Nara Lokesh Padayatra: తెలుగునాట పాదయాత్రలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పాదయాత్రలతో తిరుగులేని నాయకులుగా ఎదిగిన వారూ ఉన్నారు. తమ నాయకత్వాలను పటిష్టం చేసుకున్న వారూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీ యువనేత నారా లోకేష్ అటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి షెడ్యూల్ రూపొందించుకున్నారు. తొలుత పోలీస్ శాఖ నుంచి అనుమతులు రాలేదు. దీంతో టీడీపీ రాష్ట్ర డీజీపీ మధ్య లేఖాస్త్రాలు నడిచాయి. ఎట్టకేలకు పోలీస్ శాఖ అనుమతులివ్వడంతో పాదయాత్రకు మార్గం సుగమమైంది.

పాదయాత్రలు పార్టీలు బలోపేతం కావడంతో పాటు నాయకత్వాలను పటిష్టపరుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విషయం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో నిరూపితమైంది. 2004 కు ముందు ఉమ్మడి ఏపీలో దిశ నిర్దేశం లేని కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక ఆశాదీపంలా కనిపించారు. అప్పటి వరకూ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు మాత్రమే. కానీ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి ‘కీ’లక నేతగా మారిపోయారు. కాంగ్రెస్ అంటే రాజశేఖర్ రెడ్డి.. రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ అన్న రేంజ్ లో పరిస్థితిని మార్చారు. కాంగ్రెస్ హైకమాండ్ సైతం రాజశేఖర్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛే నేడు జగన్ వరకూ ఆ కుటుంబానికి అంతులేని ఇమేజ్ తెచ్చిపెట్టింది.
2013లో చంద్రబాబు పాదయాత్ర చేశారు. పార్టీని పవర్ లోకి తీసుకురాగలిగారు. 2018లో జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసి కనివినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. అయితే ఇప్పటివరకూ పాదయాత్రలు చేసిన వారు ఒక ఎత్తు.. లోకేష్ ది మరో ఎత్తు. ఆ ముగ్గురు డైరెక్ట్ సీఎం క్యాండిడేట్లు. పాదయాత్రలో దారిపొడవునా గుర్తించిన సమస్యలు, ప్రజల నుంచి వినతులపై స్పందించే క్రమంలో తాము సీఎం అయిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చేవారు. ఇప్పుడు లోకేష్ కు ఆ పరిస్థితి లేదు. కేవలం తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని మాత్రమే ఆయన చెప్పగలరు. జగన్ కంటే ముందు ఉమ్మడి ఏపీలో ఆయన సోదరి షర్మిళ పాదయాత్ర చేపట్టారు. జగన్ జైలులో ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకొని పాదయాత్ర చేసినా వర్కవుట్ కాలేదు. కేవలం సోదరుడు ప్రతినిధిగా గుర్తించిన ప్రజలు పెద్దగా ఆదరించలేదు. ఇప్పుడు లోకేష్ విషయంలో అటువంటి పరిస్థితి తలెత్తుందా అన్న అనుమానం ఉంది. అందుకే టీడీపీ శ్రేణులు లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.

ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ప్రధాన ఉద్దేశ్యం జగన్ ను పవర్ నుంచి దూరం చేయడం. టీడీపీని అధికారంలో తేవడం, తన నాయకత్వాన్ని మరింత బలపరుచుకోవడం. ఇలా త్రిముఖ వ్యూహంతో లోకేష్ అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో లోకేష్ యాక్టివ్ గా పనిచేశారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీ పవర్ లోకి రావడంతో ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు ఎమ్మెల్సీ, ఆపై మంత్రి పదవి కట్టబెట్టేశారు. కానీ లోకేష్ కు అది మైనస్ అయ్యింది. విపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. లోకేష్ ను పలుచన చేయడానికి కారణమైంది. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ పోటీచేసి ఓటమి చవిచూడడంతో రాజకీయ భవిష్యత్ పై మరిన్ని అనుమానాలు పెరిగాయి. లోకేష్ లో నాయకత్వ లక్షణాలు లేవన్న విపక్షాల ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అటు సొంత పార్టీ శ్రేణుల్లో సైతం లోకేష్ పై నమ్మకం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర ద్వారా తన నాయకత్వం నిరూపించుకోవాల్సిన ప్రత్యేక పరిస్థితి అనివార్యంగా మారింది. అందుకే 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి తనకు తాను నిరూపించుకునేందుకు లోకేష్ సిద్ధపడ్డారు. టీడీపీ శ్రేణుల్లో చంద్రబాబుకు ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉందని చెప్పడానికి పాదయాత్ర దోహదపడుతుందని భావిస్తున్నారు. వైసీపీ సర్కారుపై ప్రజా వ్యతిరేకత ఉన్న తరుణంలో తన పాదయాత్ర టీడీపీని పవర్ లోకి తెస్తుందని బలంగా నమ్ముతున్నారు.