బీజేపీ x విపక్షాలు.. ఎవరి బలమెంత?

అసెంబ్లీ ఎన్నికలంటే ఏ రాష్ట్రంలోనైనా అక్కడి స్థానిక అంశాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఫైనల్‌గా గత ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో బేస్‌ చేసుకొని ప్రజలు ఓట్లు రాలుస్తుంటారు. ఆ తదుపరి వారు తీర్పును అనుసరించి గతంలో ఉన్న ప్రభుత్వమా..? లేక కొత్త ప్రభుత్వమా..? కొలువుదీరుతుంటుంది. కానీ.. మంగళవారంతో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో మాత్రం విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయస్థాయిలో రాజకీయంగా చోటుచేసుకుంటున్న సంస్థాగత మార్పుల నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలివి అని చెప్పొచ్చు. ఉనికిని ఎలా చాటుకోవాలో […]

Written By: Srinivas, Updated On : April 7, 2021 11:26 am
Follow us on


అసెంబ్లీ ఎన్నికలంటే ఏ రాష్ట్రంలోనైనా అక్కడి స్థానిక అంశాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఫైనల్‌గా గత ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో బేస్‌ చేసుకొని ప్రజలు ఓట్లు రాలుస్తుంటారు. ఆ తదుపరి వారు తీర్పును అనుసరించి గతంలో ఉన్న ప్రభుత్వమా..? లేక కొత్త ప్రభుత్వమా..? కొలువుదీరుతుంటుంది. కానీ.. మంగళవారంతో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో మాత్రం విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయస్థాయిలో రాజకీయంగా చోటుచేసుకుంటున్న సంస్థాగత మార్పుల నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలివి అని చెప్పొచ్చు. ఉనికిని ఎలా చాటుకోవాలో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్‌.. తమ ప్రాభవం నానాటికీ తగ్గుతున్న బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు.. మరోవైపు రోజురోజుకూ తన బలాన్ని, బలగాన్ని విస్తరించుకుంట పోతున్న బీజేపీ.

కేంద్రంలోని బీజేపీ ఇప్పటికే కొత్త కొత్త సంస్కరణలతో దూసుకెళ్తోంది. అవి ప్రజలకు ఉపయోగపడేవా..? నష్టపరిచేవా..? అనేది ఆలోచించకుండానే ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే.. నిన్నటి ఎన్నికల్లోనూ ఒకవేళ బీజేపీ అస్సాంలో తన అధికారాన్ని నిలబెట్టుకొని.. బెంగాల్‌లో గెలిచి.. తమిళనాట అన్నాడీఎంకే కూటమి తిరిగి గద్దెనెక్కితే.. మోడీ సర్కార్‌‌ కేంద్రంలో మరిన్ని సంస్కరణలు తెచ్చే అవకాశాలు లేకపోలేదు. తొలుత ఆర్థిక సంస్కరణలు, ఆ తర్వాత వ్యవసాయ, బ్యాంకింగ్‌ సంస్కరణలు, ఓబీసీల వర్గీకరణ.. మోడీ ప్రభుత్వం ముందున్న అజెండాలు ఇవి. లోక్‌సభలో తిరుగులేని మద్దతుతో కొనసాగుతున్న మోడీ ప్రభుత్వానికి రాజ్యసభలోనూ దారి సులువు కానుంది. ఒకవేళ బెంగాల్‌లో తృణమూల్‌ మళ్లీ నెగ్గి.. తమిళనాట డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే.. అస్సాంలో కాంగ్రెస్‌ గద్దెనెక్కితే మాత్రం అప్పుడు బీజేపీ వ్యతిరేక శక్తుల గళం తప్పకుండా పెరుగుతుంది.

ప్రధానంగా బెంగాల్‌లో మమత బెనర్జీ కనుక మళ్లీ అధికారంలోకి వస్తే.. ఆమె కేంద్రంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. ఇందుకు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల మద్దతు సైతం కూడగట్టి పోరాటం ఉధృతం చేయనున్నారు. తదుపరి కేంద్రాన్ని నిలదీసేందుకే రెడీ అయిపోతున్నారు. అయితే.. ఈ ఫలితాలు.. అంతర్గతంగానే కాకుండా పొరుగు దేశాలతో ముఖ్యంగా బంగ్లాదేశ్‌, శ్రీలంకలతో సంబంధాల్లో నిర్ణయాపైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ) అమలులో బంగ్లాదేశ్‌, శ్రీలంకలపై ఎలాంటి ప్రభావం చూపుతందనేది చూడాలి.

అస్సాంలో సీఏఏ అమలుపై మౌనంగా ఉంటున్న బీజేపీ.. బెంగాల్‌లో మాత్రం సీఏఏ అమలు చేస్తామంటోంది. అదేవిధంగా శ్రీలంకలో తమిళుల హక్కులపై మోడీ ప్రభుత్వం మౌనంగా ఉంటోంది. ఇటీవలే ఐక్య రాజ్య సమితిలో లో మానవహక్కుల అంశంలో శ్రీలంక తీరుపై ఓటింగ్‌ జరగ్గా భారత్‌ గైర్హాజర్‌‌ అయింది. మొత్తానికి ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ బలపడడమా..? లేక బీజేపీయేతల గళం మరింత పటిష్టం కావడమా..? చూడబోతున్నాం.