https://oktelugu.com/

Gujarat Politics : మోడీ సొంతరాష్ట్రం గుజరాత్ లో బిజెపి ప్రభావం తగ్గనుందా?

ఇక మిగతా ఠాకూర్లు, కోలీలు ఎటువైపు ఉన్నారనేది జూన్ 4న తేలనుంది. స్థూలంగా చూస్తే 2014, 2019 నాటి పరిస్థితులయితే గుజరాత్ లో లేవు.

Written By:
  • NARESH
  • , Updated On : May 7, 2024 / 08:13 PM IST

    Modi

    Follow us on

    Gujarat Politics : పదేళ్ల క్రితం ఇదే సమయానికి “మా గుజరాతీ వాడు ప్రధానమంత్రి అవుతున్నాడు.” అలాంటి ప్రచారం ఇప్పుడు లేదు. ఐదేళ్ల క్రితం నాటి జాతీయ భావం తాలూకూ ఉద్వేగం కనిపించడం లేదు. అలాగని విపరీతమైన వ్యతిరేకత లేదు. మాకేమీ చేయలేదు.. అనే నిర్లిప్త భావనా లేదు. మంగళవారం పోలింగ్ ముగిసిన తర్వాత గుజరాత్ రాష్ట్రంలో పలువురు ఓటర్ల నుంచి వెలువడిన భావన ఇదీ. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కి గుజరాత్ రాష్ట్రంలో బలమైన క్యాడర్ ఉంది. ఏళ్లుగా అధికారంలో ఉండటంతో అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎదురన్నదే లేదు. కానీ ఈసారి ఎందుకనో సీనియర్ నాయకులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. పార్టీ జెండాలు మోసిన కార్యకర్తల్లో ఈసారి ఎందుకనో ఆ స్థాయిలో కసి చూపించలేకపోయారు. మొత్తంగా చూస్తే దేశ ప్రధానమంత్రి, హోం శాఖ మంత్రి సొంత రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీనే ప్రత్యర్థిగా నిలిచిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

    త్రిబుల్ హ్యాట్రిక్ కష్టమే..

    25 సంవత్సరాల నుంచి గుజరాత్ రాష్ట్రాన్ని బిజెపి పరిపాలిస్తోంది. గత పర్యాయం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన విధానం పట్ల ప్రజల్లో ఒకింత అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. పవర్ పాలిటిక్స్ చేయడం, ప్రత్యర్థి పార్టీ నాయకులను కొనుగోలు చేయడం వంటి పరిణామాలు ప్రజల్లో హేయమైన భావాన్ని కలిగించినట్టు తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్ర ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏకపక్షంగా విజయాలను కట్టబెట్టారు. అక్కడ 26 పార్లమెంటు స్థానాలు ఉంటే.. అన్నింటిలోనూ బిజెపి అభ్యర్థులను గెలిపించారు. గత రెండు పర్యాయాలు 26 స్థానాలకు 26 గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ.. ఈసారి ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ద్వారా త్రిబుల్ హ్యాట్రిక్ సాధించాలని భావించింది. అయితే మంగళవారం జరిగిన పోలింగ్ ప్రకారం చూసుకుంటే అది కష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

    కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలతో..

    సూరత్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. స్వతంత్ర అభ్యర్థులు తప్పుకున్నారు. దీంతో ఈ స్థానం ఎన్నికలు జరగకుండానే బిజెపి ఖాతాలో చేరిపోయింది. ఇక మిగతా 26 సీట్లకు మంగళవారం ఒకేసారి పోలింగ్ జరిగింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 24 స్థానాలలో, ఆప్ రెండు స్థానాలలో పోటీ చేశాయి. ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన ప్రధాన నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా.. అభ్యర్థులందరికీ ఐదు లక్షల మెజారిటీ రావాలని టార్గెట్ విధించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో అమిత్ షా గాంధీనగర్ పార్లమెంటు స్థానం నుంచి 5.57 లక్షల ఓట్లతో నెగ్గారు. ఈసారి ఆయన తన మెజారిటీని పది లక్షలకు పెంచుకున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా అంత మెజారిటీ సాధ్యం కాదని సాక్షాత్తు బిజెపి నాయకులే అంటున్నారు. ఇక కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాలా, మన్ సుఖ్ మాండవియా ఆమ్రేలి, భావ్ నగర్ స్థానాల నుంచి పోటీ చేయడం ఇక్కడి కార్యకర్తలకు నచ్చలేదు. అదే విషయాన్ని బిజెపి ప్రజల దృష్టికి తీసుకెళ్తే వారు సున్నితంగా తోసిపిచ్చారు. ఇటీవల క్షత్రియులపై పురుషోత్తం రూపాల చేసిన వ్యాఖ్యలు భారీ ఎత్తున దుమారం లేపాయి. చివరికి ఆయన క్షమాపణ చెప్పినా వారు ఊరుకోలేదు. 6.5 కోట్ల జనాభా ఉన్న గుజరాత్ లో 12 శాతం ఉన్న పాటి దార్ లు ఈసారి బిజెపికి జై కొట్టారనే వార్తలు వస్తున్నాయి. ఇక మిగతా ఠాకూర్లు, కోలీలు ఎటువైపు ఉన్నారనేది జూన్ 4న తేలనుంది. స్థూలంగా చూస్తే 2014, 2019 నాటి పరిస్థితులయితే గుజరాత్ లో లేవు.