Chandrababu: చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. ఎవరికీ అంతు పట్టవు. అంతు చిక్కవు కూడా. ముఖ్యంగా పవర్ షేరింగ్ విషయంలో అస్సలు ఇష్టపడరు. ఎన్టీఆర్ ని గద్దె దించే సమయంలో ఇది తేటతెల్లమయింది. నందమూరి కుటుంబ సభ్యులను దూరంగా ఉంచిన చరిత్ర చంద్రబాబుది. తన రాజకీయ ఉన్నతికి అడ్డంగా నిలుస్తారని అప్పట్లో వారిని దూరం పెట్టారు. రాజకీయంగా వారిని ఏ స్థాయిలో నిలబెట్టారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో జరిగేది అదే.
తనకు ప్రయోజనం ఉన్నా..ఏ అంశాన్ని చంద్రబాబు వదలరు. అది కూడా ఆయన సక్సెస్ కు ఒక కారణం. విభిన్న వైరుధ్య భావాలతో ఉన్న పార్టీలతో ఇట్టే కలిసిపోయిన చరిత్ర చంద్రబాబుది. భారతీయ జనతా పార్టీతో జతకలవగలరు. అదే సమయంలో వామపక్షాలతో జట్టు కట్టే సాహసం చంద్రబాబు సొంతం. ఏ పార్టీ తో అయితే సైద్ధాంతిక విభేదాలతో ఏర్పడిందో అదే పార్టీతో పొత్తు కుదుర్చుకునే నేర్పరి బాబు. ఆయనకు కావలసింది రాజకీయ ప్రయోజనం. దానికోసం ఎంత దాకైనా తెగించగలరు. కానీ పవర్ షేరింగ్ కు ఒప్పుకోరు.
వచ్చే ఎన్నికల్లో జనసేన ఏపీలో పవర్ షేరింగ్ ను బలంగా కోరుకుంటోంది.సీఎం పోస్ట్ ను పవన్ కోరుకుంటున్నారు. కానీ అందుకు అంగీకరించేందుకు చంద్రబాబు సుముఖంగా లేరు. ఇందుకు గత అనుభవాలే ఉదాహరణ.గతంలో వామపక్షాలు,భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న సమయంలో ఒకటి రెండు మంత్రి పదవులు తప్పించి.. ఇతర పదవులు అప్పగించిన దాఖలాలు లేవు. ఇప్పుడు పవన్ విషయంలో కూడా చంద్రబాబు స్ట్రాటజీ అదే. కానీ పవన్ మాత్రం ఊహల పల్లకిలో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.