https://oktelugu.com/

గ్రేటర్‌‌ వాసులు ఎందుకు ఓటు వేయరు..?

హైదరాబాద్‌.. అదో మహా నగరం. ఎంత పెద్ద నగరం అంటే ఎక్కడెక్కడి వారినో అక్కున చేర్చుకున్న గ్రేట్‌ గ్రేటర్‌‌ సిటీ. ఇక్కడ జనాభా ఎక్కవే.. ఇక్కడి ఓటర్ల సంఖ్యా ఎక్కువే. ఇక్కడి వాసులు కూడా ఎంతో చైతన్యవంతులు.. కానీ, ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రారు. అదేంటో గ్రేటర్‌‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయంటే వారిలో పెద్దగా ఆసక్తి కనిపించదు. అందుకే.. సగం శాతం కూడా పోలింగ్‌ శాతం నమోదు కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసే అంశం. హైదరాబాద్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 1, 2020 9:47 am
    Follow us on

    GHMC Voting
    హైదరాబాద్‌.. అదో మహా నగరం. ఎంత పెద్ద నగరం అంటే ఎక్కడెక్కడి వారినో అక్కున చేర్చుకున్న గ్రేట్‌ గ్రేటర్‌‌ సిటీ. ఇక్కడ జనాభా ఎక్కవే.. ఇక్కడి ఓటర్ల సంఖ్యా ఎక్కువే. ఇక్కడి వాసులు కూడా ఎంతో చైతన్యవంతులు.. కానీ, ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రారు. అదేంటో గ్రేటర్‌‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయంటే వారిలో పెద్దగా ఆసక్తి కనిపించదు. అందుకే.. సగం శాతం కూడా పోలింగ్‌ శాతం నమోదు కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసే అంశం. హైదరాబాద్ నగరంలో ఓటర్లు సగం మంది పోలింగ్ బూత్ వైపునకే రారు. దిగువ మధ్యతరగతి, శ్రామిక వర్గాలు, బస్తీ ప్రజలే ఓటింగులో ఎక్కువగా కనిపిస్తుంటారు.

    Also Read: నేడు పోలింగ్.. నగర వాసుల తీర్పు ఎలా ఉండనుంది?

    నగరంలో ఓట్లు వేసే వారిలో మూడొంతుల మంది ధనం, మద్యం, సెంటిమెంటు చూసుకుంటూ పోలింగ్‌లో పాల్గొంటు ఉంటారు. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం మాత్రం అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో సాగింది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ విజయం సాధిస్తే తెలంగాణపై జెండా ఎగరవేసినట్లే ఆయా పార్టీలు భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అంత పెద్ద విజయం సాధించిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి లీడర్లకు సైతం టెన్షన్‌ పట్టుకుంది.

    మరోవైపు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కుచించుకుపోయింది. తెలుగుదేశం పార్టీ కాడెత్తేసింది. అయినా.. ఇప్పుడు గ్రేటర్‌‌ త్రిముఖ పోటీ కనిపిస్తోంది. రాష్ట్రంపై రాజకీయ పట్టుకోసం బీజేపీ, పరువు కోసం టీఆర్ఎస్, విస్తరణ కోసం ఎంఐఎం పాకులాడుతున్నట్లుగా ఈ ఎన్నిక స్పష్టం చేసింది. లోకల్‌ రోడ్లు, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, పారిశుధ్యం, ప్రజారోగ్యం వంటివి మున్సిపాలిటీల ప్రధాన విధులు. కానీ.. హైదరాబాద్ ఎన్నికలో అతికీలకమైన కార్పొరేషన్ బాధ్యతలపై పార్టీలు పెద్దగా దృష్టి పెట్టలేదు. పైపెచ్చు పార్టీలు తమ నాయకత్వాన్ని ప్రొజెక్టు చేసుకోవడానికే ప్రయత్నించాయి. స్థానిక నాయకత్వం మాటనే ప్రస్తావనలోకి తీసుకురాలేదు.

    నగర ప్రజల్లో ఉదాసీనత పాలకులకు వరంగా చెప్పుకోవాలి. హైదరాబాద్ మున్సిపాలిటీ కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే నగర ప్రజలు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారు. అలాగే ఎన్నికల్లో తమ ప్రతినిధులను ఎన్నుకోవడం పై శ్రద్ధ పెట్టడం లేదు. ఎప్పుడూ 50 శాతం కూడా చేరని పోలింగ్ పర్సంటేజీనే దీనికి నిదర్శనం. గ్రామాల్లోనూ, నగర పంచాయతీలు, చిన్న మున్సిపాలిటీల్లో కనిపించిన ఓటరు చైతన్యం హైదరాబాద్ లో కాగడా పెట్టి వెతికినా కానరాదు. అక్షరాస్యత, తలసరి ఆదాయం వంటి విషయాల్లో ముందుండే నగర పౌరులు తమ రోజువారీ జీవితానికి వసతులు సమకూర్చే పాలక సంస్థ ఎన్నికను పట్టించుకోకపోవడం దురదృష్టకరమే.

    Also Read: జీహెచ్ఎంసీ అప్డేట్: పోలింగ్ ప్రారంభం.. ఓటర్ల బారులు

    అందుకే ప్రధాన పార్టీలన్నీ భావోద్వేగాల ఆధారంగానే ఓటర్లను సమీకరించే ఎత్తుగడలు వేశాయి. సెంటిమెంటును రంగరించేందుకు మూడు పార్టీలు ప్రయత్నించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తాను జాతీయ స్థాయి నాయకుడిని కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవంతో ఢిల్లీని ఢీకొట్టాలంటే హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలనే భావనను ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నించారు. ప్రచారం పేరెత్తకపోయినా పరోక్షంగా ఓటర్లపై ముద్ర పడే విధంగా ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రచారం పతాకస్థాయిలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చి వెళ్లారు. అదీ కరోనా వంటి ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించి కీలక అంశంపై సమీక్షించారు.

    దేశంలో ముంబై , ఢిల్లీ ఎన్నికలు చాలా ప్రతిష్ఠాత్మకంగా సాగుతుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరింది. పార్టీలు ఎంతగా ప్రయత్నించినా ఓటింగు పర్సంటేజీ పెరగకపోతే నిజమైన ప్రజాభిప్రాయం వ్యక్తం కాదు. జనాభాలో 50 శాతం లోపునకే పోలింగు పరిమితమైతే మొత్తం ప్రజల ఓట్లలో 20 శాతం తెచ్చుకున్నవారు సైతం గద్దెనెక్కి కూర్చునే అవకాశం ఉంది. పోటాపోటీగా సాగిన ప్రచారాన్ని , ఓటరు నాడిని బట్టి చూస్తే హైదరాబాద్ లో అయిదో వంతు ఓట్లతోనే అధికారం దాఖలయ్యే సూచనలు కానవస్తున్నాయి. కనీసం నేడు జరుగుతున్న ఎన్నికల్లో అయినా ఓటర్లు తమ చైతన్యాన్ని చాటుతారో చూడాల్సిందే.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్