TDP Janasena Alliance: తెలంగాణ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మద్దతు తెలపాలని జనసేన టిడిపిని కోరుతుందా? లేకుంటే ఏపీలో పొత్తుపై ప్రభావం చూపుతామని హెచ్చరిస్తోందా? ముఖ్యంగా కూకట్ పల్లి లో కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ చేయకుంటే ఏపీలో పునరాలోచిస్తామని సంకేతాలు పంపిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఓ విన్నపం సంచలనం సృష్టిస్తోంది. అయితే అది జనసేన నాయకత్వం చేసిందా? లేకుంటే సామాజిక వర్గాల్లో చిచ్చుపెట్టేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తున్నాయా? అన్న అనుమానాలు ఉన్నాయి.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు టిడిపి మద్దతు తెలపడం అనివార్యమని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జనసేన బిజెపితో పొత్తులో ఉండడం వల్ల టిడిపి పునరాలోచనలో పడింది. పైగా బిజెపి మూడో స్థానంలో నిలిచింది. పైగా ఏపీలో చంద్రబాబుకు ఇబ్బందులు పెట్టడంలో బిజెపి అగ్రనేతల హస్తం ఉందన్న అనుమానాలతో టిడిపి శ్రేణులు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నాయి. అటు జగన్కు కేసిఆర్ సన్నిహితుడు కావడంతో బిఆర్ఎస్ ను సైతం ప్రత్యర్థిగానే చూస్తున్నాయి. ఈ పరిణామ క్రమంలో టిడిపి శ్రేణులతో పాటు కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి బాహటంగానే మద్దతు తెలుపుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిది చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గ్రేటర్ కు సంబంధించి కూకట్ పల్లిలో జనసేనకు సీటు లభించింది. అయితే అక్కడ కమ్మ సామాజిక వర్గం అధికం. అందుకే జనసేన పేరిట ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ అండగా నిలిచారు. నేరుగా జైలుకు వెళ్లి పరామర్శించారు. అనంతరం బేషరతుగా టిడిపితో పొత్తు ప్రకటించారు. కూకట్పల్లి జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ గతంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన నందమూరి సుహాసిని తరఫున పనిచేశారు. ఆమెకు మద్దతు తెలుపుతూ ప్రచారం కూడా చేశారు. అందుకే కమ్మ సామాజిక వర్గం ఈసారి జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు అండగా నిలవాలి. లేకుంటే మాత్రం ఏపీలో పొత్తులపై ఈ ప్రభావం ఉంటుంది. టిడిపి తరఫున పోటీ చేసే అభ్యర్థులకు వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గం పనిచేస్తుంది. ఈ హెచ్చరికలతో కూడిన లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ ప్రకటన వెనుక జనసేన నాయకత్వం లేదని.. కాపు సంఘము నుంచి ఈ రకమైన లేఖ వెలువడినట్లు తెలుస్తోంది. అయితే ఈ లేఖతో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన కలవరం ప్రారంభమైంది. పవన్ నిజంగా మద్దతు కోరితే.. జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో సపోర్ట్ చేసేందుకు అవకాశం ఉంది. కానీ పవన్ నోరు తెరవడం లేదు. తెలంగాణలో బిజెపితో, ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.