KCR Maharashtra Politics: జాతీయ రాజకీయాలు అంటే సాధారణంగా అందరికీ గుర్తొచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. ఏ పార్టీ అయినా అక్కడి నుంచే జాతీయస్థాయిలో గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా ఇటీవల జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించారు. కానీ, ఆయన ఫోకస్ అంతా పొరుగున ఉన్న మహారాష్ట్రపైనే పెడుతున్నారు. అక్కడి నుంచే జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
రెండు రాష్ట్రలకు అధ్యక్షుల ప్రకటన..
జాతీయ పార్టీ పేరిట టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్.. మహారాష్ట్రకే వెళ్తున్నారు. ఏపీ, ఒడిశాలకు రాష్ట్ర అధ్యక్షుల్ని ప్రకటించారు.. మహారాష్ట్రకు అధ్యక్షుడిని ప్రకటించలేదు కానీ అక్కడ ఏకంగా మూడో బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నా.. అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ నెల 24న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మూడో బహిరంగసభ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కూడా కేసీఆర్ హజరవుతున్నారు. ఇటీవల కేసీఆర్ ఏ కార్యక్రమంలో మాట్లాడినా మహారాష్ట్రలో తమ బీఆర్‌ఎస్ పార్టీ దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఆ అభిప్రాయం బలపర్చడానికి సభలు నిర్వహిస్తున్నారు.
ఆ రాష్ట్రంపైనే దృష్టి.. ఎందుకంటే..
అయితే ఔరంగాబాద్ కూడా తెలంగాణ సరిహద్దే. ఇప్పటికి మహారాష్ట్రలో నిర్వహించిన మూడు సభలుం ఓ రకంగా నిజాం పాలనలో ఉన్నవే. సభల నిర్వహణ బాధ్యత ఆదిలాబాద్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలోని శివారు ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి. పైగా అక్కడ పెద్ద స్థాయిలో నగదు బదిలీ పథకాలు లేవు. పొరుగు ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఆకట్టుకుటాయని.. తాము బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఆ పథకాలన్నీ తమకూ వస్తాయన్న ఓ భావన వారికి కల్పిస్తున్నారు. అందుకే భారీ ఎత్తున ఖర్చు పెట్టి పథకాల గురించి శివారు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ పథకాలను వివరించే ఏడు వీడియో స్క్రీన్ ప్రచార రథాలను ఇప్పటికే విస్తృతంగా తిప్పుతున్నారు. తెలంగాణ రూపురేఖలు మార్చిన వందలాది స్కీంల విశిష్టతను ఈ డిజిటల్ స్క్రీన్ ప్రచార రథాల ద్వారా మహారాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని వారి మద్దతు పొందుతామని అంటున్నారు.
ఎన్‌సీపీని దెబ్బకొట్టేందుకే..
ఇక మహారాష్ట్రలో బీజేపీ మినహా స్థానిక పార్టీలు ఏవీ బలంగా లేవు. శివసేన చీలిపోయింది. ఎన్‌సీపీ చతికిలపడింది. కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో కొత్త పార్టీకి అక్కడ అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. మరోవైపు అక్కడ శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీని దెబ్బకొట్టాలని కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారు. ఎందుకంటే శరద్‌పవార్ ప్రధాని రేసులో ఉన్నాడు. దీంతో దక్షిణాది నుంచి తానొక్కడినే ప్రధాని రేసులో ఉండేలా వచ్చే ఎన్నికల్లో ఎన్‌సీపీ అడ్రస్ లేకుండా చేయాలని కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ వ్యూహాలు మహారాష్ట్రలో ఏమేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.