CM KCR: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శ్వాత మిత్రులు ఉండరనేది నానుడి. ఏ పార్టీ మరో పార్టీతో ఎప్పుడు సఖ్యతగా ఉంటుందో.. ఎప్పుడు వ్యతిరేకిస్తుందో.. ఎప్పుడు పొత్తు పెట్టుకుంటుందో ప్రస్తుత రాజకీయం పరిస్థితిలో ఎవరూ చెప్పలేరు. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రాజకీయంగా, విచారణ సంస్థలతో జరుగుతున్న యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందో అని రెండు పార్టీల నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ మాత్రం.. బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని, ఆ రెండు పార్టీలు ఒక్కటే అని ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌ను బలహీనపర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ చీఫ్‌తోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలతో జరుపుకుంటున్న దాడులు చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజం కాదన్న వాదన వినిపిస్తోంది. కేసీఆర్ కేంద్రం విధానాలను, రాష్ట్రంపై చూపుతున్న వివక్షను ఎండగడుతున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని వ్యతిరేకించారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎస్.సంతోష్‌కు సిట్ ద్వారా నోటీసులు ఇప్పించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వాదన తేలిపోతోంది.
ఎన్నికల వరకూ యుద్ధమే.

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్న పోరాటం వచ్చే అసెబ్లీ ఎన్నికలతోపాటు 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల వరకూ కొనసాగే అవకాశమే ఉంది. రెండేళ్ల క్రితం పశ్చిమబెంగాల్‌లోనూ ఇదే తరహాలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆధిపత్య పోరాటం జరిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇది పతాకస్థాయికి చేరింది. ఎన్నికల ఫలితాల తర్వాత భౌతిక దాడుల వరకూ వెళ్లింది. ఫలితం ఎలా ఉందంటే తృణమూల్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక్కడ నష్టపోయింది ఎవరంటే వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీనే. ఆ రెండు పార్టీలు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి.
టీకాంగ్రెస్ భయం అదేనా?
తాజాగా తెలంగాణలోనూ బెంగాల్ తరహా రాజకీయాలే నడుస్తున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ నేతలు బెంగాల్ తరహాలోనే తెలంగాణలో కాంగ్రెస్‌ను కనుమరుగు చేయడానికే బీజేపీ, టీఆర్‌ఎస్ ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బెంగాల్‌లో తృణమూల్, బీజేపీ నేతల మధ్య జరిగిన పోరులో కాంగ్రెస్, వామపక్షాలు నష్టపోయినట్లే.. తెలంగాణలో కూడా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య జరిగే పోరాటంలో నష్టం తమకే జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా సంకేతాలు వెలువడతున్నాయి. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ భవిష్యత్‌ను చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్, బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు.

ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది?
ఇక మరో ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల వరకూ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు తప్పదు. ఎన్నికల ఫలితాల తర్వాత రెండు పార్టీల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. ఆ ఎన్నికల్లో రెండు పార్టీలు సాధించిన సీట్లు, కాంగ్రెస్ పోషించే పాత్ర ఆధారంగా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అయితే కేసీఆర్ ఇప్పుడు కేంద్రంతో చేస్తున్నట్లుగా ఎన్నికల తర్వాత కూడా పోరాటం చేస్తాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిబెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా ఇంతకంటే ఎక్కువగా బీజేపీతో ఫైట్ చేసింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీ మమతను తన దారిలోకి తెచ్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇద్దరు మంత్రలను జైలుకు పంపింది. దీంతో అప్పటి వరకు రణం చేసిన మమతాబెనర్జీ తర్వాత వెనక్కి తర్గారు. ప్రతిపక్షాల కూటమి నుంచి కూడా క్రమంగా బయటకు వస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా దర్యాప్తులు నిలిపివేసింది. దూకుడు తగ్గించింది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎవరి అవసరం ఎవరికి ఉంటుందో అన్న భావనతో రెండు పార్టీలు ఉన్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2023 అసెంబ్లీ తర్వాత కేసీఆర్ ఇత తర హాలో రణం చేస్తారా.. శరణు కోరుతారా అనేది ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.