https://oktelugu.com/

Vishakapatnam: సుందరమైన విశాఖ తీరం ఇలా ఎందుకు మారుతోంది..?

Vishakapatnam: సముద్ర తీరాన్ని పంచుకొని పెద్ద పెద్ద భవనాలు.. అందమైన రోడ్లు.. పై నుంచి చూస్తే ఆహ్లాదంగా కనిపించే విశాఖ నగరం రూపురేఖలు మారిపోతున్నాయి. రోజురోజుకు సముద్రం ముంచుకొస్తుండడంతో తీర ప్రాంతం కోతకు గురవుతోంది. నగరంలోని ప్రముఖ ప్రాంతంగా పిలిచే ఆర్కే బీచ్ లోని పిల్లల పార్క్ వద్ద భూమి బీటలు వారింది. హార్బర్ నుంచి భీమిలి వరకు అడుగడుగునా పర్యాటక ప్రాంతంగానే చెప్పుకుంటారు. కానీ ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు కోతకు గురవుతున్నాయి.. ఇలా కోతకు గురువుతూ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 19, 2021 / 11:10 AM IST
    Follow us on

    Vishakapatnam: సముద్ర తీరాన్ని పంచుకొని పెద్ద పెద్ద భవనాలు.. అందమైన రోడ్లు.. పై నుంచి చూస్తే ఆహ్లాదంగా కనిపించే విశాఖ నగరం రూపురేఖలు మారిపోతున్నాయి. రోజురోజుకు సముద్రం ముంచుకొస్తుండడంతో తీర ప్రాంతం కోతకు గురవుతోంది. నగరంలోని ప్రముఖ ప్రాంతంగా పిలిచే ఆర్కే బీచ్ లోని పిల్లల పార్క్ వద్ద భూమి బీటలు వారింది. హార్బర్ నుంచి భీమిలి వరకు అడుగడుగునా పర్యాటక ప్రాంతంగానే చెప్పుకుంటారు. కానీ ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు కోతకు గురవుతున్నాయి.. ఇలా కోతకు గురువుతూ పెద్ద పెద్ద భవనాల వద్దకు వస్తున్నాయి. దీంతో విశాఖ తీరం, అక్కడికి వచ్చే పర్యాటకులు సురక్షితమేనా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    vizag beech1

    గత కొన్నేళ్లు గా విశాఖ నగరం దినదినాభివృద్ది చెందుతోంది. ఇటీవల ప్రభుత్వం విశాఖ నగర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించింది. అయితే సముద్రం ఉప్పొంగడంతో తీర ప్రాంతాలు అధికంగా కోతకు గురవుతున్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్కే బీచ్ నుంచి సబ్ మెరైన్, లైట్ హౌస్, వుడా పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్, సాగర్ నగర్, రుషి కొండ, తొట్లకొండ, భీమిలి వరకు బీచ్ తరుచూ కోతకు గురవుతోంది. అయితే వీటిలో అపార్ట్ మెంట్స్, టూరిజం హోటళ్లు, పోర్టు అవసరాల కోసం జరిపిన నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. అయితే అభివృద్ధి పేరిట ప్రభుత్వం కొండలను తవ్వడం వివాదానికి దారి తీస్తోంది.

    విశాఖ పర్యాటక ప్రాంతాల్లో అతిముఖ్యమైంది రుషికొండ బీచ్. ఇక్కడ తీరానికి ఆనుకొని అనేక కొండలు ఉన్నాయి. ఓ కొండపై 14 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం రిసార్ట్స్ ను నిర్మించింది. ప్రస్తుత ప్రభుత్వం దానిని తొలగించింది. మరో రిసార్ట్స్ ను నిర్మించేందుకు కొండను తవ్వడం, చదును చేయడంతో పచ్చని కొండ రూపురేఖలు మారిపోతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం 10 ఎకరాల్లో విస్తరించిన రుషికొండల్లో కేవలం 139 చెట్లు మాత్రమే తొలగించామంటున్నారు. కానీ ఇప్పటికే తీర ప్రాంతాల్లోని కొండలన్నీమాయమయ్యాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అనేక చోట్ల మత్స్యకార గ్రామాలైతే నిత్యం కోత భయంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

    విశాఖ జిల్లాలో తీరం వెంబడి 34 మత్స్యకార గ్రామాలున్నాయి. వాటిలో 15 గ్రామాలు తరుచూ కోతకు గురవుతుంటాయి. ఒకప్పుడు తీర ప్రాంతాలు కోతకు గురయ్యే నగరాల్లో విశాఖ ఉండేది కాదు. కానీ ఇప్పుడు విశాఖలోని అనేక గ్రామాలు కోతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో పోర్టు విస్తరణ, తీరం వెంబడి భారీ నిర్మాణాలు, కట్టడాలతో సమతుల్యత దెబ్బతిని మేటలు వేయకపోవడం, భారీ కోతకు గురికావడం వంటివి జరుగుతున్నాయి. దీంతో సముద్రం ముందుకు వస్తోందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఓషనోగ్రఫీ అధికారులు చెబుతున్నారు.

    విశాఖకు నిత్యం టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వారు బీచ్లోకి వెళ్లకుండా ఉండలేరు. కానీ విశాఖ తీరం కోతకు గురవడం చూసి టూరిస్టులు తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల ఇక్కడి చిల్డ్రన్ పార్క్ పరిస్థితి మరింత ఘోరంగా మారిందని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వాపోతున్నారు. దీంతో ప్రకృతి అందాలను చూసి ఆనందించడమే తప్ప బీచ్లోకి వెళ్లాలంటేనే భయమేస్తోందని అంటున్నారు.

    విశాఖ కోత తీరం కోతపై చెన్నై నిపుణుల బృందం అధ్యయనం చేసింది. వీటన్నింటిని చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.. టూరిజం అభివృద్ధి తప్ప తీరం కోత కారణంగా ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం లేదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అయితే ప్రమాద ప్రదేశాల్లో నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటుచేయాలని, కోతకు గురైన ప్రాంతాల్లోకి ఇతరులు వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.