
Pawan Kalyan- KCR: ప్రజా బలం లేనిదే ఏ పార్టీకి, ఏ వ్యక్తి రాజకీయాల్లో మనగలలేడు. అది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఏర్పడినప్పుడు ఏ శక్తి అడ్డుకోలేదు. ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో తేటతెల్లమైంది. ఇప్పుడు కేసీఆర్ సరసన పవన్ ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ ప్రస్తుతం అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. తనకు ఆస్తులు, పరిశ్రమలు లేవని.. తన వద్ద ఉన్నది నటనేనని చాలా సందర్భాల్లో పవన్ వెల్లడించారు. పార్టీని నడపాలంటే డబ్బు ఉండాలని.. ఆ డబ్బు సంపాదన కోసమే తాను సినీ రంగంలో కొనసాగుతున్నానని కూడా స్పష్టం చేశారు. అయితే సినిమా రంగం కంటే తనకు రాజకీయాలే ఇష్టమని.. చివరి వరకూ రాజకీయాల్లో ఉంటానని కూడా గంటాపధంగా చెబుతున్నారు. అయితే పవన్ రాజకీయంగా ఉన్నతంగా చూడాలని జన సైనికులు, అభిమానులు బలమైన ఆకాంక్షతో ఉన్నారు. అటు పవన్ ఒక చాన్సిద్దామన్న వారి సంఖ్య ఏపీలో రోజురోజుకూ పెరుగుతోంది.
1999లో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు కేసీఆర్ మంత్రి పదవి ఆశించారు. దక్కకపోయేసరికి తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ సంస్థను మాత్రమే ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అభిలాష ఉండేవారిని ఒకే వేదికపైకి తీసుకురావాలని ప్రయత్నించారు. అటు తరువాత రాజకీయ పార్టీగా ప్రకటించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారు. కానీ ప్రజల ఆదరణ అంతంతమాత్రమే. సుమారు 40 సీట్లకుగాను పరిమిత సంఖ్యలో మాత్రమే గెలుపొందగలిగారు. నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఆపరేషన్ టీఆర్ఎస్ తో కకావికలమయ్యారు. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఉన్న స్థానాలను కోల్పోయారు. 2009 ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలతో కూటమి కట్టి పోటీచేశారు. కానీ అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. అయితే వైఎస్ మరణం తరువాత ఉవ్వెత్తున ఎగసిపడిన తెలంగాణ ఉద్యమంలోకి కేసీఆర్ ను ఉద్యమకారులు, ప్రజలు బలవంతంగా తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించక తప్పలేదు. అయితే ఇక్కడ కేసీఆర్ నాయకత్వాన్ని ఆయన కంటే ప్రజలే బలపరిచారు. బలోపేతం చేశారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఆర్పీ నేర్పిన గుణపాఠంతో జనసేన అనే ఒక ఉద్యమ సంస్థను తొలుత పవన్ ఏర్పాటుచేశారు. తరువాత దానిని ఒక రాజకీయ పార్టీగా మార్చారు. ఇంతలో 2014 ఎన్నికలు రావడంతో సమయం చాలదని భావించి టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. విజయానికి కొంత కారణమయ్యారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేశారు. కానీ ప్రజామద్దతు అనుకున్నంత స్థాయిలో దక్కలేదు. దీంతో పవన్ రాజకీయాలకు దూరమవుతారని భావించారు. కానీ నిలదొక్కుకున్నారు. పార్టీని నడపగలిగారు. 2024 ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. తన కంటే జనసైనికులకు, అభిమానులకు, ఓ వర్గం ప్రజలు మాత్రం పవన్ ను సీఎం గా చూడాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారు. ఈ విషయంలో పవన్ దూకుడుగా వ్యవహరిస్తే సాధ్యమయ్యే చాన్స్ లే అధికంగా ఉన్నాయి.
అయితే ఎన్నికలకు పట్టుమని ఏడాది కూడా లేదు. ఇటువంటి సమయంలో జనసేన సంస్థాగత నిర్మాణం పై దృష్టిసారిస్తే మాత్రం మంచి ఫలితాలు వచ్చే చాన్స్ ఉందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో గ్రామస్థాయి నుంచి కమిటీలు ఏర్పాటుచేసి పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల్లో ముందుగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉంటే గెలుపు సనాయాసమని విశ్లేషకులు భావిస్తున్నాయి. అయితే దీనిపై పవన్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అటు వారాహి యాత్రకు అన్నివిధాలా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం వారాహి రోడ్డెక్కే అవకాశం ఉంది. అటు పార్టీలో చేరికలతో పాటు పొత్తుల వ్యవహారం, నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక..ఇలా వడివడిగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని జనసేనవర్గాలు చెబుతున్నాయి.