Komatireddy Venkat Reddy: సొంత పార్టీని దారుణంగా కించ పరుస్తున్న ఎంపీ కోమటిరెడ్డిపై హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా నోటీసులతో సరి పెడుతుందా అన్నదానిపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన పార్టీలో ఉండి స్వయం వినాశనానికి పాల్పడుతున్నారని.. పార్టీని వీలైనంతగా భ్రష్టు పట్టించడానికే పని చేస్తున్నారని కాంగ్రెస్ హైకమాండ్‌కు లెక్క లేనన్ని ఫిర్యాదులున్నాయి. రేవంత్‌రెడ్డికి మద్దతుదారుగా ఉన్నారని షబ్బీర్ అలీపై లేనిపోని అభాండాలు వేసి హైకమాండ్‌కు లేఖ రాసి.. దాన్ని మీడియాలో ప్రచారం చేసినప్పుడే ఆయన నైజం తెలిసిపోయిందని చెబుతున్నారు.

చర్యలు తీసుకుంటే..
అయితే కోమటిరెడ్డి సిట్టింగ్ ఎంపీ. ఆయనను కోల్పోతే ఓ ఎంపీని కోల్పోయినట్లు అవుతుంది. ఈ కారణంగానే హైకమాండ్ ఎదురు చూస్తూ ఉంది. కానీ కోమటిరెడ్డి దాన్నే అలుసుగా చేసుకుని మరింతగా చెలరేగిపోతున్నారు. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయే లా లేరని.. కేవలం గెంటి వేయించుకునేందుకే ఇలా చేస్తున్నారని కొంత మంది వాదిస్తున్నారు. ఓపిక పడితే ఆయనే వెళ్లిపోతారని మరికొందరు పేర్కొంటున్నారు.
అలాగే వదిలేస్తే..
కానీ పార్టీలో ఉండి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేస్తున్న వ్యవహారాలను ఇంకా భరిస్తే.. ఎంపీని కోల్పోవాల్సి వస్తుందని అలాగే వదిలేస్తే అది హైకమాండ్ చేతకాని తనానికి సాక్ష్యం అవుతుందన్న అభిప్రాయానికి పార్టీ అధిష్టానం వచ్చింది. ఈ ఉద్దేశంతో చర్యలకు సిద్ధమైంది. పది రోజుల సమయాన్ని కోమటిరెడ్డికి ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చింది. ఆ సమయంలోపు ఆయన స్పందిస్తేం సరే లేకపోతే చర్యలు తీసుకోవచ్చు.
తనకు అనుకూలంగా మార్చుకునే చాన్స్..
అయితే కోమటిరెడ్డి.. అధిష్టానం నోటీసులను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. రాహుల్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఇలా చేయడం వల్ల డైవర్షన్ జరుగుతుంది. కోమటిరెడ్డికి కూడా ఇదే కావాలి.

రాహుల్ పాదయాత్ర తర్వాతే..
రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్రం ప్రస్తుతం తెలంగాణలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరిపై చర్యలు తీసుకున్నా.. వేటు పడిన నేతలు కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో అధికార టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు అవకాశం కూడా ఇచ్చినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోకుండా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. పాదయాత్ర నవంబర్ 7 వరకు రాష్ట్రంలో సాగుతుంది. రాహుల్ యాత్ర ముగిసిన వెంటనే కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.