ఆమె రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్.. మాటల తూటాలు పేల్చగట మాటల మరాఠీ. ఆమె విమర్శలు బాణాల్లా తగులుతాయి.. రాజకీయాల్లో అసలైన నారి భేరి ఎలా ఉంటుందో ఆమె చూపిస్తుంది. అసెంబ్లీలో ప్రత్యర్థులకు చుక్కలు చూపగల నేర్పరి. ఆమె పంచ్ డైలాగులకు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూసులు వస్తాయి. అదే సమయంలో ప్రత్యర్థులు ఆమె మాటల ప్రవాహంలో కొట్టుకుపోతారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతారు.. వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రోజా రాజకీయ జీవితంలో నూతన శకం ఆరంభం కాబోతోందా? ఆమె చిరకాల వాంఛ అతి త్వరలో తీరబోతోందా? ఏపీ పాలిటిక్స్ లో రోజా పేరు మారు మోగనుందా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ పక్కా ప్లాన్ గీశారనే ప్రచారం సాగుతోంది. త్వరలో జరగబోతున్న మంత్రి వర్గవిస్తరణలో రోజాకు మంత్రి పదవి ఖాయమనే వార్తలు జోరుగా ప్రసారమవుతున్నాయి. అయితే.. అది రీప్లేస్ మెంట్ కోటాలో వస్తున్న పదవి కాదని, రోజాను కేబినెట్లోకి తీసుకోవడం వెనుక అంతకు మించిన లక్ష్యాలు వేరే ఉన్నాయన్నది అసలైన చర్చ. మరి, అదేంటీ? రోజా ఎంట్రీ ఎలాంటి రాజకీయ పరిణామాలకు నాంది కాబోతోంది? అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్ర విభజన తర్వాత హోరాహోరీగా సాగిన ఎన్నికల సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ హోరును తట్టుకొని నిలిచి, గెలిచిన వారిలో రోజా ఒకరు. ఆ తర్వాత టీడీపీ పాలన సాగిన ఐదేళ్లూ.. అధికార పార్టీ జగన్ ను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టగలదో.. అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టింది. అలాంటి కష్ట సమయంలో జగన్ వెన్నంటి ఉన్న బలమైన నేతల్లో రోజా ఒకరిగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఏ పార్టీకైనా కావాల్సింది బలమైన వాయిస్. ఆ బాధ్యతను రోజా అద్భుతంగా పోషించారనే చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఇతర అధికార పార్టీ నేతలతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించారు. అరెస్ట్ అయ్యారు. చివరకు అసెంబ్లీలోకి వెళ్లకుండా నిషేధం విధించారు. అయినప్పటికీ.. వెరవకుండా అధికార పార్టీపై పోరాటం సాగించారు.
ఆ విధంగా పడిన కష్టానికి 2019లో ప్రతిఫలం దక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించింది. నగరి నియోజకవర్గం నుంచి రోజా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో.. మంత్రివర్గంలో రోజాకు ఒక సీటు రిజర్వు చేయబడి ఉంటుందని అందరూ భావించారు. కానీ.. సీఎం జగన్ అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. సామాజిక కోణంలో రోజాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ నిర్ణయం చాలా మందికి షాక్ అనే చెప్పాలి. కష్టకాలంలో వెన్నంటి ఉన్న రోజాను కేబినెట్లోకి తీసుకోకపోవడం మేంటనే చర్చ సాగింది. అయితే.. రోజాకు ఏపీఐఐసీ నామినేటెడ్ పోస్టు ఇచ్చి కూల్ చేశారు. అయితే.. తాజాగా నిర్వహించిన నామినేటెడ్ పోస్టు భర్తీలో ఎమ్మెల్యే రోజా పదవిని వేరే వాళ్లకు ఇచ్చేయడంతో రకరకాల చర్చలు జరిగాయి.
అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం.. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక భారీ వ్యూహం ఉందని తెలుస్తోంది. త్వరలో జరగనున్న రెండో విడత మంత్రివర్గ విస్తరణలో రోజాను కేబినెట్లోకి తీసుకోవడం ఖాయమని, అందుకే.. ఏపీఐఐసీ చైర్మన్ పదవిని వేరే వాళ్లకు కేటాయించారని చెబుతున్నారు. మరి, కేబినెట్లో ఏ శాఖను కేటాయిస్తారన్నప్పుడు.. ఎవ్వరూ ఊహించని విధంగా.. హోం మంత్రి పదవి కేటాయిస్తారని ఉప్పందుతోంది.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా పెట్టిన ఇబ్బందులకు వడ్డీతో సహా చెల్లింపులు చేయడానికే రోజాకు మంత్రి పదవి ఇస్తూ ఈ స్కెచ్ గీసినట్టు కొందరు చెబుతున్నారు. జగన్ ను, వైసీపీని ఎంతగా ఇబ్బంది పెట్టారో.. ఆ బాకీలన్నీ తీర్చుకునేందుకే రోజాకు హోం మినిస్టర్ పదవి ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ పని కేవలం రోజా వల్లనే సాధ్యమవుతుందని భావించిన జగన్.. ఆమెకే ఈ బాధ్యత అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటిదాకా ఉన్న మంత్రులు అంతా కొత్తవాళ్లు కావడంతో సరిపడా రాజకీయ పరిణతి లేదు. మాటల తూటాలు పేల్చగలే వారు లేరు. ప్రతిపక్ష టీడీపీ బలంగా ఉన్న వేళ వారిని ఢీ అంటే ఢీ అనే మంత్రులు ఏపీ కేబినెట్ లో వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అందుకే జగన్ ను ఇబ్బంది పెడుతున్న ప్రత్యర్థులకు చమటలు పట్టేలా సీఎం జగన్ స్కెచ్ గీశారని.. రోజాను మంత్రి పదవిలోకి తీసుకోబోతున్నారని అంటున్నారు. ఇక ప్రతిపక్షంతో ఢీకొట్టేలా రోజాను మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. మాటకు మాట సమాధానం చెప్పడంలోనూ.. ఢీ అంటే ఢీ అంటూ ఎంతవరకైనా పోరాడడంలోనూ రోజా ముందుంటారు. అలాంటి రోజాను హోం మంత్రిగా తీసుకుంటే చంద్రబాబు, లోకేష్ తోపాటు, టీడీపీ మీడియాకు సైతం చుక్కలే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.