ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం దళితబంధు. ఇప్పుడు అదే దానికి ప్రతిబంధకంగా మారుతోంది. కేసీఆర్ కొంప ముంచేట్టు కనిపిస్తోంది. ఈనెల 16న హుజురాబాద్ లో చేపట్టబోయే బహిరంగ సభలో కేసీఆర్ పథకాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పథకం ప్రారంభించి అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు. దీంతో దళితబంధు పథకం అమలు బాధ్యతను ప్రభుత్వం చేపడుతుందని చెప్పకనే చెప్పారు.
దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారులు వివిధ మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే గ్రామాల్లో దళితులకు, అధికారులకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. పథకంలో లబ్ధిదారులుగా పార్టీ కార్యకర్తలు, భూమి ఉన్న వారిని, ఉద్యోగుల కుటుంబాలనే ఎంపిక చేయడంతో వీణవంక, కందుగుల, కోరపల్లి తదితర గ్రామాల్లో దళితులు ఆందోళనకు దిగారు.
కేసీఆర్ పథకం ప్రారంభించింది దళితుల కోసమా లేక పార్టీ కార్యకర్తల కోసమా అని తహసీల్దార్ ను దళితులు నిలదీశారు. దీంతో దళితులకు, అధికారులకు మధ్య గ్రామాల్లో గొడవలే జరుగుతున్నాయి. లబ్ధిదారులుగా భూమి లేనివారు, పేదవారు, నిరుద్యోగులను గుర్తించాల్సిన అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యంతో లబ్ధిదారుల ఎంపిక రాజకీయం అయిపోతోందని వాపోతున్నారు. ప్రభుత్వం నిజమైన వారిని గుర్తించి ఇస్తేనే బాగుంటుందని దళితులు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో దళిత బంధు పథకం అమలుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కువ గ్రామాల్లో పార్టీ నేతలే జోక్యం చేసుకుని తమ వారికే ఇప్పించాలని చూస్తుండడంతో ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓట్లు పడడం గగగనమే అని తెలుస్తోంది. ఇదే జరిగితే పార్టీ దళితబంధు పథకం పార్టీ నష్టానికే అన్నట్లుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఎవరు తోడుకున్న గోతిలో వారే పడతారని సామెతను నిజం చేస్తున్నారు.