https://oktelugu.com/

Ram Column: ఆంధ్ర రాజకీయాల్లో జగన్ ప్రభావం ఎందుకు తగ్గటం లేదు?

Ram Column: గత నెలరోజుల్లో మూడు సర్వేలు ( ఇండియా టీవీ , ఇండియా టుడే, టైమ్స్ నౌ ) వెలువడ్డాయి. ఈ మూడూ ఇంచుమించుగా ఒకటే చెప్పాయి. ఆంధ్రాలో జగన్ హవా కొనసాగుతుందని. దీనితో నిన్నటిదాకా తిరిగి అధికారంలోకి వస్తామని భరోసాతో వున్న టీడీపీ శ్రేణులు డీలాపడ్డట్టు కనబడుతున్నాయి. ఇటీవల వీళ్ళ ధీమా ఎక్కడిదాకా వెళ్లిందంటే జనసేనతో ఎటువంటి పొత్తు వద్దు మనం ఒంటరిగానే గెలుస్తామనేదాకా. ఇంకేముంది అంతకుముందు స్నేహహస్తాలు చాచిన చంద్రబాబు మొహం చాటేశాడు. […]

Written By:
  • Ram
  • , Updated On : August 17, 2022 / 08:57 AM IST
    Follow us on

    Ram Column: గత నెలరోజుల్లో మూడు సర్వేలు ( ఇండియా టీవీ , ఇండియా టుడే, టైమ్స్ నౌ ) వెలువడ్డాయి. ఈ మూడూ ఇంచుమించుగా ఒకటే చెప్పాయి. ఆంధ్రాలో జగన్ హవా కొనసాగుతుందని. దీనితో నిన్నటిదాకా తిరిగి అధికారంలోకి వస్తామని భరోసాతో వున్న టీడీపీ శ్రేణులు డీలాపడ్డట్టు కనబడుతున్నాయి. ఇటీవల వీళ్ళ ధీమా ఎక్కడిదాకా వెళ్లిందంటే జనసేనతో ఎటువంటి పొత్తు వద్దు మనం ఒంటరిగానే గెలుస్తామనేదాకా. ఇంకేముంది అంతకుముందు స్నేహహస్తాలు చాచిన చంద్రబాబు మొహం చాటేశాడు. చంద్రబాబుకి ఇది కొత్తేమీ కాదు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవటం అనే ఆటలో ఆరితేరిన హస్తం ఆయనది. ఇప్పుడు మళ్ళా స్నేహహస్తాలు చాటుతాడు. ఇప్పటికే మోడీతో జత కట్టటానికి పడని తాపత్రయం లేదు. కాకపోతే అది అంత తేలికైన విషయం కాదు. మరి ఈ సర్వేలపై చంద్రబాబు అనుకూల మీడియా కిమ్మనటంలేదు. జగన్ అనుచరుల్లో ఎక్కడలేని అతిశయం, గర్వం తొణికిసలాడుతుంది. నిజంగానే ఎన్నికల ఫలితాలు ఇలాగే వుండబోతున్నాయా?

    CM JAGAN

    రాజకీయాల్లో 2 సంవత్సరాలు చాలా దీర్ఘకాలం. ఈరోజుకి ఈ అంచనా నిజం కావచ్చు. జగన్ హవా నడుస్తుండవచ్చు. కొట్టిపారేయలేము. వరసగా మూడు సర్వేలు ఒకే ఫలితం ఇస్తుంటే ఇది తప్పు అని చెప్పటం ఆత్మవంచనే అవుతుంది. కాబట్టి ఈ అంచనామీద ఆధారపడే వచ్చే రెండు సంవత్సరాల రాజకీయాల్ని పరిశీలిద్దాం. ముందుగా బీజేపీ వ్యూహం ఎలా వుండబోతుందో చూద్దాం. బీజేపీకి స్వతహాగా ఆంధ్రాలో అధికారం కల్ల. ఎవరో ఒకరి మీద ఆధారపడటమో, పొత్తు పెట్టుకోవటమో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆంధ్రాలో బీజేపీకి ఆశలు లేవు. కానీ ఆంధ్ర ఎంపీల అవసరం ఎంతైనా వుంది. బీహార్ లో నితీశ్ కుమార్ NDA నుంచి బయటకెళ్లిన తర్వాత రాజ్యసభలో బీజేపీ కూటమికి స్వతహాగా మెజారిటీ లేదు. అటు బీజేడీ మీదనో, ఇటు వైసీపీ మీదనో ఆధారపడక తప్పదు. ఈ నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆంధ్రాలో వ్యూహం ఉంటుంది. కాబట్టి బీజేపీ తొందరపడి పొత్తులపై ఆరాటం చూపించదు. ఎన్నికలముందే దాని వ్యూహానికి పదును పెడుతుంది. టీడీపీకి వున్న ఆదుర్దా బీజేపీకి వుండదు.

