Jagan 2024 Elections: జగన్ తన మార్కు పాలనను నాలుగేళ్లు పూర్తిచేసుకున్నారు. ఐదో పడిలో పడ్డారు. ఇంతలో ముందస్తు ఎన్నికల గోల కనిపిస్తోంది. అయితే దీనిపై స్పష్టత లేదు. ప్రజలు ప్రభుత్వ మంచీ చెడులను తెలుసుకోవడానికి ఈ నాలుగేళ్లు సరిపోతోంది. ఈపాటికే ప్రభుత్వ పాలనా తీరుపై ఒక నిర్ణయానికి వచ్చుంటారు కూడా. కానీ పార్టీల ఎన్నికల సన్నద్ధత, పొత్తులు, వ్యూహాలు సైతం ప్రభావితం చూపే అవకాశము ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వంపై సానుకూలత ఎంత ఉందో..అంతకు మించి వ్యతిరేకతా ఉంది. కానీ సానుకూలత పైచేయిగా నిలుస్తుందో.. లేక వ్యతిరేకత పనిచేస్తుందో తెలియాల్సి ఉంది.
వైసీపీ సర్కారు పనితీరును ప్రమాణికంగా తీసుకుంటే బటన్ నొక్కుడుకే ప్రాధాన్యమిచ్చారు. అయితే ప్రజల్లో ఓ వర్గం స్వాగతిస్తుండగా.. మరోవర్గం మాత్రం వ్యతిరేకిస్తోంది. భావితరాలకు ఇదో ముప్పుగా పరిణమిస్తోంది. సంక్షేమ పథకాలతో పేద, దిగువ, మధ్యతరగతి ప్రజల్లో అనుకూలం ఉన్న మాట వాస్తవం. అదే సమయంలో మధ్యతరగతి , ఉద్యోగులు, ఉన్నత వర్గాలు, ఆలోచనాపరుల నుంచి తీరని వ్యతిరేకత కనిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలు, ఆదాయ సముపార్జన శాఖలు మినహా మిగిలిన వ్యవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఏర్పడే దుష్పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మితిమీరిన రాజకీయ జోక్యం, అవినీతి వంటివి ప్రతికూలతలే. దీంతో మధ్యతరగతి, అంతకు మించి వర్గాలు ప్రభుత్వానికి దూరమయ్యాయి.
వైనాట్ 175 అన్నవైసీపీ స్లోగన్ సైతం అటకెక్కింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ముందు అన్నట్టు … అనేందుకు వైసీపీ శ్రేణులు ఓకింత ఆలోచిస్తున్నాయి. ధీమా సడలిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క మాట చెప్పాలంటే పట్టణ ఓటరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.వైసీపీకి ప్రతికూల వాతావరణం నెలకొంది. అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే వైసీపీ గట్టెక్కగలదన్న మాట. పట్టణ ఓటరు నాడి జగన్ కు వ్యతిరేకంగా ఉందన్న మాట.
జగన్ యుద్ధ తంత్రాన్ని మరిచిపోయారు. తాంత్రిక విధానాలను ఆశ్రయించారు. వలంటీర్లు, సచివాలయాలు అంటూ సైన్యం లేకుండా చేసుకున్నారు. పార్టీ శ్రేణుల పరిధి, పాత్ర తగ్గించేశారు. వారికి ప్రాధాన్యత లేకుండా చేశారు. పూర్తిగా నిర్వీర్యం చేశారు. శ్రేణులు అవసరం లేదు అన్నట్లుగా పార్టీ వ్యవహార శైలి ఉంది. అధినాయకత్వమే కాదు ఎమ్మెల్యేల వ్యవహారం పరాకాష్టకు చేరింది. సామంత రాజులుగా మారిపోయారు. కప్పం కట్టాలని హుకుం జారీచేస్తున్నారు. అడ్డువచ్చే నాయకత్వాన్ని సైతం విభేదిస్తూ బయటకు వెళుతున్నారు. పార్టీలో కుమ్ములాటలు తగ్గడం లేదు. . గణనీయంగా ఎమ్మెల్యేలను మార్చకపోతే పార్టీ శ్రేణులే వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు.
రాజధాని లేని రాష్ట్రంగా మార్చారన్న అపవాదు మూటగట్టుకున్నారు. . మూడు రాజధానులు ఆలోచనతో 33 నియోజకవర్గాలు ఉన్న కృష్ణా గుంటూరు , ప్రకాశం జిల్లాలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమకు ప్రేక్షక పాత్రలో మిగిల్చారని గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అసలు రాజధానే ఆసక్తిలేని ఉత్తరాంధ్రను ప్రతిపాదించి చేజేతులా ఇతర ప్రాంతాలను దూరం చేసుకున్నారు. మొత్తానికి వికేంద్రీకరణ విషయంలో నిర్మాణాత్మక వైఖరి ని అనుసరించక వేస్తున్న తప్పటడుగులు వైసీపీకి ప్రతికూలాంశమే. అయితే ఎన్నికలకు ఇది చివరి ఏడాది. కొన్ని రకాల తప్పులు, తప్పటడుగులను అధిగమిస్తే ప్రజలు పునరాలోచించే అవకాశం సైతం ఉంది.