రాజధానిని తరలించకుండా అడ్డుకునేందుకు ఇప్పుడు రాజధాని రైతులకు ఉన్న ఏకైక మార్గం న్యాయస్థానాలను ఆశ్రయించడమే. దీంతో అమరావతి ప్రాంత రైతులు రాజధాని తరలింపుపై మరోమారు హై కోర్టును ఆశ్రయించారు. మూడు రాజధానుల గెజిట్ ను నిలిపివేయాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గతంలోనే రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సమితి ఆధ్వర్యంలో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై న్యాయస్థానంలో విచారణ కోనసాగుతుంది. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలుతో రాజధాని తరలింపునకు ప్రభుత్వం చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ చే ఆమోదింప చేసుకుని చట్టరూపంలోకి తీసుకువచ్చింది. గవర్నర్ ఆమోదం లభించడంతో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ గెజిట్ నిలిపివేయడంతోపాటు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డఏ రద్దు ఉత్తర్వులను ఈ పిటీషన్ లో రైతులు సవాల్ చేశారు.
Also Read: అమరావతికి కొత్త శోభ.. జగన్ ప్లానింగ్ ఇదేనా?
రాజధాని విషయంలో ప్రభుత్వం నియమించిన జి.ఎన్ రావు కమిటీ, హై పవర్ కమిటీలు చట్ట విరుద్ధమని ప్రకటించాలని సమితి పిటీషన్ లో కోరింది. పాలనా వికేంద్రీకరణ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం రాజ్ భవన్, సిఎంఓ, సచివాలయాలను అమరావతి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నందున వీటిని తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో కోరారు. ఈ పిటీషన్ ను హై కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించనుంది. గతంలో విచారణలో ఉన్న పిటీషన్ లను కలిపి విచారించే అవకాశం కూడా లేకపోలేదు.
Also Read: బాబు మార్క్ రాజకీయాలు షూరూ?
గతంలో రాజధాని రైతు పరిరక్షణ సమితి ఈ ఏడాది మార్చిలో దాఖలు చేసిన పిటీషన్ లో కరోనా నేపథ్యంలో ప్రభుత్వం రాజధానిని తరలించేందుకు ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై విచారించిన హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏ ప్రతిపధికన రాజధానిని తరలిస్తున్నారని చెప్పాలంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ప్రభుత్వం తీసుకవచ్చిందని శాసన మండలిలో బిల్లులు ఆమోదం పొందలేదని, ఆమోదం లభించే వరకూ అమరావతిని తరలించమని న్యాయస్థానానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు బిల్లులకు ఆమోదం లభించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో హై కోర్టు కేసు విచారణలో భాగంగా ప్రభుత్వానికి ఏం ఆదేశాలు జారీ చేస్తుందనేది శర్చనీయాంశమైంది. మరోవైపు రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా అడ్డుకోవాలని రాజధాని పరిరక్షణ సమితి కల నెలరవేరుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.