Pawan Kalyan- Chandrababu: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో 14 నెలల వ్యవధి ఉంది. దీంతో సీఎం జగన్, అటు విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు., అటు రచ్చబండల నుంచి టీవీల్లో డిబేట్ ల వరకూ వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిది? అన్న చర్చ సాగుతోంది. ఎవరికి తోచిన విశ్లేషణలు వారు కడుతున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే కూటమికి ఫెచ్చింగ్ అని.. వేర్వేరుగా పోటీచేస్తే అధికార పక్షం వైసీపీకి అడ్వాంటేజ్ అని రకరకాల లెక్కలు కడుతున్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు జనసేన, బీజేపీలతో కలిసి నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. పవన్ చిక్కినట్టే చిక్కి తప్పించుకు తిరుగుతున్నారు. జనసేనతో టీడీపీ పొత్తు డిఫెన్స్ లో ఉంది. దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. చంద్రబాబు మొగ్గుచూపుతున్నా పవన్ మాత్రం అచీతూచీ అడుగులు వేస్తున్నారు.

పవన్ తాజాగా చేస్తున్న కామెంట్స్ మాత్రం కొత్త విశ్లేషణలకు, సమీకరణలకు తావిస్తున్నాయి. ఇప్పటివరకూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెబుతూ వచ్చిన పవన్ సడన్ గా రూటు మార్చారు. 2024తో పాటు 2029 ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రెండు ఎన్నికలు జనసేనకు, అటు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు కీలకమని పవన్ కామెంట్స్ చేశారు. దీంతో సరికొత్త విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని కూడా హెచ్చరించారు. అయితే ఇవన్నీ వ్యూహాత్మకంగా చేస్తున్నవా అన్నది తెలాల్సి ఉంది. బీజేపీ నేతల వాదన కూడా అచ్చం ఇలానే ఉంది. 2029 నాటికి జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలన్నదే బీజేపీ నేతల అభిమతంగా తెలుస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకూడదని వారు భావిస్తున్నట్టు విశ్లేషణలు వస్తున్నాయి. ప్రధాని మోదీని కలిసిన తరువాత పవన్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. 175 స్థానాల బరిలో ఉంటామని ఆ పార్టీనేతలు చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ టీడీపీ నిశితంగా పరిశీలిస్తోంది.
వచ్చే ఎన్నికలు అధికారపక్షం వైసీపీకి, విపక్షం టీడీపీకి ప్రతిష్ఠాత్మకం.. చంద్రబాబు సైతం ఈ ఎన్నికల్లో గెలిపించాలని.. ఇదే లాస్ట్ చాన్స్ అని ప్రజలను వేడుకుంటున్నారు. అందులో భాగంగానే విశాఖ పరిణామాల తరువాత పవన్ ను ఎదురెళ్లి మరీ సంఘీభావం తెలిపారు. రెండు పార్టీలు కలిసి ముందుకు సాగుతామని సూత్రప్రాయంగా తెలిపారు. దీంతో 2014 సీన్ రిపీట్ ఖాయమని.. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందన్న వార్తలు వచ్చాయి. అటు రెండు పార్టీల శ్రేణులు సైతం కలిసి పనిచేసేందుకు మానసికంగా సిద్ధమయ్యాయి. అయితే ఇటువంటి తరుణంలో పవన్ తనకు అవకాశం కావాలన్న పల్లవి అందుకున్నారు. దీంతో పవన్ ఆలోచనలో మార్పువచ్చినట్టు టీడీపీ అనుమానిస్తోంది. అయినా ఎన్నికలకు సమయం ఉండడంతో వేచిచూసే ధోరణిలో ఉంది. అయితే ఇంతలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానన్న పవన్ తాజా శపధంతో..ఇంకా పొత్తుల అంశం సజీవంగా ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

టీడీపీ, జనసేన కలిస్తే తప్పకుండా బీజేపీ ఆ కూటమిలో చేరుతుంది. అధికార వైసీపీపై కూటమిదే పైచేయి అవుతుందని విశ్లేషకులు సైతంభావిస్తున్నారు. అయితే దాని వల్ల తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని.. చంద్రబాబును అధికారంలోకి తెస్తే ఏమిటి లాభమని పవన్ మైండ్ ను బీజేపీ నేతలు వాష్ చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ అడ్డు తొలగిపోతే 2024లో అయినా.. 2029లో అయినా జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని నమ్మబలికారు. దీంతో పవన్ కూడా మెత్తబడినట్టు తెలుస్తోంది. సొంతగా ఎదిగేందుకు మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఒంటరి పోరు తప్పదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
చంద్రబాబుకు చిక్కుకుండా ఆయనతో పొత్తు లేకుండా కేవలం బీజేపీతో కలిసి సాగి 40-50 సీట్లు సంపాదించి కింగ్ మేకర్ గా మారి నాడు పరిస్థితులను బట్టి టీడీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని.. బీజేపీ ప్రోద్బలంతో ఏపీని హస్తగతం చేసుకోవాలని పవన్ స్కెచ్ గీసినట్టు సమాచారం. బీజేపీ అంటే అటు జగన్ కు, ఇటు చంద్రబాబుకు భయం. దాన్ని అడ్వంటేజ్ గా తీసుకోవాలని ఏపీని కింగ్ మేకర్ లా హస్తగతం చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.