KCR PM Race: రాష్ట్రానికి సీఎం కాగలనా? అన్న అనుమానాలు కేసీఆర్ మొదట్లో బోలెడు ఉండేవి. అసలు తెలంగాణ ఏర్పడుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. కానీ మొండిగా పోరాడారు. కాలం కలిసి వచ్చి రాష్ట్రం వచ్చి సీఎం అయ్యారు. ఇప్పుడు ఏమో గుర్రం ఎగురావచ్చు. కేసీఆర్ ప్రధాని కావచ్చు. ఈ ఆశతోనే ఇప్పుడు కేసీఆర్ కొట్లాడబోతున్నట్టు తెలుస్తోంది.
అసలు తెలంగాణ వస్తుంది.. దానికి సీఎం అయ్యి చక్రం తిప్పుతానని కేసీఆర్ ఊహించలేదు. అదే జరిగి కల సాకారం అయ్యింది. ఇప్పుడు ఆ ప్రధాని ముచ్చట కూడా తీరిపోతే అంతకుమించిన ఆనందం ఆయనకు ఎక్కడ ఉంటుంది. దానికోసం కేంద్రంతో కొట్లాట మొదలుపెట్టారు కేసీఆర్.
దేశ రాజకీయాలు చూస్తే కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీని ప్రధానిగా ఎవరూ అంగీకరించడం లేదు. ఆయనలోని అపరిపక్వత రాహుల్ ను ప్రధాని పదవికి దూరం చేస్తోంది. అయినా బీజేపీని ఓడించి ఒంటరిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నెక్ట్స్ ఉన్నది థర్డ్ ఫ్రంట్ నే. అంటే ప్రాంతీయ పార్టీల నేతలే..
జాతీయ రాజకీయాలు చూస్తే అటు మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీల తరుఫున ప్రధాని పోస్టుకు ప్రధాన పోటీదారుగా ఉన్నారు. అయితే ఆమెకు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి? ఆమె దూకుడును ఎంత మంది మద్దతు తెలుపుతారు? అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను మమత ఒప్పిస్తారా? లేదా? అన్నది ఇక్కడ ప్రశ్న.
ఇక ప్రధాని రేసులో నంబర్ 2 కేజ్రీవాల్. ఇప్పటికే ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించి ఎంపీ , ఎమ్మెల్యే సీట్లు కూడా గెలిచాడు. జాతీయ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కు కూడా ప్రధాని పోస్టుకు అర్హత ఉంది. అయితే అసలైన రాజకీయ నేత కాకపోవడం కేజ్రీవాల్ కు మైనస్.
వీరిద్దరి తర్వాత ఇప్పుడిప్పుడే దూసుకొస్తున్నారు కేసీఆర్. తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాల సీఎంల మద్దతుతో బలంగా కనిపిస్తున్నారు. కేసీఆర్ కు పక్కనున్న ఏపీ, తమిళనాడు సీఎంలు జగన్, స్టాలిన్ ల మద్దతు ఉంది.మమతా బెనర్జీ కూడా పంతం వీడి మోడీని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకొని కేసీఆర్ కు కనుక మద్దతిస్తే ఈజీగా ప్రధాని కావచ్చు. కానీ అది జరగడం కష్టమే. ఎందుకంటే మమత అంత ఈజీగా ప్రధాని పదవిని త్యజించదు. అయితే ఎంపీ సీట్లనే పరిగణలోకి తీసుకుంటే మాత్రం కేసీఆర్ కు తెలంగాణ ఎంపీ సీట్లతోపాటు ఏపీ ఎంపీ సీట్లు,తమిళనాడు ఎంపీ సీట్లు మద్దతు దక్కితే ప్రధాని రేసులోకి దూసుకుపోవచ్చు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాని పదవిలో పీవీ నరసింహరావు కూర్చున్నారు. ఆయన ఏపీకి సీఎంగా చేసి దేశానికి ప్రధాని అయ్యారు. ఇక నరేంద్రమోడీ సైతం గుజరాత్ కు సీఎం అయ్యాక పరిపాలన చూసి దేశానికి ప్రధాని అయ్యారు. ఇప్పుడు వారిలాగానే కేసీఆర్ ఆశపడుతున్నాడు. ఆ ఆశ తీరడం కష్టమే..కానీ ప్రయత్నిస్తే.. దానికి కాలం కలిసి వస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కల నెరవేరుతుంది. అవన్నీ జరగాలంటే 2024 సార్వత్రిక ఎన్నికలు రావాలి.. బీజేపీ ఓడిపోవాలి.. ప్రత్యామ్మాయ పార్టీలే దిక్కు అవ్వాలి.. ఇవన్నీ జరిగితేనే కేసీఆర్ కు చాన్స్ ఉంటుంది. అప్పటివరకూ మనం ఎదురుచూడక తప్పదు.