అధికారంలోకి వచ్చిన పార్టీలు.. తమకు అనుకూలంగా లేని మీడియా సంస్థలపై ఉద్దేశపూర్వక దాడులు చేస్తున్నాయనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. గడిచిన పదేళ్లలో ఈ పరిస్థితి మరింత ఎక్కువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ప్రముఖ మీడియా సంస్థలు దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్ ఆఫీసుల్లో ఐటీ దాడులు జరిగాయి. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు చేస్తోందని విపక్షాలు ఆరోపించాయి. కరోనా వైఫల్యంపై ఈ మీడియా సంస్థలు వరుస కథనలు ప్రసారం చేశాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ దాడులు చేశాయని విమర్శిస్తున్నాయి.
జైపూర్, అహ్మదాబాద్, నోయిడాతోపాటు దేశంలోని పలుచోట్ల దైనిక్ భాస్కర్ గ్రూపునకు చెందిన ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ మేరకు దైనిక్ భాస్కర్ గ్రూప్ అధికారికంగా నిర్ధారించింది. దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాము హెచ్చరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, దాని కారణంగానే ఈ మహావిపత్తు అని ఎంతో మంది వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తంచేశారు. మరికొందరు మీడియా ముఖంగానే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎలుగెత్తి చాటారు. న్యాయస్థానాలు సైతం ప్రభుత్వ తీరును దునుమాడాయి. సెకండ్ వేవ్ కరోనా ఉధృతంగా సాగుతున్న వేళ.. ప్రజల ప్రాణాల గురించి పట్టించుకోకుండా.. కేంద్ర కేబినెట్ మొత్తం బెంగాల్లో తిష్టవేసిందనే విమర్శలు వెలువడ్డాయి.
అంతేకాదు.. కరోనా మహమ్మారి పరిస్థితులు దారుణంగా ఉన్నవేళ.. కుంభమేళాకు అనుమతి ఇచ్చి కేసులు పెరగడానికి పరోక్షంగా కారణమైందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పనుల వల్లనే భారతదేశానికి ఆ పరిస్థితి వచ్చిందనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ విషయాలను ఉటంకిస్తూ.. దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్ మీడియా సంస్థలు వరుస కథనాలను ప్రసారం చేశాయి. ఇండియాలో కరోనా దారుణ పరిస్థితులను కళ్లకు కట్టాయి.
అయితే.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాయలేదన్న కోపంతోనే ఈ రెండు మీడియా సంస్థలపై ఐటీ దాడులు చేయించిందని విపక్షాలు ఆరోపించాయి.ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తదితర నేతలు ఐటీ దాడులను ఖండించారు. ప్రభుత్వం తనకు అనుకూలంగా లేనివారిని దాడులు చేసి నోరు మూయించాలని చూస్తోందని మండిపడ్డారు. అయితే.. అయితే.. ఇందులో సర్కారు ప్రమేయం లేదని, ఏజెన్సీలు వాటి పని అవి చేసుకుంటున్నాయని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ చెప్పారు.