Central/State Governments: కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత అభివృద్ధికి ఊతమిస్తుంది. సమాఖ్య స్ఫూర్తితో సాగే పాలన అటు కేంద్రానికి.. ఇటు రాష్ట్రానికి.. ప్రజలకు లబ్ధి చేకూరుస్తుంది. సంక్షేమ పథకాలు పటిష్టంగా అమలవుతాయి.. రాజ్యాంగం కూడా సమాఖ్య స్ఫూర్తితోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని సూచించింది. అయితే కొన్నేళ్లుగా దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు.. కేంద్రాలలో ఎవరు అధికారంలో ఉన్నా.. తమకు అనుకూలంగా లేకుంటే.. తమపై పెత్తనం చెలాయిస్తోందని.. వివక్ష చూపుతోందని.. అధికారాల్లో జోక్యం చేసుకుంటోందని గగ్గోలు పెడుతున్నాయి. రాష్ట్రాల్లో అధికారంలో ఉండి.. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నాయి. గతంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు ఆందోళనలు చేశారు. తాజాగా వారి బాటలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్రంతో కొట్లాట షురూ చేశారు.
-దక్షిణాదిలో నిరసన స్వరాలు..
దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వ సంబంధాలు సరిగా లేవు. దీనికి ప్రధాన కారణం దక్షిణాది రాష్ట్రాల్లో చాలావరకు ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. దక్షిణాదిలో పట్టు కోసం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు ఆమోదించడం లేదు. దశాబ్దకాలంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకే పట్టం కడుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం జాతీయ పార్టీలవైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రతీ అంశాన్ని కేంద్రంపైకి నెడుతున్న రాష్ట్రాలు.. తమ రాజకీయ అస్తిత్వం కోసం కేంద్రంతో కొట్లాటకూ వెనుకాడడం లేదు.
Also Read: Minister Ambati Rambabu: వైరల్ : మంత్రి అంబటి రాంబాబు ఫొటోలు లీక్
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను మోదీ సర్కారు నెరవేర్చడం లేదని, నాలుగేళ్లు ఎదురుచూసినా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆరోపిస్తూ.. ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకుంటున్నట్టు తెలుగుదేశం ప్రకటించింది. 2019లో ఢిల్లీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష కూడా చేపట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. బీజేపీ తరఫున పోటీ చేసిన ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దళితుల ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థికి పడేలా దళితబంధు పథకం ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల నుంచి వందల మంది నాయకులు, కార్యకర్తలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అయినా హుజూరాబాద్ ప్రజలు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు గట్టిషాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి ఈటల రాజేందర్ నే గెలిపించారు.
-బీజేపీ ఎక్కడుందన్న సీఎం.. బీజేపీ పేరు ఎత్తకుండా ఉండలేని స్థాయికి..
మూడేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఓ ప్రెస్‌మీట్‌లో తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఉన్నంత వరకు రాష్ట్రంలో ఇంకో పార్టీకి అవకాశమే ఉండదని మాట్లాడారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు… ప్రగతి భవన్, ఫాం హౌస్‌లకే పరిమితమయ్యే కేసీఆర్‌ను రోడ్లమీదికి వచ్చేలా చేశాయి. ప్రజా సమస్యలు పట్టించుకునేలా చేశాయి. మరోవైపు బీజేపీ ఎక్కడ ఉంది అని ప్రశ్నించిన కేసీఆర్ ఇప్పుడు ఏ ప్రెస్‌మీట్ పెట్టినా.. బీజేపీ ప్రస్తావన లేకుండా మాట్లాడలేని స్థితికి తీసుకొచ్చాయి. దీంతో ఏడాది క్రితం వరకు కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఎందాకైనా పోతా.. కేసీఆర్ భయపడుతడా.. మీ ఆశీర్వాదం కావాలి అంటూ ప్రజలను అభ్యర్థించే స్థాయికి దిగజారారు.
-వడ్ల కొనుగోలు పేరుతో లొల్లి..
ఏడాది క్రితం వరకు కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తూ వస్తున్న కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకిస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను స్వాగతించిన కేసీఆర్ కేంద్రంతో చెడిన తర్వాత అవే చట్టాలపై ఆందోళన చేశారు. గత వానాకాలం నుంచి వడ్ల పంచాయతీ ముందట వేసుకున్నారు. తెలంగాణలో ధాన్యం ఎక్కువ పండుతోందని, ప్రతీ గింజ కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఏనాడూ ధాన్యం కేంద్రం కొంటుందన్న విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. తానే ప్రతీ గింజా కొంటున్నట్లు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు. గత యాసంగి సమయంలోనే ఇకపై బాయిల్డ్ రైస్ రాష్ట్రం నుంచి ఇవ్వమని ఎఫ్‌సీఐకి లేఖ ఇచ్చి వచ్చిన కేసీఆర్.. ఆ మాటను తుంగలో తొక్కి ఈ యాసంగిలో వడ్లు కొనాలని ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ధర్నా కూడా చేశారు.
కేసీఆర్ యే కాదు దక్షిణాది రాష్ట్రాల వారు కేంద్రంతో సఖ్యతగా లేరు. వాళ్లు కూడా విభిన్న అంశాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కొట్లాటకు దిగుతున్నారు.
– కేరళ సీఎం పినరయి విజయన్ కేరళకు ఎయిమ్స్ మంజూరు చేయాలని అడిగితే నిరాకరించారని కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు.. తమ రాష్ట్రంలో 1960 నుంచి పౌరసరఫరాల విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని.. కానీ, ఆహార భద్రత చట్టంతో మాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రాన్ని కడిగేస్తున్నారు.. ఆహార ధాన్యాల కోటాను పెంచాలని కోరుతున్నారు. ఈమేరకు రాష్ట్రంలో ఆందోళనలు కూడా చేశారు.
– తమిళనాడుకు తొలిసారిగా సీఎం అయిన స్టాలిన్ బీజేపీకి దూరంగా ఉంటున్నప్పటికీ కేంద్రంతో ఇప్పటి వరకు ఎలాంటి గొడవకు దిగలేదు.
– మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రెండేళ్లుగా బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల వరకు సఖ్యతగా ఉన్న బీజేపీ-శివసేన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్యంగా విడిపోయాయి. శివసేన ఎన్‌సీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇటీవల కేంద్రంలోని బీజేపీ శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ పై ఈడీ దాడులు చేసి ఆస్తులు జప్తు చేసి షాక్ కు కూడా ఇచ్చింది.
– ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి అంశాల వారీగా మద్దతు ఇస్తూ వస్తున్నారు.
– పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాదాపు మూడేళ్లుగా మోదీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలయితే చిన్నపాటి యుద్ధాన్నే తలపించాయి. విజయం కోసం మమతాబెనర్జీ, బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. చివరికి మమతనే మళ్లీ విజయం వరించింది. దీంతో కేంద్రంతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి దూరం మరింత పెరిగింది.
ఇలా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నేతలే కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ప్రజల్లో తమ పలుకుబడిని పెంచుకుంటున్నారు. అస్తిత్వం కోసం కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించడం లేదని కార్నర్ చేస్తున్నారు.