Telangana Assembly Election
Telangana Assembly Election: తెలంగాణలో ఎన్నికల హడావిడి జోరు అందుకుంది. నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించింది. బీ ఫారాలు కూడా అందించింది. కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి జాబితా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ ఈసారి బీసీ మంత్రాన్ని జపిస్తోంది. రెండో జాబితాలోనూ అదే స్థాయిలో టికెట్లు జారీ చేసే విధానాన్ని అవలంబిస్తోంది. అయితే ఒకప్పుడు తెలంగాణలో ప్రధాన పార్టీగా చలామణి అయిన తెలుగుదేశం.. ఇప్పుడు ఆ ప్రభను కోల్పోయింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడం వల్ల ఆ పార్టీకి దిశా నిర్దేశం చేసేవారు లేరు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడుని కలిసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మధ్య జ్ఞానేశ్వర్ మధ్య చర్చలు జరిగినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేవలం కొన్ని స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోతే పరిస్థితి ఏమిటనేది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. అయితే దీనిని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఖండిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 87 స్థానాల్లో పోటీ చేస్తుందని, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని టిడిపి వర్గాలు అంటున్నాయి. 119 నియోజకవర్గాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించామని వారు అంటున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు అరెస్టు అనంతరం జరుగుతున్న పరిణామాల ఆధారంగా చూస్తుంటే ఇదే నిజమని అర్థమవుతుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుక పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి తమకు నష్టం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. “ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి భారత రాష్ట్ర సమితి మద్దతు ఇస్తోంది. అందువల్ల తెలంగాణలో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఓట్లు పడే అవకాశం లేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ గనుక పోటీ చేయకపోతే ఆ ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పడతాయి” అని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
“మరోవైపు తెలంగాణలో గతంలో జరిగిన ఎన్నికలను బిజెపి నాయకులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. కూకట్ పల్లి లాంటి ఆంధ్ర సెటిలర్స్ ఉన్న నియోజకవర్గంలో నందమూరి సుహాసిని పోటీ చేస్తే భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు ఉంటుందని ఎలా అనుకుంటామని” భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా, చేయకపోయినా మాకు వచ్చే నష్టం ఏమీ లేదని వారు అంటున్నారు. నారా లోకేష్ అమిత్ షా తో ఇటీవల భేటీ అయిన సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చాయని.. అయితే తెలంగాణలో ఉన్న కీలక నాయకులకు ఎన్నికల్లో కమలనాధులకు సపోర్ట్ చేయాలి అనే సంకేతాలు వెళ్లాయని తెలుస్తోంది! మరి దీనిపై ఇంతవరకు తెలుగుదేశం పార్టీ స్పందించలేదు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Will tdp contest in telangana how much profit for congress and bjp what a loss
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com