Mudragada: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఎన్నడూ లేనిది కాపు సంక్షేమం కోసం బీజేపీ పాటుపడుతోంది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ నేతలు కాపుల సమస్యలను పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తి పరిష్కారం దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తాజాగా కాపు సమస్యలను పరిష్కరించాలని రాజ్యసభలో లేవనెత్తారు.
అనంతరం ఏపీకి వచ్చి కాపు ఉద్యమ కారుడైన ముద్రగడ తో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు భేటీ అయ్యారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడికి వచ్చిన జీవీఎల్ ఈ మేరకు ఆయనను బీజేపీలోకి ఆహ్వానించారు. కాపుల సమస్యలు పరిష్కరిస్తామని అభయమిచ్చారు.
రాజ్యసభ సభ్యులు బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావు సోమవారం కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కాపులను బీసీలలో చేర్చాలని ఇటీవల రాజ్యసభ లో సుదీర్ఘ ప్రసంగం చేసారు.
గతంలో రాజ్యసభకు గానీ.. లోక్‌సభ కు ఎంపికైన కాపు నాయకులు ఏనాడూ కాపులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏమైనా మాట్లాడితే తమ అధినాయకుడు తమ తమ తోకలను కత్తిరిస్తారని భయంతో ఉండేవారు.
కాపు సామాజిక వర్గానికి చెందన ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అధిష్టానవర్గానికి కేంద్ర ప్రభుత్వానికి కాపుల సమస్యలను వివరించడంతో తెలుగు రాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గం జివిఎల్ కు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ నేపధ్యంలో ముద్రగడ ను సోమవారం కలుసుకొన్న జివిఎల్ ఆయనను పార్టీలోకి ఆహ్వానం అందజేయడం విశేషం. మరి ముద్రగడ పద్మనాభం అడుగులు ఎటువైపు పడుతాయన్నది చూడాలి.