    Also Read: Tipu Sultan vs Veer Savarkar Poster Row: వీరసావర్కర్, టిప్పు సుల్తాన్ ల కోసం మళ్లీ మత ఘర్షణ.. కత్తిపోట్లు

    ఇక జనసేన. ఇప్పటికే ఒకసారి అనుభవమయ్యింది. స్నేహహస్తం చాచి వెనక్కుపోయిన వైనం నాయకత్వానికి తెలియందికాదు. అందుకనే పొత్తులపై ఆరాటం లేదు. ఈసారి స్వంతంగానే ఎదగాలనే గట్టి పట్టుదలతో వుంది. పరిస్థితులు కూడా మెల్లి మెల్లిగా సానుకూలంగా మారుతున్నాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయి నిర్మాణంపై దృష్టి సారించింది. కావాల్సిన అస్త్ర శస్త్రాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమై వుంది. అందుకే దాని బలం, ప్రభావం సర్వేల్లో ప్రతిబింబించటం లేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలోవిస్తృత పర్యటన చేసిన తర్వాతనే దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది చెప్పలేం. స్వంత బలాన్ని అంచనా వేసుకున్న తర్వాతనే పొత్తులగురించి ఆలోచించే అవకాశముంది. కాబట్టి ఇప్పటికిప్పుడు పొత్తుల అంశాన్ని కార్యాచరణలో పెట్టకపోవచ్చు. ప్రస్తుతానికి జనసేన సర్వేల్లో అదృశ్యశక్తిగానే ఉంటుంది.

    ఇక ప్రధాన పార్టీలైన వైసీపీ , టీడీపీ లు ప్రస్తుతానికి వాళ్ళే క్రీడారంగంలో ఆటగాళ్లగా చెలామణి అవుతామని భావిస్తూ వుంటారు. అలా ఉండటమే మంచిదికూడా. వాళ్ళు నిబ్బరంగా, అతి విశ్వాసంలో ఉండటం జనసేనకు కలిసివచ్చే అంశం. క్షేత్రస్థాయిలో ప్రజలు ప్రస్తుతానికి జగన్ వైపు ఉండటానికి సంక్షేమ పధకాలు ఒక అంశమయితే చంద్రబాబుతో పోల్చుకొని జగన్ వైపు ఉండటం మరో అంశం. దీన్నే by default ఎన్నికగా పరిగణించవచ్చు. కానీ జగన్ పాలన దరిద్రంగా, దారుణంగా ఉందనేది ఎక్కువమందిలో వున్న ప్రజాభిప్రాయం. అంటే సరైన ప్రత్యామ్నాయం ఉంటే బయటకొచ్చి వ్యతిరేకంగా మాట్లాడతారు. అదే చంద్రబాబు ప్రత్యామ్నాయ నాయకత్వమయితే జగన్ తోటే వుండే అవకాశం మెండుగా వుంది. అందుకనే పవన్ కళ్యాణ్ పై పెద్ద గురుతర బాధ్యత వుంది. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సఫలీకృతం చేసే బాధ్యత తనమీద వుంది. అందుకే తను వేసే ప్రతిఅడుగు ఆలోచించి వేయాలి. తనపై ప్రజలకి సదభిప్రాయం వుంది. నిజాయితీపరుడు, సేవాభావం నిండుకున్నవాడు, విలువలతోకూడిన రాజకీయాలు కోరుకుంటున్నవాడు అనే సానుకూల దృక్పధం ఇప్పటికే ఏర్పడింది. కావాల్సిందల్లా ఈ సెంటిమెంట్ ని ఓట్ల రూపంలోకి మార్చుకోగలగటం.

    CM JAGAN

    అది పూర్తిగా తన నాయకత్వ పటిమ, సామర్థ్యంపై ఆధారపడివుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజలు కోరుకుంటుంది పూర్తికాలం ప్రజలమధ్య వుండటం. అది జరిగిన రోజు ఆంధ్ర రాజకీయాలు వేగంగా మారతాయి. జరగబోయే పాదయాత్ర తో ఆ మార్పు మొదలవుతుంది. అప్పట్నుంచి మొదలుకొని పూర్తికాలం ఎన్నికలదాకా ప్రజలమధ్య ఉండగలిగితే ఈ సర్వేల జోస్యాలు కుదేలవుతాయి. పొత్తులకోసం మిగతా పార్టీలే వెంటబడతాయి. ఏ నోటితో వెక్కిరిస్తున్నారో అదే నోళ్లు వెళ్ళపెడతాయి. ఇదంతా జరగాలంటే పవన్ కళ్యాణ్ లోకకళ్యాణంకోసం పూర్తి సమయాన్ని కేటాయించాలి. అదిజరిగినరోజు మార్పు దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. ఈరోజు జనసేన ఎక్కడుంది అన్న వాళ్ళే జనసేన అన్ని చోట్లా ఉందని కొనియాడుతారు. ఆరోజు మాత్రమే జగన్ ప్రభావం మటుమాయమవుతుంది. కాబట్టి జగన్ ప్రభావం పోవటం, ఉండటం పూర్తిగా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే వుంది. ఆ మార్పు జరిగి మూడో శక్తి అధికారంలోకి వస్తుందని ఆశిద్దాం

    రామ్

    Also Read:Chandrababu: చంద్రబాబు నయా ఫార్ములా..ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్

    Tags