తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హిందుత్వంపై రాజకీయం నడుస్తుందా..? అనే చర్చ సాగుతుంది. ఎందుకంటే గత దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలపడింది. దీంతో బీజేపీ హిందుత్వ వాదనతోనే రాష్ట్రంలో పట్టు సాధిస్తుందన్న వాదన వినిపిస్తోంది. దీంతో మిగతా పార్టీలు కూడా హిందుత్వ భావనలోనే వెళ్లాలని నిర్ణయియించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ సైతం హిందువులను ఆకట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత ఇటీవల కొన్ని హిందుత్వ కార్యక్రమాలు చేపట్టారు. అంతటితో ఆగకుండా పలు దేవాలయాలకు దర్శనం చేసుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైక కవిత ఇటీవల కొండగట్టు దర్శనానికి వచ్చారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడమే కాకుండా జే శ్రీరాం.. జైహనుమాన్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా రామకోటి స్థూపానికి శంకుస్థాపన చేశారు. ఈనెల 17 నుంచి జూన్ 4 వరకు హనుమాన్ పారాయణం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అయితే కేవలం భక్తి కోసమే కవిత ఇదంతా చేస్తుందా..? అని అనుకుంటున్నా అదేం కాదని అంటున్నారు ప్రతిపక్షాలు.
కేవలం భక్తి కోసమే అయితే అమె వెంట ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా పార్టీ నాయకులందరూ హాజరవుతున్నారు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కవిత కేవలం కొండగట్టును మాత్రమే కాకుండా నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం జాన్నేపల్లిలో పురాతన శివాలయం పున: ప్రారంభోత్పవానికి కవిత హాజరయ్యారు.
ఇక ఉత్తర తెలంగాణలో ఉన్న చిన్నా చితక గుళ్లన్నీంటికి కవిత వెళ్తున్నారు. మొత్తంగా కవిత హిందూ వాదంతో ప్రజల్ని ఆకట్టుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ ఇప్పటికే హిందు వ్యతిరేక పార్టీ అని కొందరు నాయకులు ప్రచారం చేస్తున్నారు. కానీ కవిత లాంటి నాయకులు మాత్రం తాము శ్రీరాముడి భక్తులమేననే కోణంలో ప్రజలకు దగ్గరవుతున్నారు. అయితే కవిత ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియక టీఆర్ఎస్ నాయకులు అయోమయానికి గురవుతున్నారు.