ కు పెద్దపీట వేసి హైదరాబాద్ లోనే ఇండస్ట్రీ బలంగా ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతోంది.
Also Read: Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ మూవీని జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా?