https://oktelugu.com/

హైకోర్టు మాట కేసీఆర్ ఎందుకు వినడం లేదు?

చిత్తం శివుడి మీద.. భక్తి చెప్పుల మీద ఉండడం అంటే ఇదేనేమో.. పైకి ఎంతో భక్తి ప్రవత్తులతో మెయింటేన్ చేస్తుంటాడు సీఎం కేసీఆర్. హైకోర్టు ఆదేశాలను తూ.చా. తప్పకుండా పాటిస్తాం అంటాడు. కానీ అదే హైకోర్టు ఆదేశించినా పెడచెవిన పెడుతుంటాడని రాజకీయ వర్గాల్లో విమర్శలున్నాయి. కరోనా ఉదంతంలో కేసీఆర్ నిర్లక్ష్యంపై ఎన్ని సార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించినా ఆ నోట వింటూ ఈ నోటూ వదిలేస్తూ కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 19, 2020 / 07:17 PM IST
    Follow us on


    చిత్తం శివుడి మీద.. భక్తి చెప్పుల మీద ఉండడం అంటే ఇదేనేమో.. పైకి ఎంతో భక్తి ప్రవత్తులతో మెయింటేన్ చేస్తుంటాడు సీఎం కేసీఆర్. హైకోర్టు ఆదేశాలను తూ.చా. తప్పకుండా పాటిస్తాం అంటాడు. కానీ అదే హైకోర్టు ఆదేశించినా పెడచెవిన పెడుతుంటాడని రాజకీయ వర్గాల్లో విమర్శలున్నాయి. కరోనా ఉదంతంలో కేసీఆర్ నిర్లక్ష్యంపై ఎన్ని సార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించినా ఆ నోట వింటూ ఈ నోటూ వదిలేస్తూ కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

    కరోనాను ఖతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం కదిలినప్పుడు అందరూ ఆహోఓహో అంటూ జబ్బలు చరుచుకున్నారు. మొదట్లో హడావుడి చేసిన కేసీఆర్.. రోజు విడిచి రోజూ.. రెండు రోజులకు ఒకసారి కరోనాపై ప్రెస్ మీట్లు పెడుతుంటే జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. కేసీఆర్ కరోనా జాగ్రత్తల గురించి చెబుతుంటే నిక్కబొడుచుకొని వినేవారు. చికెన్ తో కరోనా సోకదని.. అతి తింటేనే తగ్గుతుందని కేసీఆర్ చెబితే అందరూ చికెన్ కోసం ఎగబడ్డ తీరు చూశాం.. రేపటికి, ఎల్లుండికి .. ఫలానా డేట్ కు తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రం అవుతుందని కేసీఆర్ ఊహలు చెబుతుంటే వినసొంపుగా విన్నాం.. కానీ ఏమైందీ.. ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీటే బంద్ అయిపోయింది. తెలంగాణలో కరోనా కంట్రోల్ తప్పింది.. విచ్చలవిడిగా సోకుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా పాకింది. దీంతో కేసీఆర్ సర్కార్ కరోనాను కంట్రోల్ చేయడం మానేసిందని.. చేతులెత్తేసిందన్న ప్రచారం ఎక్కువైంది.

    ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా ఇదే మాట అంది. తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ సర్కార్ నిస్సహాయత, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి. తాజాగా హైకోర్టు ‘కరోనాను ఎదుర్కొనే సన్నద్ధత తెలంగాణ ప్రభుత్వంలో కనిపించట్లేదని.. వైరస్ నియంత్రణపై సర్కార్ కు ఆసక్తి ఉత్సాహం పోయిందని’ ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ధోరణి చూస్తుంటే ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలన్నట్టు కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు హైకోర్టు చేసింది. పరీక్షలు తక్కువ చేస్తే తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. తమ ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదని.. గాంధీలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం పరిస్థితికి అద్దం పడుతోందని హైకోర్టు టీ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

    భారతదేశవ్యాప్తంగా కరోనా టెస్టులు విపరీతంగా చేస్తున్నారు. పక్కనున్న ఏపీలోనూ రోజుకు 10వేల చొప్పున టెస్టులు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం లక్షణాలు బయటపడ్డ వారికి మాత్రమే టెస్టులు చేసి వారికి కరోనా చికిత్సలు అందిస్తోంది. దీనివల్ల తమలో కరోనా ఉందో లేదో తెలియక వారు బయట తిరుగుతూ అందిరీకీ అంటించేస్తున్నారు. దీనిపై హైకోర్టు తెలంగాణలో విస్తృతంగా పరీక్షలు చేయాలని సూచించినా పట్టించుకోవడం లేదు. హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ కు సంబంధించిన కీలక సమాచారం మీడియా బులిటెన్ లో ఉండాలని స్పష్టం చేసింది.బులెటిన్ లో ఖచ్చితంగా వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నందున వార్డుల వారీగా కేసుల వివరాలు ప్రకటించాలని.. తద్వారా ప్రజలు అప్రమత్తమవుతారని ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణకు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ , గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ హాజరయ్యారు. డాక్టర్లకు, పోలీసులకు పీపీఈ కిట్లు, మాస్కులు, రక్షణ పరికరాలు ఇవ్వాలని ఆదేశించింది. వార్డుల వారీగా కేసులు వెల్లడించి ఆయా కాలనీ సంఘాలకు ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నిర్వహించాలంటూ హైకోర్టు సూచించింది. ఈనెల 29లోగా దీనిపై నివేదిక సమర్పించాలని సూచించింది. ఇన్ని ఆదేశాలు ఇచ్చినా కేసీఆర్ సర్కారులో ఇప్పటికీ ఉలుకు లేదు.. పలుకు లేదు అన్నట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    ఈ ఒక్క ఉదాహరణే కాదు.. తెలంగాణలో వివిధ పథకాలు, వ్యవస్థాగత లోపాలపై హైకోర్టు ఎన్నో సార్లు కీలక సూచనలు చేసినా కేసీఆర్ సర్కార్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ సమయంలోనూ కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. అయినా కూడా మొండి పట్టుదలతో కేసీఆర్ సర్కార్ వాటి విషయంలో ముందుకు వెళుతూనే ఉంది.

    ఇక ఆర్టీసీ ప్రైవేటీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అప్పట్లో షాకిచ్చింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించేందుకు అవకాశం లేకుండా చేసింది. కానీ కేసీఆర్ సర్కారు ఆర్టీసీ లో కీలక సంస్కరణలు చేసి పని కానిచ్చేసింది. ఇక ముగ్గురు ఎమ్మెల్సీల అనర్హత విషయంలోనూ కేసీఆర్ కు హైకోర్టు షాకిచ్చింది. వారి రద్దును అన్యాయమని చెప్పింది. ఇలా ఒక్కటేమిటీ కేసీఆర్ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఎన్నో పనులకు హైకోర్టు ఆగ్రహాలు, ఆదేశాలు వెలువరిస్తూనే ఉంది. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం అప్పుడే అమలు చేసినట్టు కలరింగ్ ఇవ్వడం అందరూ మరిచిపోయాక దాన్ని పెడచెవిన పెట్టడం చేస్తూనే ఉంది. ఎవరూ ఎన్ని చెప్పినా కేసీఆర్ మాత్రం తాను అనుకున్నది మాత్రమే చేసేలా ఉన్నట్టు కనిపిస్తోంది.