Jamili Elections
Jamili Elections: ఒకే దేశం.. ఒకే ఎన్నికల నినాదంతో పార్లమెంటు ఎన్నికలకు ముందే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. దేశంలో ప్రతీ ఏటా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఎన్నికల కోడ్ అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. మరోవైపు ఎన్నికల కారణంగా భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే మధ్యలో ఎలాంటి ఆటంకం ఉండదని కేంద్రం భావించింది. ఈ క్రమంలోనే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా మోదీ మొదట దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దేశమంతా చర్చ తర్వాత రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. కమిషన్ దేశంలోని వివిధ పార్టీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం నివేదిక రూపొందించడంతోపాటు ఎన్నికలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రాజ్యాంగ సవరణలు ఏంటి అనే వివరాలతో నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం.. కేంద్రం బిల్లు సిద్ధం చేసింది.
బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..
జమిలి ఎన్నికల బిల్లును కేంద్రం మంగళవారం(డిసెంబర్ 18న) లోక్‌షభ ముందుకు తీసుకువచ్చింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీనిపై చర్చ కొనసాగిస్తుండగా బిల్లు బీజేపీ, కాంగ్రెస్ సహా చాలా పార్టీలు విప్ చారీ చేశాయి. ఈ బిల్లును కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకిస్తున్నారు. ఆయా పార్టీల ఎంపీలు మాట్లాడుతూ బిల్లు ప్రవేశపెట్టగానే ఆమోదం దొరకదని తెలిపారు. రాజ్యాంగ సవరణలు తప్పనిసరని పేర్కొన్నారు. అందుకు పార్లమెంటులో సాధారణ మెజారిటీ సరిపోదని స్పష్టం చేశారు. మూడింట రెండొంతుల ఎంపీల మద్దతు కావాలన్నారు.
67 శాతం మద్దతు కావాలి..
జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే 67 శాతం ఎంపీ లమద్దతు కావాలలి. లోక్‌సభలో 362 మంది ఎంపీలు, రాజ్యసభలో 164 మంది సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుత బలా బలాలు పరిశీలిస్తే.. 543 మంది ఎంపీలు ఉన్న లోక్‌సభలో ఎన్డీఏకే 293 మంది, విపక్షాలకు 235 మంది ఎంపీలు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందడం అంత ఈజీ కాదు. రాజ్యసభలో కూడా 245 స్థానాలు ఉండగా అధికార పక్షానికి 125, విపక్ష ఇండియా కూటమికి 88 మంది ఎంపీలు ఉన్నారు. ఈలెక్కన చూసినా రాజ్యసభలో జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందడం కష్టమే అంటున్నాయి విపక్షాలు..
ఈ రాజ్యాంగ సవరణలు..
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈ రాజ్యాంగ సవరణలు తప్పనిసరి, ముఖ్యంగా పార్లమెంటు కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83, ఆర్టికల్ 83(2)ని సవరించాలి. అసెంబ్లీలకు సంబంధించిన ఆర్టికల్ 172(1), 2బీ, ఆర్టికల్56లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 85(2బీ), ఆర్టికల్ 327, ఆర్టికల్ 324, ఆర్టికల్ 324(బి), ఆర్టికల్ 325లను కూడా మార్చాలి.
అనుకూల, వ్యతిరేక పార్టీలు ఇవీ..
జమిలి ఎన్నికల బిల్లుకు కొన్ని పార్టీలు మద్దతు ఇస్తుండగా కొన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీఏలోని పార్టీలని జమిలికి జై కొడుతున్నాయి. కూటమిలో ప్రధాన పక్షమైన బీజేపీతోపాటు , టీడీపీ, జేడీయూ, షిండే శివసేన, అజిత్‌పవార్ ఎన్‌సీపీ, జేడీఎస్, జనసేన, లోక్‌జన్‌శక్తి, రాష్ట్రీయ లోక్‌దళ్, పట్టల్ మక్కల్ కట్చి, ఏజీపీ, సోనేవాల్ అప్నాదళ్, నేషనరల్ పీపుల్స్ పార్టీ, జమిలికి ఓకే చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ నో చెబుతున్నాయి.
అన్ని ఎన్నికలు ఒకేసారి..
పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందితే చరిత్రే అవుతుంది. బిల్లు చట్టబద్ధత లభిస్తే పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు అన్నీ ఒకేసారి జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహిస్తారు.