BJP – Pawan Kalyan : రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాల కూటమికి సంబంధించి అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. టిడిపి- జనసేన కూటమిగా వచ్చే ఎన్నికలకు వెళ్తాయి అనుకుంటున్నా తరుణంలో.. పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా చేపట్టిన ఢిల్లీ పర్యటన మరిన్ని రాజకీయ సమీకరణాలకు కారణమవుతోందా అన్న చర్చకు దారితీసింది. ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్ర నాయకులను కలిసిన పవన్ కళ్యాణ్ కొన్ని ప్రతిపాదనలను వారి వద్ద పెట్టినట్లు తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ తో కలిసి బిజెపి వెళ్లేందుకు సిద్ధమవుతుందా..? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో మాత్రం రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో తెలుగుదేశం పార్టీ ఉత్సాహంగా ముందుకు సాగుతుంటే.. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనతో వైసీపీని అధికారంలోకి దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.. ప్రతిపక్షాల ఎత్తులను గమనిస్తూ అధికార పార్టీ వైసిపి అడుగులు ముందుకు వేస్తుంది. రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో వైసిపి వ్యూహ, ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండగా.. అధికార పార్టీకి ధీటుగానే తెలుగుదేశం పార్టీ, జనసేన సిద్ధమవుతున్నాయి.
మూడు పార్టీలతో కలిపి కూటమి ఏర్పాటు దిశగా పవన్..
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు నడుపుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం కాగా.. తమతోపాటు బిజెపినీ కూటమిలో భాగస్వామిగా చేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి బిజెపి ముఖ్య నాయకులను కలిశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ఉమ్మడిగా పోటీ చేయాల్సిన ఆవశ్యకతను బిజెపి ముఖ్య నాయకులకు పవన్ కళ్యాణ్ వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేస్తుందని, ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతోందని, ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేస్తుందంటూ బిజెపి ముఖ్య నాయకులకు పవన్ కళ్యాణ్ వివరించారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి టిడిపి, జనసేనతో కలిసి బిజెపి రావాలని ఈ సందర్భంగా ఆయన కోరినట్లు తెలిసింది.
బిజెపి కలిసి వచ్చేందుకు సిద్ధపడేనా..?
జనసేనతో కలిసి ప్రయాణం సాగించేందుకు బిజెపి నాయకులకు అభ్యంతరం లేదు. అయితే ఈ కూటమిలో టిడిపి ఉండడాన్ని బిజెపి నాయకులు అంగీకరించడం లేదు. జగన్ గద్దె దించాలంటే ముందుకు వస్తామని చెబుతున్న బిజేపి.. టిడిపితో మాత్రం కలిసి రావాలన్న ఆలోచనను బిజెపి నాయకులు చేయలేకపోతున్నారని జనసేన పార్టీకి చెందిన ముఖ్య నాయకులు చెబుతున్నారు. జనసేన, బిజెపి కలిసి వెళ్తే సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను పెట్టేందుకు బిజెపి వెనకాడడం లేదు. కానీ టిడిపిని ఇందులో కలిపి చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్లడానికి మాత్రం బిజెపి నేతలు సుముఖత వ్యక్తం చేయడం లేదన్నది జనసేన నాయకుల నుంచి వినిపిస్తున్న మాట.
కూటమికి లీడర్ గా ఉండాలని పవన్ కళ్యాణ్ భావన..
రాష్ట్రంలో ఏర్పాటు చేసే టిడిపి – జనసేన – బిజెపి కూటమికి నాయకత్వం వహించాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే పవన్ నాయకత్వాన్ని ఇటు బిజెపి గాని, అటు తెలుగుదేశం కానీ అంగీకరించే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదన్నది విశ్లేషకులు మాట. జనసేన – బీజేపీ కలిసి పోటీ చేస్తే అత్యధిక సీట్లు ఇవ్వడంతో పాటు సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని ప్రకటించడానికి సిద్ధపడుతున్న బిజెపి.. కూటమి ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను పవన్ కళ్యాణ్ కి ఇచ్చేందుకు మాత్రం అంగీకరించడం లేదన్నది విశ్లేషకుల చెబుతున్న మాట. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న టిడిపి కూడా కూటమి బాధ్యతలను పవన్ కు అప్పగించేందుకు అంగీకరించదన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అవసరమైన సహకారాన్ని మాత్రమే టిడిపి జనసేన నుంచి కోరుకుంటుంది. అంతకుమించి ఏ సాయాన్ని, త్యాగాలను చేసేందుకు టిడిపి సిద్ధం కాబోతున్నది ఆ పార్టీ నాయకుల నుంచి వినిపిస్తున్న మాట.
Web Title: Will bjp continue with pawan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com