Jagan Chiranjeevi: ఏదో మతలబు ఉంది. సినీ ఇండస్ట్రీపై కత్తిగట్టి కయ్యానికి కాలుదువ్విన ఏపీ సీఎం జగన్ సడెన్ గా మారిపోయి టాలీవుడ్ పెద్దదిక్కు చిరంజీవిని లంచ్ భేటికి ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. గురువారం మధ్యాహ్నం తాడేపల్లిలోని ఏపీ సీఎం నివాసంలో జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి సమావేశం అస్సలు ఎవరూ ముందుగా ఊహించలేదు. ఈ భేటి టాలీవుడ్, తెలుగు రాష్ట్రాల్లో అందరినీ ఆశ్చర్యపరిచింది.
chiranjeevi
సినిమా టికెట్ ధర వివాదం.. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఇతర సమస్యలపై జగన్ ప్రభుత్వంతో వివాదాన్ని పరిష్కరించడంలో చొరవ తీసుకోవాలని తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలు చిరంజీవిని అభ్యర్థించినట్టు రెండు వారాల క్రితం వార్తలు వచ్చాయి.
ఇక ఇదే విషయంలోపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో చిరంజీవి మాట్లాడారని.. అయితే ఆ తర్వాత ఎలాంటి ముందడుగు పడలేదని సమాచారం.
ఇంతలోనే మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. సినీ పరిశ్రమకు పెద్దదిక్కు పాత్రను తాను పోషించలేనని.. ఆ హోదాపై తనకు ఆసక్తి లేదని ప్రకటించారు.
ఈ లోగా హైకోర్టు ఆదేశాల మేరకు సినిమా టికెట్ ధరల నిర్ణయంపై చర్చించేందుకు జగన్ ప్రభుత్వం అధికారిక కమిటీని నియమించింది.
ఈ కమిటీ ప్రస్తుతం సినిమా టికెట్ ధరలపై చర్చలు జరుపుతోంది. పలువురు స్టేక్ హోల్డర్స్ తోనూ ఇటీవల భేటి అయ్యి చర్చించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ కు.. వైసీపీ ప్రభుత్వానికి, పార్టీ నేతలకు మధ్య మాటల యుద్ధం ముదిరింది. దీంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది.
సమస్య పతాక స్థాయికి చేరిన వేళ గురువారం జగన్ పిలుపు మేరకు చిరంజీవి వచ్చి చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. సినీ, రాజకీయ వర్గాలను షాక్ కు గురిచేసింది.
జగన్ తో చిరంజీవి భేటి నిన్న షెడ్యూల్ ఖరారు కాలేదని.. జగన్ ఈ సమస్యను పరిష్కరించాలనే ఇలా చేశారని సమాచారం. అయితే ఇది చాలా గోప్యం ఉంచారు. చిరంజీవి సన్నిహితులైన నిర్మాత నిరంజన్ రెడ్డి వంటి కొందరికి తప్ప టాలీవుడ్ లోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులకు కూడా చిరంజీవి-జగన్ మధ్య అలాంటి సమావేశం గురించి తెలియదు. ఈ సమావేశం గురించి చాలా క్రితమే నిర్ణయించినప్పటికీ 11 గంటలకు మాత్రమే సీఎం షెడ్యూల్ లో చేర్చారని ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారులకు కూడా ఈ సమావేశం గురించి తెలియదని టాక్. చిరంజీవి-జగన్ ఇద్దరూ దీన్ని రహస్యంగా ఉంచి రచ్చ జరగకుండా చూశారు.
ఇక జగన్ కు బంధువు అయినా కూడా మోహన్ బాబు లాంటి వారితో జగన్ భేటి కాకపోవడం గమనార్హం. దీన్ని ఇండస్ట్రీలో చిరంజీవికి జగన్ సహా అందరూ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక మోహన్ బాబుకు సూతారం చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా ఉండడానికి అంగీకరించడం లేదు. ఇటీవల లేఖలోనూ కొందరు హీరోలు, దర్శకులు, నిర్మాతల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంతో లాబీయింగ్ కు పాల్పడ్డారని బహిరంగ లేఖలో విమర్శించారు.
జగన్ కుటుంబానికి మోహన్ బాబు అత్యంత సన్నిహితుడు కావడంతోనే చిరంజీవి ముఖ్యమంత్రిని కలిసే అవకాశాలు చేర్చుకునే అవకాశం ఉంది. అందుకే చివరి క్షణం వరకూ గోప్యంగా ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇక సీఎం జగన్ తో భేటి ముగిశాక చిరంజీవి స్వాగతించారు. తనను బాగా ఆదరించారని.. ఇండస్ట్రీలోని రెండు వైపులా సమస్యలను తాను జగన్ కు వివరించానని.. సాదక బాధకాలు విని జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కమిటీ నిర్ణయం వచ్చాక ఇండస్ట్రీ సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అలా మొదటి నుంచి జగన్ ఈ సమస్య పెద్దది కాకుండా చాకచక్యంగా వ్యవహరించారు. పెద్దది కావడంతోనే రంగంలోకి చిరంజీవిని పిలిపించి పరిష్కారం దిశగా ఆలోచించారు. టాలీవుడ్ తో పెట్టుకొని అభాసుపాలు కావద్దనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.